కుమారధార మహత్యం

 

కుమారధార మహత్యం

కుమారధార మహత్యం
ఆదానదోషేణ భవేద్ద్రరిద్రః
దరిద్ర దోషేణ కరోతి పాపం
పాపదవశ్యం నరకం ప్రయాతి
పునర్దరిద్రః పునరేవ పాపీ !!

"పూర్వజన్మలో దానం చేయనివాడు దరిద్రుడౌతాడు.దరిద్రం తట్టుకోలేక పాపాలు చేయడం మొదలుపెడతాడు. పాపం వల్ల నరకానికి పోతాడు. మళ్ళీ భూలోకంలో పుట్టి దరిద్రుడౌతాడు. మళ్లీ పాపాలు చేస్తాడు. ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. పోనీ దానాలు చేసి పాపాల్ని తొలగించుకోవాలనుకుంటే, ఎంత శ్రమించినా, చివరకు యాచనకు వెళ్ళినా చిల్లిగవ్వ కూడా సంపాదించలేకపోతాడు. ఇహపర సుఖాలకు దానాలు చేయవలసిందే. అవి చేయలేని నాడు ఇక బతికే అర్హత లేదు అని భావించిన ఓ ముసలివాడు వేంకటాద్రి దగ్గర మరణిస్తే ఆత్మహత్యా దోషం అంటదని గురువులద్వారా విన్నాడు. వేంకటాద్రిని చరమ ప్రయాణానికి ఎన్నుకున్నాడు. వార్ధక్య భారంతో కుంగిపోతున్నా, శరీరం ఎంత దౌర్బల్యంతో ఉన్నా సహిస్తూ వేంకటాద్రి శిఖరాగ్రాన్ని చేరుకున్నాడు. "సకల దేవతలారా! ప్రత్యక్షదైవమైన సూర్య దేవా! భగవాన్ శశాంకా! పంచాభూతాల్లారా! దరిద్రం బాధని భరించలేకుండా ఉన్నాను.

వార్ధక్యాన్నీ తట్టుకోలేకపోతున్నా.. చాలు ఇక నాకీ జన్మ. కనీసం వచ్చే జన్మలోనైనా సుఖపడే యోగాన్ని ప్రసాదించండి." అని వేడుకుని కొండపై నుండి దూకబోతుండగా వెనుకనుండి, వేటకు వచ్చిన ఒక రాకుమారుడు అతన్ని గట్టిగా పట్టుకుని ఆపాడు. వృద్ధుడు ఆ  రాజ కుమారుడిని చూశాడు. పరమ సుకుమార సుందరుడు, నీలమేఘచ్ఛాయా శరీరుడూ అయిన, ఆ యువకుడిని చూసి తన శరీర బాధను కొంత మరిచిరిచిపోయాడు. ఏం నాయనా! ఎందుకు రక్షించావు నన్ను" అంటూ ప్రశ్నించాడు. "వృద్ధుడా! ఆత్మహత్య కంటే మహాపాపం ఈ సృష్టిలో ఇంకేమీ లేదు. ఆత్మహత్య చేసుకున్నవాడు పిశాచమై అల్లాడిపోతాడు. కొంత కాలం పైశాచిక జన్మమెత్తాక ఘోరనరకాలకు చేరి, నానా యాతనలూ అనుభవించి చివరకు నీచ జన్మలెత్తి మరలా దారిద్ర్య బాధలు పొందుతాడు జీవుడు. నీవు దరిద్రబాధకు తట్టుకోలేక బలవంతపు మరణం పొందితే, ఇంతకంటే ఎక్కువ కష్టాలు కొనితెచ్చుకుంటావు సుమా! అందుకే నేనాపాను, అన్నాడు ఆ యువకుడు. "అయ్యా! నీవు కరుణా సముద్రుడిలా కనిపిస్తున్నావు.

కన్నబిడ్డలా వచ్చి, నన్ను చావకుండా కాపాడావు. కానీ, నా కష్టాలు నీకు పూర్తిగా తెలియవు. తెలిస్తే నువ్వే నన్ను చావమంటావు. నాది పెద్ద సంసారం. మింగ మెతుకులేని దుఃస్థితి. రోజూ తిండికోసం వెదకి వెదకి, విసిగిపోయాను. ఈ దీన జీవితం నాకక్కర్లేదు. నన్ను బ్రతికించివాడివి, నా దారిద్ర్యం తొలగించనైనా తొలగించు లేదా నన్ను నీవే కడతేర్చి పుణ్యం కట్టుకో" అంటూ వృద్ధుడు బావురమన్నాడు. దానికా యువకుడు చిరునవ్వులు చిందిస్తూ "తాతగారూ! మీరు నాపై పెద్ద బాధ్యతనే మోపారు. మీ చావు చూడలేను గానీ, మీకు నా చేతనైనంత సహకారం చేస్తాను. నాతో రండి" అంటూ, కుమారధార దగ్గరికి తీసుకెళ్లాడు. ఇందులో స్నానం చేయండి, మీ దరిద్రంమొత్తం పటాపంచలైపోతుంది.. అని చెప్పాడు. వృద్ధుడా ధారలో మునిగాడు వెంటనే నవయౌవనం వచ్చేసింది. అతడాశ్చర్యపోయాడు. తనను అక్కడికి తీసుకొచ్చిన యువకుడికోసం ప్రక్కకి తిరిగాడు. కనబడలేదు. చూస్తుండగానే ఆకాశంలో ఓ మెరుపు మెరిసింది. ఆ మెరుపు మధ్యలో నీలమేఘచ్ఛాయా శరీరుడు, మకరకుండల విభూషితుడు, నరరత్నోజ్జ్వల కిరీటధారి, లక్ష్మీసమేతుడు సర్వాంగ సుందరుడూ అయిన శ్రీమన్నారాయుణుడు దర్శనమిచ్చాడు.

పులకించిపోయిన నవ యువకుడు, ఆనంద బాష్పాలతో, "స్వామీ! నన్ను అనుగ్రహించడానికొచ్చిన దైవానివా! గుర్తించలేని నిర్భాగ్యుడిని నన్ను క్షమించు. నిన్ను చూశాక నా కోరికలన్నీ నశించాయి" అన్నాడు. అప్పుడు శ్రీ వేంకటేశ్వరుడు "నాయనా! నీవు యువకుడిగా మారిన క్షణంలోనే, నీ భార్యకూడా యువతిగా మారింది. నీ పిల్లలు కూడా ఆరోగ్య సంపన్నులయ్యారు. ఇది కుమారా ధార. వేంకటాచలంలోని అత్యంత పవిత్ర తీర్థం. ఇందులో స్నానం చేసిన వారికి నిత్య శుభాలు కలుగుతాయి. విశ్వాసంతో నన్ను తలచుకుని స్నానం చేసిన వారికి నవయౌవనం వస్తుంది. ఇక నీ కష్టలు గట్టెక్కాయి. సర్వసంపదలూ నీకు ప్రసాదిస్తున్నాను. భవిష్యత్తులో ఎప్పుడూ ఆత్మహత్యా ప్రయత్నం చేయకు. అన్నింటికంటె ఆత్మహత్య మహాపాతకం. ఈ సత్యం లోకంలో చాటు" అని పలికి మాయమైపోయాడు.