పునర్జన్మ ఉందా? (Re-Birth - Punarjanma)
పునర్జన్మ ఉందా?
(Re-Birth - Punarjanma)
మన పూరాణాల్లో వింతలూ విడ్డూరాలు ఉంటాయని, వాటిని ఎంతమాత్రం నమ్మలేమని కొందరు అంటారు. పూరాణాలను పుక్కిటి పురాణాలు అంటూ తీసిపడేసే వారూ ఉన్నారు.
సాధారణంగా మనకు చిర పరిచితమైన విషయాలనే నమ్ముతాం. లేదా మనం చూసే సంఘటనలు, సన్నివేశాలకు దగ్గరగా ఉన్న అంశాలను నమ్ముతాం. బొత్తిగా పరిచయం లేని, కొత్తగా అనిపించే అంశాలను సహజంగానే నమ్మలేం. కానీ ఒక్కోసారి అలాంటివి కూడా నమ్మాలి.
చూస్తేనే నమ్ముతాం అంటే, హిమాలయాలు మంచు కొండలు అనే వాస్తవాన్ని కూడా నమ్మలేం. స్వయంగా వెళ్ళి మాత్రమే తేల్చుకోవాలి. సరే, ఇప్పుడంటే ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కలేకపోయినా హిమాలయాల వరకూ వెళ్లడం ఏమంత కష్టం కాదు. ఒకవేళ వెళ్ళలేకపోయినా ఎన్నో సినిమాలు, డాక్యుమెంటరీల్లో హిమాలయాలను చూసే అవకాశం ఉంది. కానీ, అన్నిసార్లూ, అన్ని సందర్భాల్లో "స్వయంగా చూస్తే మాత్రమే నమ్ముతాం" అంటే కుదరదు. కోర్టుకు మల్లే, సాక్ష్యాలు, ఆధారాలు లేకపోతే నమ్మేది లేదంటే ఎలా?
రామాయణ, మహాభారతాల్లో, అష్టాదశ పూరాణాల్లో అనేక కథలు అతిశయోక్తుల్లా ఉండే మాట నిజం. అంబ, అంబిక, అంబాలిక కథనం వింతగా ఉంటుంది. కానీ ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీలు (Test Tube Babies), అద్దెకు అమ్మ కడుపులు (Surrogate Mothers) వచ్చాక ఇంకా నమ్మకుండా ఉండగలమా? అప్పట్లోనే అంత అభివృద్ధి ఉందా అని ఆశ్చర్యంతో కళ్ళు తెలేస్తాం.
పుష్పక విమానం, దూరదర్సనం, దూర శ్రవణం అనే పదాలు మన ముత్తాతలకి బహుశా వింతగానే అనిపించి ఉంటాయి. కానీ విమానాల్లో సముద్రాలు సునాయాసంగా దాటేస్తున్న ఈ అధునాతన కాలంలో ఎప్పుడో వేదాల కాలంలోనే విమానాలు ఉన్నాయా అని ఆలోచిస్తే, ఆశ్చర్యం కంటే ఆనందం కలుగుతుంది. మన మహర్షుల దగ్గర ఎంత అపూర్వమైన, అమోఘమైన విజ్ఞాన సంపద ఉండేదో! ఏ కారణంగా అయితేనేం అదంతా పోగొట్టుకుని మనం వెనకబడ్డాం అని చింతించాలే కానీ, ఆనాటి మహర్షులు పుక్కిటి పూరాణాలతో కాలయాపన చేశారని ఆరోపణలు, అవహేళనలు చేస్తే మాత్రం అది మన తెలివితక్కువతనం అనిపించుకుంటుంది.
పునర్జన్మ ఉందని మన ధార్మిక గ్రంధాల్లో అనేక ఉదంతాలు ఉన్నాయి. పెద్దలూ అదే చెప్తున్నారు. అనేకమంది తమకు తమ పూర్వ జన్మకు సంబంధించిన విషయాలు గుర్తొస్తున్నాయని చెప్పిన సంఘటనలు ఉన్నాయి. కనుక పునర్జన్మను నమ్మక తప్పదు.