సంధ్యా సమయంలో ఈ పనులు చేస్తే.. కష్టాల పాలవుతారు జాగ్రత్త..!
సంధ్యా సమయంలో ఈ పనులు చేస్తే.. కష్టాల పాలవుతారు జాగ్రత్త..!
ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే, సంధ్యా సమయంలో ఆ పని చేయవద్దు, ఈ పనులు చేయకూడదు.. అని చెప్పడం వినే ఉంటారు. సంధ్యాకాలం చాలా శుభ సమయం. ఆ సమయంలో దేవతలు ప్రయాణం చేస్తారు. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే సమయం కూడా సంధ్యాసమయమే.. ఆ సమయంలో ధ్యానం, ఆరాధన, భజనలు, దీపాలు వెలిగించడం, ధూపం వంటి శుభకార్యాలు చేయాలని పెద్దలు చెబుతుంటారు. సాయంత్రం సమయంలో ఇంటి ముందు ఉన్న తులసి మొక్క ముందు దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని, కృపను ప్రసాదిస్తుందని ఒక నమ్మకం ఉంది. సాయంకాలం సమయంలో కొన్ని పనులు చేయడం వల్ల ఆ భగవంతుని అనుగ్రహం కలిగినట్టు.. కొన్ని చేయకూడని పనులు చేయడం వల్ల చెడు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి సంధ్యాసమయంలో ఏ పనులు చేయకూడదో, ఎందుకు చేయకూడదో తెలుసుకుంటే..
సాయంత్రం అత్యంత పవిత్రమైన సమయం..
సూర్యాస్తమయం అయ్యే సమయాన్ని సంధ్యాకాలం అంటారు. సూర్యాస్తమయానికి సుమారు 45 నిమిషాల ముందు, తరువాత సమయాన్ని ప్రదోష కాలం అని కూడా పిలుస్తారు. ఇది అత్యంత పవిత్రమైన సమయం. ఈ సమయాన్ని సంపదకు అధిపతి అయిన కుబేరుడి కాలం అని కూడా అంటారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేయడం, ధ్యానం చేయడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు. అలాగే.. ప్రదోష కాలం పరమేశ్వరుడికి అత్యంత ప్రధానమైన సమయం. ఈ సమయంలో పరమేశ్వరుడు కైలాసంలో పార్వతీ దేవితో కలసి నాట్యం చేస్తుంటాడట. ఈ నాట్యం చూడటానికి దేవతలు అందరూ కైలాసంలోనే ఉంటారట. అందుకే ఈ సమయంలో పరమేశ్వర ఆరాధన, శివాభిషేకానికి ఎనలేని ప్రాధాన్యత ఉన్నాయి.
సాయంత్రం పూట ఈ పనులు అస్సలు చేయకూడదు..
జుట్టు, గోర్లు కత్తిరించకూడదు..
సూర్యాస్తమయం సమయంలో గోర్లు, జుట్టును కత్తిరించడం అశుభంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది గోర్లు కత్తిరించే వ్యక్తికి అతని కుటుంబానికి కూడా బాధను కలిగిస్తుంది. ఇది ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టం, మానసిక ఒత్తిడికి దారితీస్తుంది.
ఈ పని అస్సలు చేయవద్దు..
సూర్యాస్తమయం సమయంలో ఇంటిని ఊడ్చడం లేదా తుడుచుకోవడం మంచిది కాదు. నిజానికి ఈ సమయంలోనే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ సమయంలోపే ఇంటిని శుభ్రం చేసుకుంటే అమ్మవారు ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఆశీస్సులు ఇస్తారు. అలా కాకుండా సంధ్యాసమయంలో ఇల్లు ఊడ్చడం లేదా తుడవడం చేస్తుంటే లక్ష్మీదేవి వెనుదిరిగి వెళ్లిపోతుందట. ధననష్టం లేదా ఆర్థిక సమస్యలు ఎదురవుతాయట. కాబట్టి ఊడ్చడం, తుడుచుకోవడం వంటి పనులు సంధ్యా సమయంలో చేయకూడదు.
ఆర్థిక లావాదేవీలు చేయవద్దు..
వాస్తు శాస్త్రం ప్రకారం సాయంకాలం సమయంలో డబ్బు తీసుకొని ఇతరులకు ఇవ్వడం వంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈ సమయాన్ని కుబేరుడి కాలం అంటారు. ఈ సమయంలో డబ్బు అప్పుగా తీసుకున్నా, ఇచ్చినా లక్ష్మీదేవి ఇంట్లో ఉండదట. కాబట్టి ఉదయం లేదా మధ్యాహ్నం నగదు లావాదేవీలు చేయడం మంచిది.
సంధ్యాసమయంలో నిద్రపోవద్దు..
సంధ్యాసమయంలో నిద్రపోవడం మంచిది కాదు. ఆ సమయం భగవంతుని ధ్యానించే సమయం. ఆ శుభ సమయంలో నిద్రపోవడం వల్ల నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి కూడా సంధ్యా సమయంలో ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో నిద్రపోతే లక్ష్మీదేవి ఇంటికి వచ్చి వెళ్లిపోతుంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తుతాయి.
*రూపశ్రీ.