Sati Savitri and Yamadharmaraja

 

సావిత్రి భర్త ప్రాణాలకోసం యముని ఎలా ఎదిరించింది?

Sati Savitri and Yamadharmaraja


పురాణ పాత్రల్లో సావిత్రికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఆమె కథ మహా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ కథేంటో తెలుసుకుందాం.

 

అశ్వపతి మద్ర దేశానికి రాజు. ఆయన భార్య మాళవి. వారికి చాలాకాలంపాటు సంతానం కలగలేదు. దాంతో ఆ దంపతులు జగన్మాతణు ప్రార్ధించారు. దేవి అనుగ్రహంతో పుట్టిన కూతురికి అమ్మవారి నామాల్లో ఒకటైన ''సావిత్రి'' పేరు పెట్టుకున్నారు.

 

సావిత్రి పెరిగి పెద్దయింది. యుక్త వయసులో సాళ్వదేశ యువరాజు సత్యవంతుని ప్రేమించింది. కూతురు అతన్ని ఇష్టపడింది అని తెలిసిన తండ్రి అశ్వపతి ''సత్యవంతుడు మంచివాడేనా.. అతని గుణగణాలు ఎలాంటివి?" అని నారదమహర్షిని అడిగాడు.

 

అందుకు బదులుగా ''సాళ్వదేశ యువరాజు అసలు పేరు చిత్రాశ్వుడు.. అతను సత్యమే మాట్లాడతాడు కనుక సత్యవంతుడు అని పేరు వచ్చింది.. అతనిలో ఎలాంటి లోపాలూ లేవు. అయితే, అల్పాయుష్కుడు. కేవలం ఒక సంవత్సరమే బతుకుతాడు. సత్యవంతుడి తండ్రి సాళ్వదేశ రాజు అంధుడు. రాజ్యం కూడా కోల్పోయాడు. ప్రస్తుతం భార్యాబిడ్డలతో అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు..'' అంటూ క్లుప్తంగా విషయం అంతా చెప్పాడు.

 

నారదుడు అలా చెప్పడంతో అశ్వపతి భయపడ్డాడు. సావిత్రికి మనసు మార్చుకోమని నచ్చజేప్పబోయాడు. కానీ, సావిత్రి ససేమిరా ఒప్పుకోలేదు. ఇక తప్పనిసరి పరిస్థితిలో అశ్వపతి కూతురి వివాహం గురించి మాట్లాడేందుకు సాళ్వరాజు దగ్గరికి వెళ్ళాడు.

 

సాళ్వరాజు ద్యుమత్సేనుఁడు తన పరిస్థితి వివరిస్తోంటే అశ్వపతి ముందే విని ఉన్నాడు కనుక విస్తు పోలేదు. ''...అదీ సంగతి... ఏంతో నాజూకుగా పెరిగిన నీ కూతురు ఏం సుఖపడుతుంది? అరణ్యవాసం చేయగలదా?'' అన్నాడు విచారంగా. వారికి తమ కొడుకు అల్పాయుష్కుడు అనే సంగతి తెలీదు.

 

అశ్వపతికి అంతకంటే విచారకరమైన సంగతి కూడా తెలుసు. అయినా చేయగలిగింది లేదు. సావిత్రి అతన్నే చేసుకుంటానని పట్టుబట్టింది కనుక సాళ్వరాజును ఒప్పించాడు. వెంటనే సావిత్రికి సత్యవంతునితో పెళ్ళి జరిగింది.

 

సావిత్రి అణకువ, వినయవిధేయతలు సత్యవంతునికి, అతని తల్లిదండ్రులకి కూడా బాగా నచ్చాయి. అంత మంచి అమ్మాయి తనంతట తానే తమ ఇంటికి వచ్చినందుకు ఎంతగానో సంతోషించారు.

 

సావిత్రికి మాత్రమే భర్త ఆయుష్షు గురించి తెలుసు. ఆమె సత్యవంతుడు సుదీర్ఘకాలం జీవించాలని భక్తిశ్రద్దలతో దేవుని ప్రార్థించసాగింది. సత్యవంతుడు ఒకరోజు అడవికి వెళ్తోంటే సావిత్రి అతన్ని అనుసరించింది. అడవిలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఉన్నట్టుండి సత్యవంతుడు పడిపోయాడు.

 

సావిత్రి ఏమరపాటు లేకుండా భర్తను ఒళ్లో పడుకోబెట్టుకుని పరిచర్యలు చేయసాగింది. కానీ అంతలోనే సత్యవంతుని ప్రాణాలను తీసికెళ్ళేందుకు యముడు వచ్చాడు. ఆవేళ కూడా సావిత్రి ఎప్పటిలాగే చేసే నిత్యపూజతోబాటు వ్రతం పూనింది. ఉపవాస దీక్షలో ఉంది.

