Trees and Fear

 

చెట్లు భయపడతాయా?

Trees and Fear


1975లో జగదీష్ చంద్రబోస్ మొక్కలకి జీవం ఉందని, ఋతువులు మారినప్పుడు, రసాయనాలు వాడినప్పుడు, వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు మొక్కల్లో మార్పుచేర్పులు వస్తుంటాయని చెప్పారు. అంతేనా, మొక్కలకి బాధ తెలుస్తుందని, ప్రేమగా స్పృశిస్తే గ్రహిస్తాయని, వాటికీ భావాలు ఉంటాయని చెప్పారు. ఇవన్నీ ఉత్తుత్తి ఊహలు కావు. చెట్లమీద ఎంతో అధ్యయనం చేసి, క్రెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని కనిపెట్టి, వివిధ పరిస్థితుల్లో మొక్కల ప్రతిస్పందనలను చూపి మరీ నిరూపించారు.

 

ఆ సంగతి అలా ఉంచితే, పల్లెల్లో ఒక ఆచారం ఉంది. ఏదైనా మొక్క లేదా చెట్టు పుష్పించకుండా, ఫలించకుండా ఉందనుకోండి. ఓ కత్తి లేదా గొడ్డలి పట్టుకుని కోపంగా దానిముందు నిలబడి "ఓసి బుద్ధిలేని వృక్షమా! నీకు పాదు చేసి మట్టి గుల్లచేసి, శ్రద్ధగా నీళ్ళు పోసి, ఎరువులు వేసి మరీ పెంచింది ఇలా దిష్టిబొమ్మలా, పనికిమాలిన గడబొంగులా, మోడులా, మొద్దులా నిలబడ్తావని కాదు. ఏం చూసుకుని వయ్యారాలు పోతున్నావు? ఓ పువ్వు లేదు, ఓ కాయ లేదు. ఛ, ఛ, నీదీ ఓ బతుకేనా? ఏమనుకుంటున్నావో, నీకిదే చెప్తున్నా.. నాలుగు రోజుల్లో పూలు పూయకపోయావో.. అడ్డంగా నరికిపారేస్తా జాగ్రత్త.. పూలు పూస్తావో, కట్టెలుగా మారి కాలిపోతావో నీ ఇష్టం" అంటూ, హెచ్చరిస్తారు, హూంకరిస్తారు.

 

ఇదేం తమాషా? వింటేనే చిత్రంగా ఉంది కదూ! చెట్లమీద కోపం చూపడం ఏమిటి? భయపెట్టడం ఏమిటి? సవాళ్లు విసరడమేంటి? అసలు చెట్లతో మాటలేంటి? ఆ మాటలు మొక్కలకి అర్ధమౌతాయా? అర్ధమై, భయపడితే మట్టుకు పూలు పూస్తాయా? కాయలు కాస్తాయా? - లాంటి సందేహాలు ఎన్నో రావడం సహజం. కానీ, ఈ ఆచారం వల్ల ప్రయోజనం ఉందని నమ్ముతారు వాళ్ళు. నిదర్శనాలు ఉన్నాయని చెప్తారు.

 

ఈ ఆచారాన్ని నమ్మి పాటించే గ్రామీణులు, కత్తి చూపి, భయపెట్టిన వెంటనే ఆయా చెట్లు పుష్పించి, ఫలించిన సంఘటనలు ఉన్నాయని చెప్తున్నారు. దీని వెనుక మర్మం ఏమిటో మరో జగదీశ్ చంద్రబోస్ లాంటి శాస్త్రవేత్త పరిశోధించి చెప్పాల్సిందే!