తిరుప్పావై ఇరవై ఆరవ రోజు పాశురం
తిరుప్పావై ఇరవై ఆరవ రోజు పాశురం
మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడువాన్;
మేలైయార్ శేయ్యనగళ్ ; వేణ్ణువన కేట్టియేల్;
ఞ్ లతై యెల్లామ్ నడుజ్ఞ మురల్వన
పాలన్న శజ్ఞజ్ఞళ్, పోయ్ ప్పాడు డైయనవే,
శాలప్పేరుమ్ పఱైయే, పల్లాణ్ణిశైప్పారే,
కోలవిళక్కై, కోడియే, వితానమే,
ఆలినిలై యామ్! ఆరుళేలో రేమ్బావాయ్
భావం : --- ఆశ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్రనీలమణి వంటి శరీరముకలవాడా! ఓ వటపత్రశాయీ! మార్గశీర్ష మాస స్నానం చేయగా వచ్చాము. మా పూర్వులున్నూ యీ స్నాన వ్రతాన్ని ఆచరించియున్నారు. ఈ వ్రతానికవసరమగు పరికరములను నిన్నర్ధింపగా వచ్చాము. దయచేసి ఆలకింపుము. భూమండలమంతయు వణుకు కల్గించునట్లు ద్వనించే పాలవంటి తెల్లనైన శఖంములు __ సరిగా నీ పాంచజన్యము వంటివి కావలెను. అతిపెద్దవైన పఱవంటి వాద్యములు కావలెను. మృదుమధురమైన కంఠములతో మంగళ గానాలను పాడే భాగవతులను కావాలి. వ్రతంలో ముందుకు సాగే నిమిత్తం మంగళదీపము కావాలి. వ్రాత సంకేతములుగా అనేక చాందినీలు కావాలి. లోకలన్నింటినీ నీ చిరుబొజ్జలో దాచుకుని, ఒక లేత మఱ్ఱి యాకుమీద పరుండిన నీకు చేతకానిదేమున్నది స్వామీ! కరుణించి మా వ్రతము సాంగోపాంగముగ పూర్తీయగునట్లు మంగళాశాసనము చేసి వీనిని ప్రసాదింపుము.
శ్రీ సూక్తి మాలిక
ఉపాయము, ఫలము _ రెండును భగవానుడే అని నమ్మిన గోపికలు వానిని సుత్తించి, కీర్తించి ప్రసన్నుణ్ణి చేసుకొన్నారు. వ్రేపల్లెలోని పెద్దల కోరికమేరకు యీ మార్గ శీర్షవ్రతాన్ని వర్షాలు కురియటంకోసమే గోపికలు చేస్తున్నారు. పెద్దలకు ప్రతిఫలం వర్షాలు కురియటం. కానీ గోపికల వ్రతఫలం మాత్రం __ శ్రీకృష్ణ సమాగమమే! మార్గశీర్ష స్నానమనగా __ నిరంతర శ్రీకృష్ణ సంశ్లేష ఆనందంలో మునకలు వేయటమే అని అర్ధం ఇలా చేసే యీ వ్రతానికి కావలసిన పరికరాలను గోపికలు యీ (ప్రాశురంలో) కోరుతున్నారు.
(అమృతవర్షిణి _ అదితాళము)
ప.... ఆశ్రితవత్సల ! నీల శరీరా!
ఆశ్రితులమురా! కృపజేయుమురా!
అ..ప.. ఆశ్రయించితిమి వటపత్రశాయి!
ఆశ్రితర్డాముల నవధరించరా!
1. చ.. లోకములదరగ ఘోషించేడి నీ
శంఖపుసరి వాద్యముల నీయరా!
మాకోసగిన ఘన వాద్య విశేషము
గైకొని మావ్రత మాచరించెదము
2. చ... మంగళముల నాలపించువారిని
మంగళమౌ దీపమ్ము, ద్వజమ్మును
మంగళకరమౌ వితానమ్మును
సంగితితో మాకోసగు దేవరా!
- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్