చాతుర్మాస్య వ్రతంలో ఇష్టమైనవి తినడం వదిలేయాలనే నియమం వెనుక రహస్యం ఇదే..!
చాతుర్మాస్య వ్రతంలో ఇష్టమైనవి తినడం వదిలేయాలనే నియమం వెనుక రహస్యం ఇదే..!
పురాణాల ప్రకారం మహర్షి భృగువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పరీక్షించినప్పుడు, విష్ణువు అత్యంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా గుర్తించాడట. చాతుర్మాసంలో మనం విష్ణువును మన గురువుగా చేసుకుని, ఆయన నుండి క్రమశిక్షణ నేర్చుకుంటే, మన సాధన పరిపూర్ణమవుతుందని, చాతుర్మాసం యొక్క ఆచారాలు కూడా ఫలవంతం అవుతాయని అంటారు. జీవితంలో విజయానికి క్రమశిక్షణ అత్యంత ముఖ్యమైనది.
శాస్త్రాల ప్రకారం చాతుర్మాసంలో తనకు ఇష్టమైనదాన్ని త్యాగం చేయడం ద్వారా క్రమశిక్షణను పాటించే వ్యక్తి ఖచ్చితంగా దేవునికి ఇష్టమైనవాడు అవుతాడట. క్రమశిక్షణ లేనప్పుడు మనం మన మనసుకు బానిసలమవుతాం. మానవుడు క్రమశిక్షణను అభ్యసించాలనే లక్ష్యంతో ఋషులు, సాధువులు చాతుర్మాసంలో తనకు ఇష్టమైనదాన్ని తినకూడదనే నియమాన్ని రూపొందించారు. కలియుగంలో దుఃఖాలకు ప్రధాన కారణం కోరికలను నియంత్రించుకోలేకపోవడం. మనస్సు ఎల్లప్పుడూ క్రమశిక్షణ ఉంటేనే సరైన మార్గంలో కదులుతుంది. ఎటువంటి బలవంతం లేకుండా ఏ పరిస్థితి కూడా క్రమశిక్షణ కలిగిన వాడిని నిరోధించలేదు. ఇష్టమైనవి వదిలేయడం లో కోర్కెలను అణుచుకునే సామర్త్యం పెరుగుతుంది.
ప్రతి సంవత్సరం శ్రీమహావిష్ణువు ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి నుండి నాలుగు నెలలు యోగ నిద్రలో నిమగ్నమై ఉంటాడు . యోగ నిద్ర అనేది స్వీయ నియంత్రణకు గొప్ప సాధన. నాలుగు నెలలు యోగ నిద్రలో నిమగ్నమైన తర్వాత, కార్తీక మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి నాడు విష్ణువు మేల్కొంటాడు. కాబట్టి భగవంతుని మేల్కొలుపు యొక్క ఈ ప్రత్యేక తేదీని శ్రీ హరి-ప్రబోధిని, దేవోత్తన ఏకాదశి అని పిలుస్తారు. దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి నుండి దేవోత్తన ఏకాదశి లేదా ఉద్దాన ఏకాదశి మధ్య నాలుగు నెలల కాలాన్ని 'చాతుర్మాస్యం' అంటారు.
చాతుర్మాస్యంలో శుభకార్యాల నిషేధం ఉందా?
మత గ్రంథాలలో చాతుర్మాస్యాలలో వివాహం, క్షవరం, యజ్ఞోపవీతం, నవగృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు చేయకూడదని చెప్పబడింది. ఈ కార్యాలను నిషేధించడానికి పండితులు ఇచ్చిన ప్రధాన కారణం ఏమిటంటే.. ప్రతి శుభ కార్యంలో విష్ణువును సాక్షిగా పరిగణించి ఒక తీర్మానం తీసుకుంటారు. చాతుర్మాస్యాల సమయంలో శ్రీ హరి యోగనిద్రలోనే ఉంటాడు కాబట్టి, ఆయనను ప్రార్థించడం ఆయన యోగ నిద్రను విచ్ఛిన్నం చేసినట్లేనట. ఈ విషయాల గురించి పండితుల ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది.
*రూపశ్రీ.