వాలి శాపం వెనుక కథ!
వాలి శాపం వెనుక కథ!
"పూర్వం దుందుభి అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడికి ఒంట్లో బలం ఉందన్న పొగరు చేత ఒకరోజు సముద్రుడి దగ్గరికి వెళ్ళి తనతో యుద్ధం చెయ్యమన్నాడు. నీతో నాకు యుద్ధం ఏమిటి, నీ బలం ఎక్కడ నా బలం ఎక్కడ నేను నీతో యుద్ధ చెయ్యలేను అని సముద్రుడు అన్నాడు. అప్పుడా దుందుభి నువ్వు నాతో యుద్ధం చెయ్యలేనంటే నేను నిన్ను వదలను, నాతో యుద్ధం చెయ్యగలిగిన వాడిని నాకు చూపించు' అన్నాడు. అప్పుడా సముద్రుడు 'హిమవంతుడని ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద పర్వతం ఉంది, అది మంచు పర్వతం. ఆయన కూతురు పార్వతీ దేవి, ఆ పార్వతీ దేవిని పరమశివుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆయన మీద గొప్ప గొప్ప అరణ్యాలు, గుహలు ఉన్నాయి. నువ్వు ఆ హిమవంతుడితో యుద్ధం చెయ్యి' అన్నాడు.
అప్పుడా దుందుభి హిమవంత పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వత శిఖరాలని పీకేసి ముక్కలు చేస్తున్నాడు. దుందుభి చేస్తున్న అల్లరికి హిమవంతుడు పరుగు పరుగున వచ్చాడు. అప్పుడా దుందుభి హిమవంతుడిని యుద్ధానికి రమ్మన్నాడు, నాకు ఎవరితోనూ యుద్ధం చెయ్యాలని లేదు, నేను యుద్ధం చెయ్యను అని హిమవంతుడు. అన్నాడు. అప్పుడా దుందుభి 'నువ్వు కూడా ఇలాగంటే ఎలా. సముద్రుడు కూడా నీలాగే యుద్ధం చెయ్యనన్నాడు. పోనీ నాతో యుద్ధం చేసేవాడి పేరు చెప్పు అన్నాడు. అప్పుడు హిమవంతుడు 'నీ ఒంటి తీట తీర్చగలిగినవాడు ఒకడున్నాడు. కిష్కింద రాజ్యాన్ని ఏలే వాలి ఉన్నాడు. మంచి బలవంతుడు. ఆయన నీతో యుద్ధం చేస్తాడు' అని చెప్పాడు.
అప్పుడా దుందుభి సంతోషంగా కిష్కిందకి వెళ్ళి, అక్కడున్న చెట్లని విరిచి, ఆ కిష్కింద ద్వారాన్ని పగులగొట్టి పెద్ద అల్లరి చేశాడు. లోపల భార్యతో సంతోషంగా గడుపుతున్న వాలి ఈ అల్లరికి బయటకి వచ్చాడు. ఆ దుందుభి వాలిని చూసి ఛి, భార్యతో సరసం ఆడుతున్నావా. నా కోపాన్ని రేపటిదాకా ఆపుకుంటాను. పో, నీకు సమానమైన వాడిని వెతికి పట్టాభిషేకం చేసెయ్యి. తాగి ఉన్నవాడిని, భార్యతో ఉన్న వాడిని, అప్రమత్తంగా లేనివాడిని, యుద్ధం నుండి పారిపోతున్నవాడిని, ఆయుధం లేనివాడిని చంపితే పసిపిల్లాడిని చంపిన పాపం వస్తుంది, అందుకని నేను నిన్ను వదిలేస్తున్నాను. ఎలాగోలా ఈ రాత్రికి ఇక్కడ కూర్చొని ఉంటాను. రేపు పొద్దున్న రా, నిన్ను చంపి అవతల పడేస్తాను' అన్నాడు.
అప్పుడా వాలి 'నువ్వు నా గురించి అంతగా బెంగ పెట్టుకోకు. నేను తాగి ఉన్నా కూడా, అది వీరరసం తాగినవాడితో సమానం, రా యుద్ధానికి అని, అడ్డువచ్చిన భార్యలని పక్కకు తోసేసి దుందుభి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇంద్రుడు ఇచ్చిన మాలని వాలి తన మెడలో వేసుకుని దుందుభి తల మీద ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి దుందుభి ముక్కు నుండి, చెవుల నుండి నెత్తురు కారి కిందపడిపోయాడు. ఆ హోరాహోరి యుద్ధంలో వాలి దుందుభిని సంహరించాడు. అప్పుడాయన ఆ దుందుభి శరీరాన్ని గిరగిర తిప్పుతూ విసిరేశాడు. అప్పుడది గాలిలో యోజన దూరం ఎగురుకుంటూ వెళ్ళి మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడింది.
అలా పడిపోవడంలో ఆశ్రమం అంతా నెత్తురితో తడిసిపోయింది. అప్పుడా మతంగ మహర్షి బయటకి వచ్చి దివ్య దృష్టితో చూసి 'ఎవడురా ఒళ్ళు కొవ్వెక్కి దుందుభి కళేబరాన్ని ఇటు విసిరినవాడు, ఈ శరీరాన్ని విసిరిన దౌర్భాగ్యుడు ఇక్కడికి వస్తే వాడి తల వెయ్యి ముక్కలయ్యి మరణిస్తాడు' అని చెప్పాడు. అదే వాలి ఋష్యమూక పర్వతం మీదకు వెళ్లకుండా ఉండటానికి కారణం.
◆ వెంకటేష్ పువ్వాడ.