వాస్తులో గేటు ఎటువైపు ఉంటే మంచిది? (Vastu and Gate)
వాస్తులో గేటు ఎటువైపు ఉంటే మంచిది?
(Vastu and Gate)
వాస్తు నియమాలలో ఇంటి గేటుకు చాలా ప్రాముఖ్యం ఉంది. ఇంటినుండి బయటకు వచ్చే గేటు మనపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. అందువల్ల గేటు ఎటు ఉంటే మంచిదో తెలుసుకుందాం.
ఏ ఇంటిస్థలానికైనా ఒక వీధి తప్పకుండా వస్తుంది. కొన్ని ప్లాట్లకు రెండు వైపులా రోడ్డు వస్తుంది. అరుదుగా మూడువైపుల రోడ్డు వచ్చే ఇంటి స్థలాలు ఉంటాయి.
ఇంటి స్థలం కొనుగోలు చేసేటప్పుడే ఏ దిక్కున రోడ్డు వస్తుంది అనేది చూసుకోవాలి. ఎందుకంటే, వీధి వచ్చిన వైపే కదా గేటు ఏర్పాటు చేసుకోవాలి. ఒక స్థలానికి రెండు లేదా మూడు వైపులా రోడ్డు వస్తే, అన్ని వైపులా గేటు పెట్టుకోవాలనే నియమం ఏమీ లేదు.
ఇంటికి తూర్పు, ఉత్తర దిక్కుల్లో వీధులు కనుక ఉన్నట్లయితే రెండు గేట్లు ఉండటం శ్రేష్టం. అలా కాకుండా ఉత్తర, పశ్చిమ దిక్కుల్లో రోడ్లు ఉంటే, ఉత్తర దిక్కున గేటు పెట్టుకోవాలి. పడమర, దక్షిణ దిశల్లో వీధులు గనుక ఉన్నట్లయితే దక్షిణాన, తూర్పు, దక్షిణ దిక్కుల్లో వీధులు ఉన్నట్లయితే తూర్పు వైపున గేటు ఉండటం మంచిది.
తూర్పు, పడమర దిక్కుల్లో వీధులు ఉన్నప్పుడు తూర్పు వైపున గేటు ఉండటం మంచిది. ఉత్తర, దక్షిణాల్లో రోడ్డు వచ్చినప్పుడు ఉత్తరాన గేటు ఏర్పాటు చేసుకోవడం మంచిది.
ఒకవేళ ఇంటికి మూడు వైపులా గనుక రోడ్డు వచ్చినట్లయితే ఉత్తర, తూర్పు దిక్కుల్లో గేటు ఉన్నా, లేదా ఈ రెండు వైపుల్లో ఎటో ఒకవైపు ఉన్నా మంచిది. దక్షిణంలో గేటు పరవాలేదు. పశ్చిమాన గేటు లేకపోవడం మంచిది.
చాలా పెద్ద భవనం అయి, నాలుగు వైపులా గనుక వీధులు వస్తే తూర్పు, ఉత్తరాల్లో గేటు ఏర్పాటు చేసుకోవాలి. దక్షిణ, పడమర దిక్కుల్లో గేటు పెట్టకపోవడం మంచిది.