Read more!

వాస్తులో ఇంటి ఆకృతి ఎలా ఉండాలి? (Vastu – House Shape)

 

వాస్తులో ఇంటి ఆకృతి ఎలా ఉండాలి?

(Vastu – House Shape)

 

వాస్తులో ఇంటి ఆకృతికి కొన్ని నిర్దేశాలు ఉన్నాయి. ఇల్లు చతురస్రంగా (Square) కానీ, దీర్ఘ చతురస్రంగా (Rectangle) కానీ ఉండాలి. అలాంటి ఇల్లు మాత్రమే శ్రేయస్కరం. కొన్ని ఇళ్లను చూస్తుంటాం.. ఒక క్రమపద్ధతిలో లేకుండా కొన్నిచోట్ల లోనికి చొచ్చుకురావడం, ఇంకొన్నిచోట్ల బయటకు పొడుచుకు రావడం, మూలలు వక్రంగా తోసుకుపోవడం లాంటి ఎగుడుదిగుడులు కనిపిస్తాయి. కొన్ని ఇళ్లలో ఒకటి కంటే ఎక్కువ వంకరలు కూడా ఉండటం కనిపిస్తుంది. ఇవన్నీ దోషాలే.

స్థలంలో ఎగుడుదిగుడులు లేకుండా, చతురస్రం లేదా, దీర్ఘ చతురస్రం ఆకృతిలో ఉన్న ఇళ్ళ స్థలాలను మాత్రమే కొనుగోలు చేయాలి. అలాంటి స్థలాల్లో కట్టిన ఇళ్లను మాత్రమే కొనుక్కోవాలి.

ఇంటికి ఈశాన్య దిక్కులో గది తప్పక ఉండాలి. అక్కడ ఖాళీగా ఉంచి "L” ఆకృతిలో ఇల్లు కట్టడం మంచిది కాదు. ఈశాన్య దిశలో ఉన్న గదిని పూజకు కేటాయించాలి. ఈశాన్య దిక్కున పొరపాటున కూడా బాత్రూం ఉండకూడదు.

ఇంటిచుట్టూ ఉండే ప్రహరీ గోడ ఇంటికి సరిహద్దును తెలియచేస్తూ రక్షణ ఇవ్వడమే కాదు, అందాన్ని ఇస్తుంది. ప్రహరీ గోడ లేకుంటే ఇల్లు సంపూర్ణంగా ఉన్నట్టు ఉండదు.

ప్రహరీ గోడకు కూడా వాస్తులో కొన్ని సూచనలు ఉన్నాయి.

ప్రహరీ గోడ పునాది లోతు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల్లో సమానంగా ఉండాలి. ప్రహరీ ఎత్తు, వెడల్పులు ఎలా ఉండాలంటే..

వాస్తులో ఒక నియమం ప్రకారం -

తూర్పు ప్రహరీ కంటే పడమటి ప్రహరీ ఎత్తుగా, మందంగా ఉండాలి. ఉత్తర ప్రహరీ కంటే దక్షిణ ప్రహరీ ఎత్తుగా, మందంగా ఉండాలి.

ఇక పడమటి ప్రహరీ తూర్పు, ఉత్తర ప్రహరీల కంటే ఎత్తుగా, మందంగా ఉండాలి. దక్షిణ ప్రహరీ ఉత్తర, తూర్పు ప్రహరీల కంటే ఎత్తుగా, మందంగా ఉండాలి.

వాస్తులోనే మరో నియమాన్ని అనుసరించి -

ప్రహరీ గోడ నాలుగు దిక్కులా సమానమైన ఎత్తు, వెడల్పులతో ఉండాలి. ఇది ఎక్కువ మంది ఆచరించే నియమం. అందరూ ఈ నియమాన్ని అనుసరిస్తే పక్కింటి వాళ్ళకు గాలీ వెల్తుర్ల విషయంలో ఇబ్బంది ఉండదు. అన్నీ సమానంగా ఉండటంతో ఒక వింత అందం కూడా వస్తుంది.