తిరుమలలో వెంకటేశ్వర స్వామి గడప రహస్యం..!

 

తిరుమలలో వెంకటేశ్వర స్వామి గడప రహస్యం..!

తిరుమల ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. తిరుమల శ్రీనివాసుని దర్శనానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు.  తిరులలో వేంకటేశ్వరుడు స్వయంభువు.. ఆయన తన భక్తుల కష్టాలను తీర్చే ఆపద మొక్కుల వాడిగా ప్రసిద్ధి చెందాడు. అయితే తిరుమలలో స్వామికి ముందున్న గడప గురించి చాలా మందికి తెలియదు.  ఈ గడప వెనుక ఒక అద్బుతమైన కథ ఉంది.  ఈ కథ మొత్తం తెలిశాక భక్తితో మనసు నిండిపోతుంది.  ఇంతకీ తిరుమల వెంకటేశ్వరుడి ముందున్న గడప ఏంటి? దీని గురించి తెలుసుకుంటే..

కులశేఖర గడప..

తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయం ముందున్న గడపను కులశేఖర పడి  అని అంటారు.  సాక్షాత్తు స్వామి వారి భక్తుడే ఇలా గడప రూపంలో అక్కడే కొలివై నిత్యం స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారట.  ఈ  కులశేఖరుడు ఎవరు? కులశేఖర పడి గురించి వివరాలు తెలుసుకుంటే..

కులశేఖర ఆళ్వారు..

కేరళ రాష్ట్రంలో కులశేఖర అనే మహారాజు ఉండేవారు. ఆయన ఆళ్వారులలో ఆయిదవ వారు.  దీంతో ఆయనను కులశేఖర ఆళ్వారు అనేవారు. మహా విష్ణువు ధరించే కౌస్తుభ మణి అంశతో ఆయన జన్మించారు. ఆయనకు చిన్నతనం నుండి రాముడంటే ఎనలేని భక్తి.  నిత్యం రాముడిని ఆరాధించేవాడు. రామాయణం వింటూ ఎంతో తన్మయత్వానికి లోనయ్యేవారు. రామాయణం వింటున్నప్పుడు రాముడికి కానీ, సీతమ్మకు కానీ కష్టాలు వస్తే ఆయన చాలా కలత చెందేవారు. ఎంతో బాధపడేవారు. ఆయన ఒకసారి రామాయణం వింటున్నప్పుడు రాముడు కరదూషణాదుల్ని వధించే సంఘటన వచ్చింది.  అది వింటూ ఆయన ఆందోళన చెందాడు. అయ్యో రామయ్య చిన్నవాడు,  ఆ రాక్షసులేమో చాలా ఘోరమైన వాళ్లు.. రామయ్య ఒక్కడే ఒంటరిగా ఎలా యుద్దం చేస్తాడో ఏంటో.. నేను రామయ్యకు తోడు వెళతాను.. అనుకుని ఉన్నపళంగా లేచి మంత్రిని పిలిపించి,  సైన్యాన్ని సిద్దం చేయమని చెప్పి కత్తి తీసుకుని బయలుదేరాడు.  

ఎంతమంది ఎన్ని విదాలుగా చెప్పాలని చూసినా ఆయన వినిపించుకోలేదు. అప్పుడే కులశేఖర రాజుకు పురాణం వినిపించే పండితుడు అక్కడికి వచ్చి.. మహారాజా రామయ్య ఆ రాక్షసులందరిని వధించేశాడట.  ఇప్పుడే తెలిసింది అని చెప్పడంతో  ఆయన తృప్తి చెంది తన ప్రయాణం విరమించుకున్నాడు.  ఇలా రాముడి కష్టం తనదిగా, రాముడి సంతోషంలో తన సంతోషాన్ని చూసుకుంటూ ఉండేవాడు. ఇవన్నీ జరుగుతూ ఉండటంతో ఆయన ముందు ఎవరూ సీతారాములు కష్టాలు పడిన కథలు, సంఘటనలు ఆయనకు చెప్పేవారు కాదు.

ఒకసారి కులశేఖర రాజుకు రోజూ పురాణం వినిపించే పండితులు వేరే ఊరు వెళ్లారు.  అప్పుడు రాజుకు పురాణం వినిపించడానికి ఇంకొక వ్యక్తి వచ్చారు.  ఆయనకు రాజు గురించి తెలియక రామాయణంలో సీతమ్మను రావణుడు అపహరించి, సముద్రం దాటి  లంకకు తీసుకెళ్లే సంఘటన చెప్పాడు. ఈ కథ వినగానే కులశేఖర రాజుకు ఆవేశం వచ్చి వెంటనే గుర్రం తీసుకుని సముద్రం వైపు పరుగు తీసాడు.  సీతమ్మను నేను కాపాడతాను, రావణుడిని సంహరిస్తాను అని ఊగిపోతూ ఆయన ఏకంగా సముద్రంలోకి వెళ్లిపోయారు.  ఆయన నీళ్లలో మునిగిపోతుంటే సీతారాముల మనసు కరిగిపోయింది. వెంటనే కులశేఖరుడి ముందు ప్రత్యక్షమై.. కులశేఖరా.. ఇదిగో ఇటు చూడు.. సీతమ్మ నా దగ్గరే భద్రంగా ఉంది,  అమ్మను నేను తెచ్చేశాను  చూడు అని స్వయంగా రామయ్యే కులశేఖరుడితో చెప్పి కులశేఖరుడిని శాంతపరిచాడు. అంత భక్తి ఉండేది కులశేఖరుడికి సీతారాములంటే.

కులశేఖరుడికి వయసు పెద్దదయ్యాక.. ఆయన రాజ్యాన్ని తన పిల్లలకు ఇచ్చేసి శ్రీరంగ క్షేత్రానికి వెళ్లిపోయాడు.  తన కూతురును రంగనాథస్వామికి ఇచ్చి పెళ్లి చేశాడు. తను రాజ్యాలను జయించడం ద్వారా సమకూరిన సంపద మొత్తాన్ని స్వామికి సమర్పించుకున్నాడు.  ఆయన కూతురు పేరు చెరకురవల్లి.  ఆమెను స్వామి స్వీకరించ ప్రదేశం ఇప్పటికి శ్రీరంగంలో చెరకురవల్లి సన్నిధిగా పిలవబడుతోంది.  తన పట్ల ఇంత భక్తి కలిగి ఉన్నందుకు ఏదైనా వరం కోరుకోమని ఆ స్వామి కులశేఖర రాజును అడిగాడు. అప్పుడు ఆయనేమో.. స్వామి నేను నిత్యం నిన్నే చూస్తూ గడపాలి.  అలా జరగాలంటే నేను నీ ఆలయంలో గడపగా మారిపోవాలి.  అలా ఉంటే నేను నిన్ను ఎప్పుడూ చూస్తూ ఉండవచ్చు అని అడిగాడు. ఆయన కోరిక ప్రకారంగా ఆ స్వామి కులశేర రాజును తిరుమల గర్భాలంయలో స్వామి ఎదురుగా ఉండే గడపగా మార్చేశాడు.  ఇది  కులశేఖర  ఆళ్వారు కథ.

                                *రూపశ్రీ.