తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో మూడోరోజు
తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో మూడోరోజు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు సోమ వారం ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులను కనువిందుచేశారు. ముద్దులొలికించే ముత్యాలు అలమేలుమంగమ్మకు ప్రీతిపాత్రమైనవి. ముత్యపు పందిరి వాహనంపై అమ్మవారు కాళంగమర్ధిని అవతారంలో భక్తజనులకు దివ్య దర్శనాన్ని ప్రసాదించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజు వేకువ జామున 4 గంటలకు అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలను నిర్వహించారు. ఉదయం 7 గంటలకు అమ్మవారిని ఊరేగింపుగా సన్నిధి నుంచి వాహనమండపానికి తీసుకొచ్చి ముత్యపుపందిరిపై కొలువుదీర్చారు.
అనంతరం అమ్మవారిని పట్టుపీతాంబరాలు, వజ్ర వైఢూర్య, స్వర్ణాభరణాలతో కాళంగి మర్ధినిగా అలంకరించి ఉదయం 8 గంటలకు వివిధ కళాకారుల ప్రదర్శనలు, చిన్నా రుల కోలాటాలు, కేరళ, ఉడిపి చెండి వాయిద్యాలు, దాస సాహిత్య కళాకారుల కోలాట విన్యాసాలు, జియ్యర్ల ప్రవచనాల నడుమ అమ్మవారు తెల్లని, చల్లని ముత్యపు పందిరిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు సింహ వాహనంపై అమ్మవారిని తిరుమాడ వీధుల్లో భక్తుల కోలాటాలు, కేరళ సంప్రదాయ వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, జియ్యర్ల ప్రబంధం నడుమ అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.