ద్వారాకానగర నిర్మాణానికి.. కాలయవనుడికి సంబంధం ఇదే!
ద్వారాకానగర నిర్మాణానికి.. కాలయవనుడికి సంబంధం ఇదే!
కాలయవనుడు యాదవ పురోహితుడైన గర్గాచార్యుని కుమారుడు. మహావీరుడు. తన బలపరాక్రమాలతో యాదవులను హడలగొడుతుండేవాడు.
గురుడు ఆజన్మ బ్రహ్మచారి అని తెలిసిన ఒకడు, ఒకసారి 'ఈయన పురుషుడే అయితే పెళ్ళిచేసుకోకుండా ఎందుకు వుంటాడు?' అని హేళనగా అన్నాడు. గర్గుడు అది విని బాధపడ్డాడు. తరువాత ఆయన అడవికి వెళ్ళి పన్నెండు సంవత్సరాల పాటు అమితనిష్టతో మహేశ్వరుని గూర్చి తపస్సు చేశాడు. ఆ సమయంలో ఆయన లోహచూర్ణం మాత్రమే భుజించేవాడు.
గర్గాచార్యుని దీక్షకు మెచ్చి మహేశ్వరుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. 'వరమేదైనా కోరుకో” అన్నాడు.
'మహాత్మా! బలపరాక్రమ సంపన్నుడయిన ఒక కుమారుడ్ని ప్రసాదించు' అని గర్గుడు ప్రార్థించాడు. ఈశ్వరుడు సరేనన్నాడు. అతనే కాలయవనుడు.
కాలయవనుడు మహా గర్విష్టి, ఎవ్వరినీ లక్ష్యపెట్టేవాడు కాదు. అతను ఒక సారి నారద మహర్షి ఎదురైనప్పుడు 'స్వామీ! ఈ ప్రపంచంలో వీరులయినవారు ఎవరయినా వున్నారా?' అని అడిగాడు.
'లేకేం నాయనా! శ్రీకృష్ణుడు ఉన్నాడుగా! అతనిని మించిన వీరుడు ఈ భూమిమీద లేడు' అన్నాడు.
మహర్షి మాటలు వినగానే కాలయవనుడిలో మత్సరం పెరిగింది. శ్రీకృష్ణుడ్ని ఓడించాలనే దుర్బుద్ధి పుట్టింది. అతను తన బలాన్నంతా సమకూర్చుకుని మధురానగరం మీద దాడి చేశాడు.
అది తెలిసి శ్రీకృష్ణుడు అతని దగ్గరకు ఒక కృష్ణసర్పాన్ని మూతి కట్టి, కుండలో పెట్టి పంపాడు. 'కృష్ణుడు కృష్ణ సర్పంవంటి వాడు సుమా' అని పరోక్షంగా హెచ్చరించాడు.
కాలయవనుడు అది గ్రహించాడు. గ్రహించి, కొన్ని గండు చీమలను తెప్పించి వాటిని ఆ కుండలో వుంచి శ్రీకృష్ణుడి దగ్గరకు మళ్ళీ పంపించాడు. 'వ్యక్తిగతంగా ఎవరి మటుకు వారు బలహీనులే అయినా, పదిమంది కలిసి వస్తే ఎంతటి బలవంతుడైనా ఆ సామూహిక శక్తికి లోబడవలసిందే!' అని కాలయవనుడు. సూచించాడు.
శ్రీకృష్ణుడికి పరిస్థితి అర్థమైంది. కాలయవనుడు మూడు కోట్ల మంది రాక్షసులతో మధురానగర పరిసరాల్లో ఒక వంక పొంచి వున్నాడు. కంసుడి మామ జరాసంధుడు రేపోమాపో కొన్ని అక్షౌహిణుల సేనతో మరో దిక్కునుంచి రాబోతున్నాడు. 'ఈ సమయంలో యాదవులను ఆపదనుంచి రక్షించడం నా ధర్మం' అనుకున్నాడు.
సాగరుని ప్రార్థించి సముద్రం మధ్య నూరు యోజనాల పొడవూ, నూరు యోజనాల వెడల్పూ వున్న స్థలాన్ని సంపాదించాడు. అక్కడ ఒక మహాదుర్గాన్ని నిర్మించవలసిందిగా విశ్వకర్మను ఆదేశించాడు. విశ్వకర్మ అనతికాలంలోనే ఒక సుందరనగరాన్ని నిర్మించాడు. ఆ పురానికి అలంకారంగా మహేంద్రుడు తన సుధర్మ అనే సభా భవనాన్ని, వృక్షరాజమైన పారిజాతాన్ని పంపించాడు. ఆ విధంగా ఏర్పాటయిన నగరానికి ద్వారకానగరమని పేరు పెట్టారు. శ్రీకృష్ణుడు తన యోగ శక్తిద్వారా తన వారినందరినీ క్షణంలో ద్వారకానగరానికి తరలించి వారి రక్షణ భారాన్ని బలరాముడికి అప్పగించాడు. తను వనమాలను మాత్రం ధరించి నిరాయుధుడై మధురానగరం వైపు వెళ్ళాడు.
