ఈ మొక్కలు ఇంట్లో ఉంటే శుక్ర గ్రహం బలపడుతుంది.. లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందట..!
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే శుక్ర గ్రహం బలపడుతుంది.. లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందట..!
నవగ్రహాలలో ఒక్కో గ్రహం ఒక్కో స్థితికి కారణం అని చెబుతారు. వీటిలో శుక్రగ్రహం విషయానికి వస్తే.. అందం, భౌతిక సౌకర్యాలు, సంపద, ప్రేమ, వైవాహిక జీవితం మొదలైన వాటికి శుక్ర గ్రహమే కారణం అని చెబుతారు. శుక్రగ్రహం బలంగా ఉంటే పైవన్నీ సవ్యంగా ఉంటాయి. కానీ శుక్రుడు బలహీనంగా ఉంటే.. దుబారా ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు, వైవాహిక జీవితంలో గొడవలు వంటివి ఎదురవుతాయని చెబుతారు. ఈ కారణాల వల్ల చాలామంది శుక్ర గ్రహాన్ని బలపరచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇంట్లో కొన్ని మొక్కలను పెంచుకోవడం వల్ల శుక్ర గ్రహం బలపడుతుందట. పైగా ఈ మొక్కలు పెంచుకోవడం వల్ల శుక్ర గ్రహం మాత్రమే కాకుండా.. సంపదకు అధి దేవత అయిన లక్ష్మీదేవి కూడా ప్రసన్నం అవుతుందట. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
శుక్రుడు బలహీనంగా ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి..
శుక్ర గ్రహం బలహీనంగా ఉంటే సంతోషం లేకపోవడం లేదా వాహనం, ఇల్లు, దుస్తులు మొదలైన వాటికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చట. జాతకంలో శుక్రుడి స్థానం బలహీనంగా ఉంటే, వివాహంలో ఆలస్యం లేదా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
భాగస్వామితో అభిప్రాయ భేదాలు లేదా ప్రేమ జీవితంలో తరచుగా గొడవలు తలెత్తడం మొదలైనవి కూడా శుక్రుడు బలహీనంగా ఉన్నాడనడానికి లక్షణాలు.
బాగా సంపాదిస్తున్నప్పటికీ డబ్బు నిలవక, అనవసర ఖర్చులు పెరిగితే, దానికి కూడా శుక్ర గ్రహం బలహీనంగా ఉండటం వల్ల ఇలా జరుగుతుందని చెబుతారు. ఈ సమస్యలు కనిపిస్తే జాతకంలో శుక్రుడి స్థానం బలహీనంగా ఉంటుందని చెబుతారు.
అయితే ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం వల్ల శుక్రగ్రహ బలాన్ని పెంచుకోవచ్చట.
దానిమ్మ..
జాతకంలో శుక్రుడి స్థానాన్ని బలపరచుకోవడానికి, దానిమ్మ చెట్టును నాటవచ్చు. దానిని ఆగ్నేయ దిశలో నాటడం శుభప్రదంగా భావిస్తారు. సరైన దిశలో చెట్టును నాటడం సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుందట. దీనివల్ల ఆస్తి మంచి ధరకు అమ్ముడయ్యే అవకాశాలు పెరుగుతాయట. అంతేకాకుండా, ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతారు.
తులసి..
తులసికి శుక్ర గ్రహంతో సంబంధం ఉంటుందని చెబుతారు. హిందూ మతం ప్రకారం తులసి మొక్క చాలా పవిత్రమైనది, లక్ష్మీదేవి నివాసం అని కూడా చెబుతారు. అందువల్ల ఇంట్లో తులసి మొక్కను నాటడం అన్ని విధాలా ప్రయోజనకరం. వాస్తు ప్రకారం, దీనిని ఆగ్నేయ దిశలో నాటాలి. ఇలా చేయడం వల్ల శుక్రుని అనుగ్రహం లభించి, సానుకూల మార్పులు వస్తాయి. ఇందుకోసం తులసిని క్రమం తప్పకుండా పూజించడం అవసరం.
మందారం..
ఇంట్లో మందార మొక్కను నాటడం చాలా మంచి శుభాలు చేకూరుస్తుంది. ఇది నవగ్రహాలను శాంతింపజేసి, శుక్రుడిని బలపరుస్తుందట. దీనివల్ల జీవితంలోని సమస్యలు తగ్గి, ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని చెబుతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా లేదా ఆదాయం వస్తున్నప్పటికీ డబ్బు నిలవకపోయినా మందారం మొక్కను పెంచుకోవడం చాలా మంచిదని చెబుతారు.
గులాబీ..
ఇంటికి ఆగ్నేయ దిశలో గులాబీ మొక్కను నాటడం చాలా మంచిదని చెబుతారు. ఇలా చేయడం వల్ల బాలెన్స్ ఉంటుందట. శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుాతరు. అలాగే, శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తాజా గులాబీలను సమర్పించడం కూడా చాలా మంచిదట. ఇది జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సును తెస్తుందని చెబుతారు. అయితే ఈ మొక్కలన్నింటినీ ఆగ్నేయ దిశలో నాటడం వల్ల మంచి ఫలితం ఉంటుందట.
*రూపశ్రీ.