తిరుప్పావై ఇరవైవ రోజు పాశురం

 

 

 

తిరుప్పావై ఇరవైవ రోజు పాశురం 

 

 

 



    ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్ఱు
    కప్పమ్ తవిర్కుమ్ కలియే! తుయిలెళాయ్;
    శెప్పముడైయాయ్! తిఱలుడైయాయ్! శెత్తార్కు
    వెప్పఙ్గొడుక్కుమ్ విమలా! తుయిలెళాయ్;
    శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిఱు మరుఙ్గుల్
    నప్పిన్నై నఙ్గాయ్! తిరువే! తుయిలెళాయ్;
    ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై
    ఇప్పోతే యెమ్మై నీరా ట్టేలో రెమ్బావాయ్


భావం :- ముప్పది మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగనే అటకుపోయి వారిని రక్షించు సమర్ధతగల ఓ స్వామీ! నిద్రలేచిరమ్ము. ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలాఢ్యుడా! ఆశ్రిత రక్షకా! ఓ బలశాలీ! శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా! నిద్ర నుండి మేల్కొను స్వామీ!' అని స్తుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనకుండుట చూచి, జగన్నాటక సూత్రధారియైన ఆ జగన్నాధుని మేల్కొలుపుమని నీళాదేవిని ప్రార్ధిస్తున్నారు గోపికలు. బంగారు కలశముల వంటి స్తనద్వయమును, దొండపండు వంటి అధరములను, సన్నని నడుమును కల్గి అతిలోక సుందరముగ విరాజిల్లుచున్న ఓ నీళాదేవీ!మాయమ్మా! నీవు శ్రీమహాలక్ష్మీ దేవికి సమానురాలవు! కరుణించి నీవైన మేల్కొనవమ్మా! 'నేను లేచి మీకేమి చేయవలెనందువేమో!' వినుము - మన స్వామియైన శ్రీకృష్ణునకు శరీరముపై చిరుచెమట పట్టినపుడు దానిని ఉపశమింపచేయగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీవన (విసనకర్ర) నిమ్ము! ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము జూచుకొనుటకు ఒక దివ్య మణిదర్పణము (అద్దము) నిమ్ము. వీటన్నింటిని మాకనుగ్రహించి, స్వామిని మేల్కొలిపి, మమ్ము అతనితో కూర్చి మంగళస్నానము చేయింపుము తల్లీ! నీ యనుగ్రహమున్ననే కద మా యీ వ్రతము మంగళముగ పూర్తికాగలదు?' అని ఆండాళ్ తల్లి నీళాదేవిని వేడుకొంటున్నారు యీ పాశురంలో. 

   
అవతారిక :-

 

 

 

 



నీళాకృష్ణులను మేల్కొలిపి, తమను కరుణించవలెనని గోపికలు ప్రార్ధించారు. యీ మాలికలో ముప్పది మూడు కోట్ల దేవతలకు అధిపతియైన పరమాత్ముని లేపి కరుణించవలసిందిగా ప్రార్ధిస్తున్నారు. సాక్షాత్తూ లక్ష్మీదేవివంటి తల్లియైన నీళాదేవిని కూడా మేల్కొలిపి, తమ విరహార్తికి ఉపశమనం కలిగేటట్లు శ్రీకృష్ణునితో కలిపి ఆనందస్నానాన్ని చేయించుమని ప్రార్ధిస్తున్నారు గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి.

        (సింధు భైరవి రాగము - ఆదితాళము)

ప..     ముప్పది మూడుకోట్ల దేవతల
    ముప్పును తొలగగ బ్రోచే బలుడా!
    ముప్పునిచ్చువారిని గూల్పెడి - నీ
    విప్పు డాశ్రుతుల గావమేలుకో!....

1. చ..    కనక కలశ సమ కుచయుగ శోభిత
    కన, బింబాధర! కరి రిపుమధ్యా!
    శ్రీ నప్పిన్నా! లక్శ్మి౧ మాయమ్మ!
    వినుమోతల్లీ! యింక మేలుకో!

2. చ..    ముందుగ మాకొక వీవన నీయవె!
    అందమైన అద్దమ్ము! నీయవే!
    నంద సుతునితో విరహార్తులమగు
    నందర మము నీరాడజేయవే!

- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్