భారతీయ యోగలో ఉన్న అంతరార్థం ఇదే...
భారతీయ యోగలో ఉన్న అంతరార్థం ఇదే...
అల్పా ఏవ భవనా శాః
శాన్తిస్తే మహతీ భవేత్
మా భుజ్వా అధిక మాహారం
గాఢాం నిద్రాం సుఖం భజ
కోరికలు ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా మనశ్శాంతి ఉంటుంది. గాఢనిద్ర కావాలంటే ఆహారం స్వల్పంగా తీసుకోవాలిగా మరి!
'ది మాంక్ హూ సోల్డ్ ఫెర్రారి' అని ఓ వ్యక్తిత్వవికాస పుస్తకం వెలువడింది. అందులో ఓ లాయర్ రాత్రింబవళ్ళు డబ్బు సంపాదనలో పడతాడు. ఎంతగా డబ్బు సంపాదిస్తాడో, అంతగా అనారోగ్యం పాలవుతాడు. డబ్బు తప్ప వేరే ధ్యాస లేకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. చివరికి ఓ రోజు కోర్టులో వాదిస్తూ మధ్యలో గుండె నొప్పి వచ్చి పడిపోతాడు. అప్పుడాయనకి ఈ డబ్బు అనుభవించలేనప్పుడు సంపాదించి ఏం లాభం అన్న సందేహం వస్తుంది. సంపాదన ధ్యాసలో పడి జీవితాన్ని అనుభవించలేక పోతున్నానని గ్రహిస్తాడు. భారతదేశం వచ్చి జీవించటం నేర్చుకుంటాడు.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ కాపీలు అమ్ముడుపోయిందీ పుస్తకం, విదేశాలలోనే కాదు, మన దేశంలో కూడా పుస్తకం గొప్పగా అమ్ముడు పోయింది. తెలుగులో కూడా అనువదించారు. ఇది వ్యక్తిత్వ వికాసానికి ఉత్తమపుస్తకం అని పొగిడారు.
గమనిస్తే, ఆ పుస్తకంలో రచయిత కొత్తగా చెప్పిందేమీ లేదు. అనాదిగా మన దేశంలో అమలులో ఉన్న విషయాలనే ఆయన తన పుస్తకంలో చెప్పాడు. ఈ విషయాలతో పరిచయం లేని విదేశీయులు ఎగబడి కొన్నారంటే అర్థం ఉంది. కానీ మన దేశీయులు కూడా ఏదో కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నట్టు ప్రవర్తిస్తూ, ఎవరూ చెప్పని అద్భుతాన్ని చెప్పినట్టు భావించటం, మనం ఎంతగా మన జీవనవిధానానికి దూరమయ్యామో స్పష్టం చేస్తుంది.
ఏదైనా 'మితంగా ఉన్న వ్యక్తి మాత్రమే ప్రశాంతంగా ఉండగలడని భగవద్గీత స్పష్టంగా చెప్తుంది. అతిగా ఆహారం తీసుకునేవాడు, అతిగా సౌఖ్యాలను ఆశించేవాడు. ఆనందాన్ని అనుభవించలేడు అని భగవద్గీత బోధిస్తుంది. ఈ బోధన మరో రూపమే కోరికలు ఎంత తక్కువగా ఉంటే, మనిషి అంత ఎక్కువగా శాంతిని అనుభవిస్తాడన్నది.
కోరికలు అంతు లేనివి. సముద్రంలో అలలు వస్తూనే ఉన్నట్టు కోరికలు వస్తూనే ఉంటాయి. ఎగసిన అలలు తీరాన్ని తాకుతూ కాలక్రమేణా శిలలను సైతం ఇసుక రేణువుల్లా పిండిపిండి చేస్తాయి. ఎగసిపడే కోరికలు మానవవ్యక్తిత్వాన్ని సైతం ఇసుక రేణువుల్లా దిగజార్చేస్తాయి. సముద్రంలో అలలు గాలుల వల్ల వస్తాయి. గాలి వీయటం స్తంభిస్తే అలలూ స్తంభిస్తాయి. మనిషిలో కోరికలు అతడి ఊపిరి ఆడినంత కాలం వస్తూనే ఉంటాయి. ఊపిరి ఆగితే కోరికలు ఆగుతాయి. కానీ ఊపిరి లేకపోతే ప్రాణం పోతుంది. మనిషే ఉండడు. కాబట్టి ఊపిరిని నియంత్రించాలి. ఊపిరిని అదుపులోకి తెచ్చుకోవాలి. తద్వారా కోరికలను అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఇదే యోగం! ఇదే ఆధ్యాత్మిక తత్త్వం! ఇదే భారతీయ జీవనవిధానంలో స్వార్థపరుడైన పశువులాంటి మనిషిని నిస్వార్ధపరుడైన ఉత్తమ మానవుడిలా తీర్చిదిద్దే విధానం. ఆధ్యాత్మికతను నిత్యజీవితంలో అనుసరించటం వల్ల మనిషి సాధించే సంతృప్తి, సౌఖ్యాలను ప్రజలకు వివరించి, ఆచరణయోగ్యం చేయటం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వనిర్మాణం కావించటమే భారతీయధర్మం.
◆నిశ్శబ్ద.