Read more!

కంస వధ ఎలా జరిగింది... అతని తమ్ముళ్ల గతజన్మ ఏంటి!

 

కంస వధ ఎలా జరిగింది... అతని తమ్ముళ్ల గతజన్మ ఏంటి!

కంసుడు పులినాకిన మేకపిల్లలా సభామందిరంలో సింహాసనం మీద ఒదిగొదిగి కూర్చుని వున్నాడు. అతని చుట్టూ మంత్రులూ, సైనికులూ వున్నారు. నిలువెల్లా కంపిస్తున్న తన అనుచరుల్నీ, మృత్యువుకు కొత్తగా అబ్బిన మనోహనర కిశోర రూపంలో ఎదుట నిలిచిన నల్లనయ్యను చూసి కంసుడు ఇక తెగించక తప్పదనుకున్నాడు. చావు ధైర్యం తెచ్చుకుని 'పిచ్చెక్కిన ఏనుగునూ, తాగి తూలుతున్న యోధులనూ సంహరించడం గొప్ప కాదు. నాతో యుద్ధానికి రా. బలాబలాలు తేల్చుకుందాం' అన్నాడు శౌరివైపు తిరిగి.

కన్నయ్యకు  కోపం వచ్చింది.  కంసుడి మీదకు ఉరికాడు. మృత్యువు మాదిరి తన మీదకు వస్తున్న అచ్యుతుడ్ని చూసి కంసుడు తటాలున సింహాసనం మీద నుంచి కిందకు దూకాడు. ఒర నుంచి ఖడ్గాన్ని తీసి కృష్ణుడితో తలపడ్డాడు. కృష్ణుడు అంతెత్తుకు ఎగిరి అక్కడ నుంచి కొదమసింహంలా కంసుడి పైకి లంఘించాడు. ఆ దెబ్బతో కంసుడి కిరీటం బండి చక్రంలా దొర్లుకుంటూ వెళ్ళి దూరంగా పడింది. కృష్ణుడు కంసుడి జట్టు పట్టుకు లాగి విసురుగా తోశాడు. కంసుడు వెల్లకిలా పడ్డాడు. అతని పక్కటెముకలు నుగ్గు నుగ్గయ్యాయి. లేవలేక కూలబడిపోయాడు. మాధవుడు ఎగిరి అతని ఎదురు రొమ్ముమీద కూర్చున్నాడు. పిడికిళ్ళతో మర్దించాడు.

కంసుడు నురుగులు కక్కాడు. 'మామా! నిన్ను నేను ఈవేళ చంపడం కాదు,  కొన్నేళ్ళుగా చంపుతున్నాను. రాత్రింబవళ్ళు  అనుక్షణం తింటూ, తాగుతూ, విహరిస్తూ కూడా నన్నే తలుచుకుని భయపడ్డావు. నేను గుర్తుకు వచ్చినప్పుడల్లా నీకు కంటిమీద నిద్ర వుండేది కాదు. ప్రతి కదలికలో, ప్రతి ఒక్కరి నీడలో నన్నే చూసి నరక యాతన పడ్డావు. ఎందుకొచ్చిన దిగులు చెప్పు? క్షణం క్షణం చస్తూ బతికే కన్నా ఒకేసారి చావడం మంచిది' అని ఒక్కపోటు పొడిచాడు. కంసుడికళ్ళు మూతపడ్డాయి. అతనిలోంచి ఒక దివ్యతేజం వచ్చి కృష్ణుడిలో లీనమైంది. సభ అంతా చేతులు జోడించి ఆ కిశోరవీరుడికి నమస్కరించింది.

కంసుడి మరణ వార్త విని ఉగ్రులై అతని తమ్ములు కంకుడు, న్యగ్రోధుడు, గహ్వుడు మొదలైనవారు ఒక్కుమ్మడిగా బలరామకృష్ణులమీద విరుచుకుపడ్డారు. బలరాముడొక్కడే వాళ్ళందర్నీ హతమార్చాడు.

కంసుడి సోదరులు పూర్వం అలకాపురంలో వుండేవారు. వాళ్ళందరూ దేవయక్షుని కుమారులు. దేవకూట, మహాగిరి, గండ, చండ, ప్రచండ, ఖండ, అఖండ, పృధువులని వాళ్ళకు పేర్లుండేవి. ఆ అన్నదమ్ములొకసారి తండ్రి ఆజ్ఞ మేరకు మానససరోవరానికి వెళ్ళి మహేశ్వరుడ్ని పూజించేందుకు అరవిందాలు కోసుకువచ్చారు. కానీ, దారిలో వాటి సుగంధాలకు ముగ్ధులై వాసన చూశారు. దానివల్ల వారికి ఉచ్ఛిష్టీకృత దోషం (ఎంగిలి చేసిన పదార్థాలను నివేదన చెయ్యడం, వాసన చూసిన పూలతో పూజించడం వల్ల కలిగే దోషం) సంభవించింది. ఆ కారణంగా వారు ఎనిమిదిమందీ వరుసగా మూడు జన్మలలో రాక్షసులై పుట్టారు. మూడవసారి ఉగ్రసేనుని కుమారులుగా జన్మించారు. శ్రీకృష్ణుని చేతిలో మరణించి పాపవిమోచనం పొందారు.

కంసుని మరణవార్త వినగానే ప్రజలంతా ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. చెరసాలలో మగ్గుతున్న దేవకీవసుదేవులకు నల్లనయ్య విముక్తి కలిగించాడు. వారు కారాగారం నుంచి బయటకు రాగానే బలరామకృష్ణులు వారికి పాదాభివందనం చేశారు.

ఆనందంతో దేవకీవసుదేవులు పరవశించారు. దేవకీదేవి తటాలున వంగి బిడ్డల్ని లేవదీసి గుండెలకు హత్తుకుంది. బలరామకృష్ణులు చంటిబిడ్డల్లా తల్లిని చుట్టుకుపోయారు.

'అమ్మా! పుట్టటమైతే నీ కడుపున పుట్టాను, కాని, పసితనం నుంచే నీ ప్రేమానురాగాలకు దూరమయ్యాను. ఆ దురదృష్టమంతా నాదే. నువ్వేం బాధపడకు. కంసుడి చేతిలో మీరు పడుతున్న కష్టాలు తెలిసి కూడా మిమ్మల్ని రక్షించడానికి ఇంత ఆలస్యమైనందుకు మన్నించండి' అని కృష్ణుడు తల్లిని వేడుకున్నాడు.

దేవకీవసుదేవులు నల్లనయ్యను దగ్గరకు తీసుకుని పరవశులయ్యారు. తరువాత కృష్ణుడు ఉగ్రసేనుడ్ని పిలిచి 'మహారాజా! యయాతి శాపం వల్ల యాదవులకు సింహాసనం ఎక్కే అధికారం లేకుండా పోయింది. కనుక మీరే ఈ భూమికి అధిపతి కావాలి. సింహాసనం స్వీకరించండి. ధర్మం తప్పకుండా పాలన చేయండి' అన్నాడు. ఉగ్రసేనుడు శ్రీకృష్ణపరమాత్మకు నమస్కరించాడు.

                                   ◆నిశ్శబ్ద.