ఏ ఆయుధమూ లేకుండా నింపాదిగా నడచి వస్తున్న శ్రీకృష్ణుడ్ని చూసి కాలయవనుడు వికటాట్టహాసం చేశాడు. నల్లనయ్యను బంధించాలని ఎదురువెళ్ళాడు.
అది చూసిన శ్రీకృష్ణుడు కాలయవనుడికి భయపడ్డట్టు నటిస్తూ వెనక్కి పరుగెత్తాడు. కాలయవనుడు ఆయనను తరుముకుంటూ వెళ్ళాడు.
అలా వెళ్ళి వెళ్ళి శ్రీకృష్ణుడు ఒక గుహలోకి ప్రవేశించాడు. శ్రీకృష్ణుడిని తరుముతూ కాలయవనుడు గుహలోకి వచ్చాడు. అక్కడ ఒకతను గాఢంగా నిద్రపోతూ కనిపించాడు. కాలయవనుడు ఆయనను కాలితో ఒక్క తన్ను తన్నాడు. ఎంతోకాలంగా ఆ గుహలో నిద్రపోతూవున్న ఆ వ్యక్తి కాలయవనుని వల్ల లేచాడు. లేచి, అమితమయిన కోపంతో తన ఎదురుగావున్న కాలయవనుని వంక చురచుర చూశాడు. ఆ చూపు వేడిమికి కాలయవనుడు నిలువునా భస్మమైపోయాడు.
కాలయవనుని ఆవిధంగా చూపులతో భస్మం చేసినవాడు యవనాశ్వుని మనుమడూ, మాంధాత కుమారుడూ అయిన ముచికుందుడు. ఆయన ఇక్ష్వాకు వంశీయుడు, పరమభక్తుడు. ఒకప్పుడు ముచికుందుడు, రాక్షసులకు భయపడిపోయిన దేవతలను కొంతకాలంపాటు కాపాడాడు. ఆ సమయంలో దేవతలు ప్రత్యుపకారంగా ఆయనను ఏదైనా వరం కోరుకోమన్నారు.
ముచికుందుడు తనకు మోక్షాన్ని ప్రసాదించమని కోరాడు. 'దేవతలకెవరికీ మోక్షాన్ని ప్రసాదించే శక్తి లేదు. ఆ శక్తి శ్రీహరికి ఒక్కనికే వుంది. ఆయన నీకు పరమపదాన్ని అనుగ్రహిస్తాడు' అని అభయమిచ్చారు. దేవతలు.
ముచికుందుడి భార్యలూ, బంధువులూ, మిత్రులూ చాలామంది అప్పటికే మరణించారు. అందుకని వేదనలన్నీ మరిచిపోయేలా తనకు మంచి నిద్రను ప్రసాదించమని దేవతలను కోరాడు. అలా నిద్రను దేవతల నుండి వరంగా పొంది పర్వత గుహలోకి ప్రవేశించి పడుకున్నాడు. దేవదత్తమయిన ఆ నిద్రను భంగపరచినందుకే కాలయవనుడు ముని కోపాగ్నికి ఆహుతయ్యాడు.
కాలయవనుడలా కన్నుమూశాక శ్రీకృష్ణుడు ముచికుందుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు.
'ముచికుందా! నిన్ను అనుగ్రహించేందుకు వచ్చాను. నా భక్తులు నన్ను దర్శించాక దుఃఖపడకూడదు. నీకే వరంకావాలో కోరుకో ఇస్తాను' అన్నాడు. ముచికుందుడు చేతులు జోడిస్తూ 'తండ్రీ! నీ సేవాభాగ్యం తప్ప నాకు వేరేమీ అక్కర్లేదు' అన్నాడు. అది విని కృష్ణుడు అమితానందం పొందాడు. కృష్ణుని అనుగ్రహం పొందిన ముచికుందుడు అక్కడనుంచి నరనారాయణ స్థానమైన బదరికాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ నిశ్చల చిత్తంతో శ్రీహరిని ధ్యానిస్తూ కాలం గడిపాడు.
◆నిశ్శబ్ద.