శమీ వృక్షం ఇంట్లో నాటితే ఏం జరుగుతుంది!

 

శమీ వృక్షం ఇంట్లో నాటితే ఏం జరుగుతుంది!


శమీ వృక్షం గురించి సాధారణ రోజుల కంటే.. శరన్నవరాత్రి సమయంలో ఎక్కువ ప్రస్తావన వస్తుంది.  చాలామందికి శమీ వృక్షం జమ్మి చెట్టుగానే పరిచయం.  శమీ వృక్షం లేదా జమ్మి వృక్షం సాధారణంగా శివాలయాలలోనూ, ఇతర దేవాలయాలలోనూ కనిపిస్తూ ఉంటుంది.  పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళేముందు తమ ఆయుధాలు అన్నీ శమీ వృక్షం మీద దాచిపెట్టి వెళ్లారని చెబుతారు.  శమీ వృక్షానికి దైవికపరగా కూడా చాలా ప్రాముఖ్యత ఉంది.  శమీ వృక్షాన్ని ఇంట్లో నాటడం గురించి చాలామందిలో సందేహాలు ఉంటాయి. శమీ మొక్కను కొన్ని వాస్తు నియమాల ఆధారంగా ఇంట్లో నాటడం వల్ల చాలా మంచి జరుగుతుందని అంటున్నారు.  ఇంతకీ శమీ వృక్షం ఇంట్లో నాటితే ఏం జరుగుతుంది? శమీ వృక్షం నాటడానికి వాస్తు ఎలా చూసుకోవాలి? తెలుసుకుంటే..

దిశ..

వాస్తు శాస్త్రం ప్రకారం శమీ వృక్షాన్ని ఎల్లప్పుడూ ఇంటి బయట, అంటే బాల్కనీ, టెర్రస్ లేదా తోటలో నాటాలి. దానిని ఇంటి లోపల ఎప్పుడూ నాటకూడదు. ఇంటి దక్షిణ దిశలో దీనిని నాటడం శుభప్రదం.  అలాగే, శమీ వృక్షాన్ని నాటడానికి ఇంటికి తూర్పు వైపు లేదా ఈశాన్య దిశ ఉత్తమమైన ప్రదేశమని వాస్తు శాస్త్రం చెబుతుంది.

శమీ వృక్షం ఫలితాలు..

ఇంట్లో శమీ వృక్షాన్ని నాటి, క్రమం తప్పకుండా పూజిస్తే,  శని దేవుని ఆశీస్సులు లభిస్తాయట. శమీ వృక్షం శనిదేవుడికి, శివుడికి కూడా చాలా పవిత్రమైనది.

శివలింగానికి శమీ ఆకులను సమర్పించడం కూడా శివుడి ఆశీస్సులను లభించేలా చేస్తుంది.

జాతకంలో కనిపించే అశుభ గ్రహాల ప్రభావం నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

ప్రతి శనివారం శమీ వృక్షాన్ని పూజించి, ఆవనూనె దీపాన్ని వెలిగించాలి. దీనివల్ల శని దశ ప్రభావాలు తగ్గుతాయి.

ఎవరి జీవితంలో అయినా శని సడే సతి,  ఏలినాటి శని,  అర్ధాష్టమ శని వంటివి  అనుభవిస్తున్నట్లయితే వారు ఇంట్లో తప్పకుండా శమీ వృక్షాన్ని నాటి పూజించడం చాలా మంచిది.

ఇంట్లో శమీ మొక్కను నాటడం వల్ల వైవాహిక జీవితంలోని అడ్డంకుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.

                                    *రూపశ్రీ.