తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో నాలుగోరోజు
తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో నాలుగోరోజు
శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవరోజు అమ్మవారు రాజగోపాలుడు అలంకరణలో కల్పవృక్ష వాహనంపై విహరించారు. ఉదయం 4 గంటలకు అమ్మ వారిని సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలను నిర్వహించారు. 7 గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి వాహనమండపానికి తీసుకువచ్చి కొలువుదీర్చారు. అనంతరం పట్టు పీతాంబరాలు, రత్నకచిత మణిమాణిక్యాలతో రాజగోపాలుడు అలంకరించి కల్పవృక్ష వాహనంపై కొలువు దీర్చారు. ఉదయం 8 గంటలకు చిన్నారుల కోలాటాలు, సంప్రదాయ నృత్యకళాకారుల ప్రదర్శనలు, జియ్యర్ల ప్రవచనాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారు రాజగోపాలుడు అలంకరణలో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కల్పవృక్షం లక్ష్మీదేవి సహా పాలసముద్రం నుండి పుట్టిందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ కల్పవృక్షం అత్యంత పున్యఫలాలను ఇస్తుందని, అమ్మవారిని ఈనాడు దర్శనం చేసుకుంటే గతజన్మ, ఈ జన్మలో చేసిన పాపాలన్నీ నశిస్తాయని వేదపండితులు అంటున్నారు.
బ్రహ్మోత్సవాల నాలుగోరోజు పద్మావతి అమ్మవారరికి రాత్రి 8 నుంచి 10 గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది. అమ్మవారు హనుమంత వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీరాముడి పరమభక్తుడైన హనుమంతుడు కలియుగంలో వెంకటేశ్వరస్వామి అవతారం ఎత్తిన శ్రీరాముడి పట్టమహిషి అయిన సీతాదేవియే పద్మావతి దేవి కాబట్టి హనుమంతుడు పద్మావతి దేవిని తన భుజంపై ఎత్తుకుని ఊరేగుతాడు.