పరమాత్మ గురించి అందరూ అర్థంచేసుకోవలసిన విషయం!
పరమాత్మ గురించి అందరూ అర్థంచేసుకోవలసిన విషయం!
బుద్ధి గుణము బుద్ధిమంతులలో ఉంటుంది. తేజస్సు అనే గుణము ధీరులలో ఉంటుంది. బుద్ధి గుణము ఎక్కువగా ఉంటే బుద్ధిమంతుడు అని అంటారు. అలాగే ధీరత్వము, ధైర్యము, వీరత్వము, పరాక్రమము వీటన్నిటి వలన లభించే ఒకవిధమైన తేజస్సు ఉంటే వారిని తేజస్వినులు అని అంటారు. కొంత మంది తేజస్విని అని పేరు పెట్టుకుంటారు కాని ఊసురోమంటుంటారు. తేజో గుణం ఉంటేనే వారు సార్థకనామధేయులు అవుతారు.
పరమాత్మ నేను సర్వభూతములలో ఉన్నాను అని చెప్పాడు. అయితే ఆయనే మళ్లీ ఈ చరాచర సృష్టిలో ఉన్న సర్వభూతములకు మూలకారణమైన బీజమును నేనే అని అంటున్నాడు. అంటే నా నుండి ఈ అనంత విశ్వం ఆవిర్భవించింది అని అర్ధం. ఒక్కసారి బిగ్ బాంగ్ థీయరీ గుర్తుచేసుకుంటే పరమాణు రూపంలో ఉన్న పదార్థం విస్ఫోటం చెంది ఈ అనంత విశ్వం ఆవిర్భవించింది అని నేటి శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ రెండింటికీ సరిపోయింది కదా. విష్ణువు బొడ్డులోనుండి పద్మము అంటే విశ్వం ఆవిర్భవించింది. ఆ పద్మంలో నుండి బ్రహ్మ అంటే సృష్టి మొదలయింది. అంటే ఈ సృష్టికి మూలం పరమాత్మ. అదే బీజంమాం అనే పదాలకు అర్ధం.
అంతేకానీ, సముద్రము, ఆదిశేషువు, దాని మీద విష్ణువు, ఆయన బొడ్డు, అందులో నుండి తామర కాడ, దానికో పువ్వు, అందులో బ్రహ్మ ఇలా సగుణాకారంగా చూస్తే ఏమీ అర్థం కాదు. దాని లోపల ఉన్న అర్థం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి.
ఈ సృష్టికి మూల కారణం పరమాత్మ. అంటే ఏవీ లేనపుడు ఎవడు ఉన్నాడో వాడే మూల కారణము, ఒక విత్తనం వేస్తే చెట్టు మొలిచింది. పురుషుడి వీర్యం స్త్రీశోణితంలో కలిసి మానవుడు జన్మించాడు. అలాగే పశువులు, పక్షులు మొదలయినవి పుడుతున్నాయి. ఇది మనకు కనపడే కారణం. అసలు మూలకారణం ఒక్కడే. నిర్వికారుడు నిర్గుణుడు, నిరాకారుడు అయిన పరమాత్మ. దీనిని తెలుసుకోవడమే జ్ఞానము.
అందరూ ఆ పరమాత్మలో నుండి ఉద్భవించినపుడు, వాడు ఎక్కువ వీడు తక్కువ అనే బేధము ఉండకూడదు. అంతా సమానమే. ఎక్కువ కులం, తక్కువకులం, ధనిక, పేద, అనే భేదము మరిచిపోవాలి. ఎందుకంటే అందరికీ బీజము ఆ పరమాత్మ. మామిడి విత్తనము వేస్తే మామిడి పండు వస్తుంది. అలాగే ఆ పరమాత్మ బీజము నుండి పరమాత్మ స్వరూపులే ఉద్భవిస్తారు. మనం అందరం పరమాత్మ స్వరూపులమే. ఈ ఎక్కువ తక్కువలు మనం కల్పించుకున్నవి. కేవలం మనలో ఉన్న తెలియని తనం అంటే అవిద్య వలన ఏర్పడ్డాయి. శాస్త్రజ్ఞానముతో అవిద్యను తొలగించుకోవాలి. ఇదే ప్రాక్టికల్ జ్ఞానము, విజ్ఞానము. ఈ విషయాన్ని అందరిలోనూ కలిగించాలి.
ఎప్పుడైతే ఎక్కువ కులము వాడు, తక్కువ కులం వాడు, ధనవంతుడు, దరిద్రుడు, దీనుడు, వీళ్లందరూ తన యొక్క మూలము పరమాత్మ, తాను పరమాత్మ అంశ అని తెలుసుకుంటాడో అప్పుడు ధైర్యంగా బతకగలడు. మనం ఇతర మతములలో చెప్పినట్టు పాపులం కాదు. భగవంతుని అంశలో నుండి పుట్టాం అన్న గొప్ప తత్వం అలవరచుకోవాలి. మహాసముద్రంలో చిన్ని చిన్ని అలలు, ఉవ్వెత్తున అల్లంత ఎత్తున ఎగిసి పడే అలలు వస్తుంటాయి. చిన్ని అలలకు పెద్ద అలలకు జీజం మూలం సముద్రమే. అంటే అన్నిటికీ మూలం పరమాత్మ. పరమాత్మలో నుండి మనం పుట్టాం కాబట్టి మనం అందరూ పరమాత్మస్వరూపులమే. అయితే ఆ పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి దాన్ని అనుభూతి చెందడానికి తగినంత జ్ఞానం మనమే సంపాదించుకోవాలి!!
◆వెంకటేష్ పువ్వాడ.