శ్రీనివాసుని కంఠమున తులసిమాలగా వకుళమాత

 

శ్రీనివాసుని కంఠమున తులసిమాలగా వకుళమాత

వనవిహారమునకు వెళ్ళిన శ్రీనివాసుడు, పద్మావతి ఎంతసేపటికి కుటీరమునకు రానందుకు తన పెద్దకుమారుడైన గోవిందరాజస్వామిని వకుళమాత తోడుగావెంటబెట్టుకొని ఆనందనిలయమును సమీపించి శిలగా మారిన శ్రీనివాసుని చూచి "నాయనా! శ్రీనివాసా!" అని ఆర్తనాదము చేసెను. శిలలో నుండి మాటలు ఈ విధముగా వకుళమాతకు వినిపించాయి. "జననీ! నీకు ముక్తి ప్రసాదించుచున్నాను. నీవు తులసిమాలగా మారి నా కంఠమున చేరు" అన్నట్లు వినిపించెను. వకుళామాత తులసిమాలగా శ్రీనివాసుని కంఠమున చేరెను. అందుకే శ్రీనివాసస్వామివారిని తులసిదళములతో పూజిస్తారు. శ్రీనివాసస్వామికి తులసిదళములు అంటే చాలా ప్రీతి.

గోవిందరాజస్వామి తిరుపతి పట్టణమున వేలయుట :-
గోవిందరాజస్వామి, శిలగాయున్న తమ్మున్ని చూసి శ్రీనివాసా! ధనరాసులు ఎంత కొలచినను తరుగుట లేదు. ఆయాసమగుచున్నది అనగా, "సోదరా! నీహస మందు ధనరేఖలు యున్నవి. కావున సిరి ఎక్కువ అగుచుండును. నీవు కొండక్రింది భాగమున పోయి విశ్రాంతి తీసుకొనుము" అన్నాడు.

వెంటనే గోవిందరాజస్వామి కొండ క్రిందికి పోయి కొలత పాత్రను తల క్రింద ఉంచుకొని శిలగా మారిపోయాడు. గోవిందరాజస్వామి వెలసిన ప్రదేశము కాబట్టి దానికి గోవిందరాజ పట్టణము అని పేరు వచ్చినది. కాలక్రమేణ అది తిరుపతి పట్టణముగా పేరు వచ్చింది.

పర్వత నామములు :-
శ్రీ తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామీ నివసించు పర్వతమునకు ఏడు పేర్లు కలవు.
ఆదిశేషుని రూపమున ఉండుటచే - శేషాచలము అని
ఆ పర్వతమున వేదములు ఇమిడివున్నందున - వేదాచలము అని
భూలోకమునకు గరుత్మంతునిచే పర్వతమును చేరినందుకు - గరుడాచలం అని
వృషాసురుడు  అను రాక్షసుడు మోక్షము పొందినందున - వృషభాద్రి అని
అంజనాదేవి తపస్సు చేసి హనుమంతుని కన్నస్థలము అయినందున  - అంజనాద్రి అని
ఆదిశేషుడు, వాయుదేవుడు బలాబలములు చూపి పర్వతము ఇచ్చట చేర్చినందుకు - ఆనందగిరి అని
మన పాపములు పోగొట్టు పర్వతము అయినందుకు - వెంకటాచలము అని సార్థకమయి ఈ పర్వతములకు పేర్లు కలిగాయి.