సత్యతపుడి వృత్తాంతం!

 

సత్యతపుడి వృత్తాంతం!

గోడిలుని శాపంవల్ల త్రాచుగా మారిన ఓ బ్రాహ్మణ బాలుడు. ఇతని అసలుపేరు ఉతత్యుడు. ప్రాచీన కాలంలో దేవదత్తుడనే బ్రాహ్మణుడు ఓ రాజు. ఇతని భార్య రోహిణి వీళ్లకు సంతానం లేదు. అందుకని ఇతడు పుత్రకామేష్టి యాగం చేశాడు. ఎందరో సాధువులు ఇందులో పాల్గొన్నారు. సుహోత్రుడు బ్రాహ్మణుడిగా, యాజ్ఞవల్క్యుడు పురోహితుడుగా, బృహస్పతి యజ్ఞకర్తగా, పైలుడు వేదాలు చదువుతుండగా గోడిలుడు స్తోత్రాలు గానం చేశాడు. అతడు పాడుతుండగా పామువచ్చి బుసకొడుతుంటే దేవదత్తుడు అతని ధ్వనిని చీత్కరించాడు.  అతడు కోపించి నీకు జన్మించేవాడు సర్పంగా జన్మిస్తాడని శపిస్తాడు. దేవవ్రతుడు అతడి పాదాలపై పడి క్షమాపణ అడుగుతాడు. 


అప్పుడు ఆ పాము సర్పంగా జన్మించినా గొప్ప రుషి అవుతాడని శాపవిమోచనం చెప్తాడు. ఆ తర్వాత ఉతత్యుడు జన్మిస్తాడు. ఇతడు అంతర్ముఖుడుగా ప్రవర్తించేవాడు. అతడి శైలిని మార్చడానికి ఎంతగానో ప్రయత్నించి విఫలం చెందారు. ప్రతివాడు ఇతడు సర్పమనే భావించి ఛీత్కారం చేయగా అతడు ఇల్లు వదలి గంగాతీరంలో ఓ గుడిసె వేసుకొని తీవ్రమైన తపస్సు చేశాడు. ఇతడు ఎవరికీ హానిచేసే వాడు కాదు. అబద్ధం చెప్పేవాడు కాదు. చుట్టుపక్కల వారు ఇతడిని సత్యతపసుడని పిలిచేవారు. అలా ఆ కుటీరంలో మానసిక ప్రశాంతత లేకుండా 14 సంవత్సరాలు జీవించాడు. ప్రజలు అతడి నిజాయితీకి ఎంతగానో ఆశ్చర్యపోయారు.  ఒకరోజు ఓ ఆటవికుడు ఓ పందిపై బాణం విసరగా అది శరీరంలోదిగి ఆశ్రమంలోకి పారిపోయింది. 

ఆటవికుడు అదెక్కడుందో అడగ్గా “ఎవరైతే చూసారో వారు మాట్లాడతారు. మాట్లాడగలిగినవారు చూడలేరు” అని సమాధానం ఇచ్చి ఎందుకు ఎవరిని పదేపదే ప్రశ్నిస్తావని అడగగా అతని విల్లు బాణాలు క్రిందపడి జ్ఞానోదయమై కుటీరాన్ని విడచి వెళ్ళిపోయాడు. తరువాత అతని గొప్ప తనం ఊరూరా తెలిసి చివరకు రాజుకి కూడా తెలిస్తుంది.  తన కుమారుడిని ఇంటికి తీసుకువెళ్తాడు. ఇప్పటికి బ్రాహ్మ ణులు పౌర్ణమినాడు ఇతడ్ని తలచుకుంటూ ఉంటారు. దేవీ భాగవతంలో ఇలా ఉంటే  వరాహపురాణంలో ఇతడి గురించి వేరే కథనం ఉంది. 

సత్యతపుడు ఓ బోయవాడని అతడు అరణ్యమున తిరుగు ప్రజలను హింసించి బ్రతికెడివాడని అతడొకసారి అరుణియను మునిని కొట్టబోగా అతడు నిర్భయముగా నుండుట చూచి అతని శిష్యుడై అతడివెంటే తిరుగుతూ ఓ పులి బారి నుండి అరుణుని రక్షించి అతడి శిష్యుడయ్యాడట. ఒకరోజు అరుణి అతడితో  నువ్వెప్పుడూ తెలియని వృక్షాల పండ్లు, కాయలు తినద్దు, అలాగే నిజాన్నే మాట్లాడు అని చెప్పి వెళ్ళాడు. అతడు ఇంకే అహారము దొరకక తపస్సు చేసుకొనెను. దుర్వాసుడు ఒకసారి అక్కడికి వెళ్ళాడు. అప్పుడు ఆయనకు ఆహారం ఇవ్వడానికి ఆలోచిస్తుంటే, నువ్వేమి హారం ఇస్తావని దుర్వాసుడు అడుగుతాడు. అప్పుడు శివుడిని ప్రార్థించి ఓ మణిపాత్రను పొంది సకల పదార్థముతో దుర్వాసునికి విందు చేయగా దుర్వాసుడు ఇతనికి సత్యసంధుడని నామకరణము చేసెను. ఆ తర్వాత ఇంద్రుడు ఉపేంద్రుడు బోయవాడు, పందిరూపంలో ఇతణ్ణి పరీక్షించనెంచి బోయవాడు ఆశ్రమములో దూరిన పందిని ఇవ్వమనగా "కన్ను చూసినా మాట్లాడలేదు నోరు మాట్లాడినా చూడలేదు” అని సత్యసంధతను నిరూపించుకొని పందిని కాపాడాడు. అప్పుడు ఇంద్రుడు నిజ రూపంలోకి మరి ఇతనికి వరాలు ఇచ్చారట.

ఇదీ సత్యతపుడి వృత్తాంతం.

                                 ◆వెంకటేష్ పువ్వాడ.