శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయం విశేషాలు.

 

శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయం విశేషాలు

స్వామివారి ఆలయంలో భక్తులు ఎంతో సేపు నిరీక్షణ తర్వాత స్వామి దర్శనం అసంతృప్తిగానే చేసుకొని నిర్వేదంగా బయటకొస్తుంటారు. శ్రీవేంకటేశ్వర స్వామి యెదుట నిలబడ్డ మధురక్షణాలలో మనస్పూర్తిగా స్వామిని వీక్షించండి. అలౌకికానందం కలుగుతుంది. మనకంతే సమయం దర్శనం ప్రసాదించారని సంతృప్తిగా బయటకు రండి. వచ్చే సమయం ఆలయంలోని లెక్కలేనన్ని విశేషాలు చూసుకుంటూ రండి. సాధారణంగా భక్తులు గమనించని కొన్ని విశేషాలు ముచ్చటించుకుందాం.!

ధ్వజస్థంభ మండపానికి 100 అడుగుల దూరంలో స్వామికి అభిముఖ దిశలో నమస్కరిన్స్తున్నట్లున్న ముగ్గరు భక్తుల నిలువెత్తు రాగి విగ్రహాలున్నాయి. అవి మూడు స్వామి వారి మహాభక్తులైన లాలాభీమ్ రామ్, అతని తల్లి  మాతా మోహనదేవి, అతని భార్య పితా బీబీల విగ్రహాలు. లాలా భీమ్ రామ్ క్షత్రియుడు, ఆయననే రాజా తోడరమల్లు అని కూడా పిలిచేవారు.17వ శతాబ్దంలో స్వామివారి ఆలయాన్ని ముస్లింల దండ యాత్రలనుండి, ఆంగ్లేయుల దాడులనుండి కాపాడిన మహావీరుడు రాజా తోడరమల్లు.

ధ్వజస్థంభాన్ని ఆనుకుని ఉన్నదే బలిపీఠం. స్వామివారికి ప్రసాద నివేదన జరిపిన తర్వాత ఆ బలిపీఠం మీద మిగిలిన అన్న ప్రసాదాలను ఉంచుతారు. అన్నం భూత, ప్రేత, యక్ష పిశాచాలు ఆహారంగా స్వీకరిస్తాయట! ధ్వజస్థంభ మండపపు ఆవరణలోనే బలిపీఠానికి ఈశాన్య దిశలో అదే ఆకారంలో మరోశిల ఉంది. ఒకటిన్నర అడుగుల ఎత్తున పీఠం మీద ఉండే ఈ శిలను 'క్షేత్రపాలక శిల' అంటారు. ఉదయం గుడితెరిచే ముందు, రాత్రి గుడి మూసే సమయంలో ఆలయద్వారాల తాళపు గుత్తిని ఈ శిలకు తాకించి తీసుకెళ్తారు.

విమాన ప్రదక్షిణ మార్గంలో వెండి వాకిలికి దక్షిణంగా పది అడుగుల దూరంలో శ్రీవరదరాజ స్వామి మందిరం ఉంది. స్వామివారి గర్భాలయం ఎదురుగా వున్న గడపను 'కుల శేఖరపడి' అంటారు. ఆయన ఒక వైష్ణవ భక్తుడు. స్వామి ఎదురుగా రాతి గడపగా ఉండాలని కోరుకోవడం వలన ఆ వరం పొందగలిగాడు. స్వామిని సర్వకాల, సర్వావస్థలలో ఎల్లకాలం దర్శించుకొనే వరం పొందిన ఆ భాగ్యశీలి జన్మ ధన్యమయింది.

మహాద్వారం లోనకి అడుగుపెట్టిన తరువాత 6 అడుగులు వేశాక కుడి ప్రక్క గోడమీద ఒక గునపం వేలాడతీయబడి వుంటుంది. అది ఆనాడు అనం తాళ్వారు అనే మహా భక్తుడు స్వామివారిని అవసరం లేని సహాయం చేశాడని కోపంతో విసిరిన గడ్డపార. ఒకవేళ వెళ్ళే సమయంలో చూడలేకపోయిన తీరా బయటకు వచ్చే సమయంలో గమనించవచ్చు.

విమాన వేంకటేశుని దర్శించాక 'రికార్డు సెల్' అనే గదిని దాటాక స్వామివారి ఏకాంతసేవకు ఉపయోగించే పట్టు పరుపు, బంగారు మంచం, పూజలో వాడే పవిత్ర సుగంధ ద్రవ్యాలు భద్ర పరిచే గది వస్తుంది. ఆ గది పక్కన సంకీర్తన భాండాగారపు ద్వారానికి రెండువైపులా రెండు విగ్రహాలుంటాయి. అవి స్వామి మీద అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, గానం చేసి అజరామరుడైన అన్నమాచార్యులు వారి కుమారుడు పెద్ద తిరుమలాచార్యులకు సంబంధించినవిగా పేర్కొంటారు. అన్నమయ్య రచించిన కీర్తనకు రాగిరేకుల రూపంలో ఇక్కడ భద్రపరచబడి వున్నాయి.