Valmiki Ramayanam
బోయవాడు రామాయణం ఎలా రాశాడు?
Valmiki Ramayanam
హిందువులు పరమ పవిత్ర గ్రంధంగా ఆరాధించే రామాయణం రాసింది వాల్మీకి మహర్షి. అయితే ఆయన పండిత కుటుంబంలో పుట్టలేదు. కావ్యాలు, పూరాణాలకు సంబంధించిన నేపథ్యమే లేదు. కనీస చదువు కూడా లేని బోయవాడు వాల్మీకిగా ఎలా మారాడు? రామాయణం ఎలా రాశాడు.. వివరంగా తెలుసుకుందాం.
పూర్వం కొందరు మహర్షులు అనేక పుణ్యక్షేత్రాలు, తీర్థాలు దర్శించుకునేందుకు బయల్దేరారు. ఒక అడవి గుండా ప్రయాణిస్తుండగా ఒక బోయవాడు ఎదురయ్యాడు.
ఆ బోయడు శరవేగంగా ఋషులమీద దాడిచేశాడు. ''మీ దగ్గరున్న సొమ్ములన్నీ వెంటనే తీసివ్వండి'' అన్నాడు. మహర్షులు తెల్లబోయి, ''మేం దైవారాధనలో గడిపే ఋషులం.. దండ, కమండలాలు తప్ప మావద్ద ధనం ఉండదు నాయనా'' అన్నారు.
వాల్మీకి అపనమ్మకంతో మునులవద్ద ఉన్న మాటలను విప్పి చూశాడు. అందులో వారి కాషాయ వస్త్రాలు తప్ప మరేమీ లేకపోవడంతో చిరాగ్గా వాటిని విసిరిపడేసి వెళ్ళాడు.
ఋషులు యధావిధిగా ధ్యానం చేసుకున్నారు. వారు ధ్యానం నుంచి లేచేసరికి బోయవాడు పక్షులను వేటాడుతున్నాడు.
అది చూసిన ఒక మహర్షి ''నాయనా! నిషాదుడా! నువ్వు ఎందుకింత పాపాన్ని మూట కట్టుకుంటునావు? దారేపోయే బాటసారులను దోచుకుంటున్నావు.. పక్షులు, జంతువులను కిరాతకంగా చంపుతున్నావు.. దీనివల్ల ఎంత పాపం వస్తుందో ఆలోచించావా? మానవ జన్మ ఎత్తినందుకు చాతనైతే పుణ్యం సంపాదించుకో.. అంతేగానీ, పాపాన్ని కాదు..'' అన్నాడు.
బోయడు విసుగ్గా చూసి ''మీరంటే సన్యాసులు.. నాబోటి సంసారి భార్యాపిల్లల్ని పోషించాలంటే ఏదో ఒకటి చేయక తప్పుతుందా?'' అన్నాడు.
ముని తల పంకించి, ''నిషాదుడా! నువ్వు ఇలా పాపాలు చేసి సంపాదించి నీవాళ్ళని పోషిస్తున్నావు.. సరే.. మరి, నీ పాపంలో కూడా నీ భార్యాపిల్లలు వాటా తీసుకుంటారేమో కనుక్కో'' అన్నాడు.
బోయడు కొద్దిదూరంలో ఉన్న ఇంటికి వెళ్ళి ఆ మాట అడిగాడు.
''మమ్మల్ని పోషించడం నీ బాధ్యత.. నీ పాపంలో మేమెలా వాటా పుచ్చుకుంటాం?'' అంటూ తమ మనసులో మాట నిజాయితీగా చెప్పారు.
దాంతో బోయవానికి జ్ఞానోదయం అయింది. పరుగున మహర్షుల దగ్గరికి వెళ్ళి ''ఇకపై నేను ఇలాంటి పాపాలు ఏవీ చేయను.. నాకు ఏదైనా దారి చూపండి'' అన్నాడు.
మహర్షులు సంతోషించి ''బోయా! నువ్వు ''రామ'' అనే మంత్రాన్ని జపించు'' అంటూ చెప్పారు.
అంతే, ఆ బోయవాడు భౌతిక స్పృహ లేకుండా ''రామ'' మంత్రాన్ని జపిస్తూ ఉండిపోయాడు. ఎంత దీక్షగా అంటే, ఆని చుట్టూ పుట్ట వ్యాపించినా ఆ ధ్యానంలోంచి లేవలేదు.
బోయవాని కఠోర దీక్షకు దేవతలు సంతోషించారు.
నారదుడు పుట్టవద్దకు వచ్చి, “ఓ వాల్మీకీ!” అని పిలిచాడు.
వాల్మీకం అంటే పుట్ట. పుట్ట చుట్టూ కప్పివేయడాన బోయవానిని వాల్మీకి అని పిలిచాడు నారదుడు. ఆ పేరే స్థిరపడింది. నారదుడు పిలవడంతో బాహ్య స్పృహ వచ్చింది. వాల్మీకాన్ని తొలగించుకుని, నారద మహర్షికి నమస్కరించాడు.
''వాల్మీకీ! రామనామ జపంతో కామక్రోదాలన్నిటినీ జయించావు. నీకు జ్ఞానోదయం అయింది.. నీ జన్మ ధన్యమైంది. శ్రీరాముని చరితాన్ని ''రామాయణం'' పేరుతో రచించు.. అది ఆదికావ్యం అవుతుంది. నువ్వు ఆదికవిగా విరాజిల్లుతావు. ''వాల్మీకి రామాయణం'' చదివినా, విన్నా పుణ్యం సిద్ధిస్తుంది. నీ కీర్తి అజరామరంగా నిలుస్తుంది..'' అంటూ ఆశీర్వదించి వెళ్ళాడు.
అలా బోయవాడు వాల్మీకి అయ్యాడు. రామాయణం రచించాడు.
Valmiki Maharshi first poet, the story of Valmiki, Valmiki Maharshi images, Ramayan epic author Valmiki Maharshi, valmiki ramayanam in telugu, valmiki ramayanam famous book