 

యముడు క్షణంలో సత్యవంతుని ప్రాణాలు తీసుకుని వెళ్తోంటే సావిత్రి ఏడుస్తూ కూర్చోలేదు. ''ఆగాగు యమధర్మరాజా! ఇంత పిన్న వయస్కుడి ప్రాణం తీయడానికి నీకు మనసెలా వచ్చింది? నాకు నా భర్త లేకుంటే జీవితేచ్చే లేదు.. అంతా శూన్యమే మిగిలింది.. నువ్వెంతో గొప్పవాడివి.. దయచేసి నా బాధ అర్ధం చేసుకో..'' అంటూ యముని వెంట పరుగు తీసింది.

 

సావిత్రి మాటతీరు, మెత్తటి స్వభావం, ధైర్యసాహసాలు యమునికి ఎంతగానో నచ్చాయి. అప్పటివరకూ ఆయన్ని అనుసరించిన వారెవరూ లేరు. సావిత్రిమీది కనికరంతో ''ఏదయినా వరం కోరుకో అనుగ్రహిస్తాను.. నీ భర్త ప్రాణాలు తప్ప'' అన్నాడు.

 

సావిత్రి తన మామగారికి చూపు రావాలని, తిరిగి రాజ్యాన్ని పరిపాలించాలని కోరుకుంది. యమధర్మరాజు ఆ వరం ప్రసాదించి వెళ్తోంటే, ఆమె మళ్ళీ వెంబడిస్తూ తన దీనస్థితిని వివరించింది.

 

యమధర్మరాజు ''నీలో వినయం ఉంది.. ధైర్యసాహసాలూ ఉన్నాయి.. మెచ్చుకుంటున్నాను.. సరే, మరో వరం కోరుకో.. నీ భర్త ప్రాణాలు తప్ప'' అన్నాడు.

 

సావిత్రి తన తండ్రికి కొడుకుల్లేరు కనుక ఓ కొడుకును అనిగ్రహించమని కోరింది.

 

యముడు ఆ వరం కూడా ఇచ్చి సాగిపోతుంటే, సావిత్రి యముని కీర్తిస్తూ, తనను కరుణించమని ప్రార్ధించింది. యమధర్మరాజు విసుక్కోలేకపోయాడు. సావిత్రి సంభాషణా చాతుర్యం అలాంటిది.

 

"సరే, నీకు మరొక్క వరం ఇవ్వదలచాను.. ఇదే ఆఖరు వరం.. ఏదయినా కోరుకో.. నీ భర్త ప్రాణాలు తప్ప'' అన్నాడు.

 

సావిత్రి ''ధన్యురాలిని యమరాజా'' అంటూ యముని ప్రశంసించి ''నాకు సంతాన ప్రాప్తి కలిగించు'' అంటూ వేడుకొంది.

 

యముడు అనాలోచితంగా ''తథాస్తు'' అన్నాడు.

 

సావిత్రి సంతోషంతో తబ్బిబ్బవుతూ ''కృతజ్ఞురాలిని యమధర్మరాజా.. నాకు వరమిచ్చి, నా భర్తని ఎలా తీసికెళ్తారు?" అంది.

 

యముడు తాను చేసిన పొరపాటు గ్రహించినా ఏమీ చేయలేకపోయాడు. వరం ప్రసాదించిన తర్వాత దాన్ని వెనక్కు తీసుకునే వీలు లేదు. దాంతో సత్యవంతుని ప్రాణాలు తిరిగి ఇచ్చి, వెళ్ళిపోయాడు.

 

సావిత్రి అపరిమిత ఆనందంతో భర్తను వెంటబెట్టుకుని వెళ్ళింది. యముని ప్రార్ధించి తన ప్రాణాలు నిలబెట్టినందుకు సత్యవంతుడు, తనకు చూపు, రాజ్యాధికారం కలగజేసినందుకు మామగారు ద్యుమత్సేనుడు, కొడుకు లేడన్న వ్యథ తీర్చడమే కాకుండా అల్లుని బ్రతికించుకున్నందుకు తండ్రి అశ్వపతి - ఇలా అందరూ పరమానందభరితులయ్యారు.


Sati Savitri and Yamadharmaraja, Sati Savitri requested Yamadharmaraja, virtuous woman Sati Savitri, Women of virtue Sati Savitri, Sati Savitri the great ideal