Read more!

తిరుమల కొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?

 

తిరుమల కొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?

 

 

ఏడుకొండలు మీద వెంకటేశ్వరుడెందుకున్నాడంటే దానికొక ఆధ్యాత్మిక రహస్యాన్ని చెబుతారు. శరీరంలో ఏడు చక్రాలున్నాయి. అవి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, అజ్ఞ, సహస్రారం ... అధోముఖమైన కుండినీ శక్తిని యోగాభ్యాసంతో సహస్రానికి పంపించడం పరమాత్మ సాక్షాత్కారానికి మార్గం. ఏడు కొండలకు ఏడు పేర్లున్నాయి. అవి అంజనాద్రి, వృషభాద్రి, నీలాద్రి, శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి.

 

 

 

 


అంజనాద్రి అనే పేరు  ఎందుకొచ్చిందంటే ... త్రేతాయుగంలో అంజనాదేవి పుత్ర సంతానం కోసం మాతంగ మహర్షి సలహా మేరకు ఆకాశగంగ సమీపంలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసింది. వాయుదేవుని వరప్రసాదంగా వాయు సమాన బలవంతుడైన హనుమంతుని కుమారునిగా పొందింది. అంజనాదేవి తపమాచరించిన పర్వతం కావడం వల్ల ఈ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చింది.

 

 

 

 


వృషభాద్రి పేరు ఎలా వచ్చిందంటే ... కృతయుగంలో వృషభాసురుడనే రాక్షసుడు మహావిష్ణువు భక్తుడు, అయితే శ్రీహరితో యుద్ధాన్ని కోరుకున్నాడు. విష్ణువు వృషహాసురినితో యుద్ధం చేసాడు. ఎంతటీ వృషభుడు చనిపోక పోయేసరికి చివరకు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సుదర్శునుని మహిమ తెలిసిన వృషభాసురుడు ఇక్కడ వెలసిన కొండకు తన పేరు వచ్చేలా వరాన్ని కోరాడు. మహావిష్ణువు వృషభుడు కోరిన వరాన్ని యిచ్చి వధించాడు. అందువల్ల ఆ కొండకు వృషభాద్రి అనే పేరు వచ్చింది.

 

 

 

 


నీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే ... ఏడు కొండలలో ఒక కొండ అయిన నీలాద్రి మీద క్రూరజంతువుల సంచారం విపరీతంగా ఉండేది. దానివల్ల తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని నీలాదేవి శ్రీనివాసున్ని వేడుకుంటుంది. అప్పుడు స్వామి నీలాద్రి మీద క్రూరజంతువులను వేటాడి అలసి నిద్రిస్తాడు. అలా నిద్రిస్తున్న శ్రీనివాసుని సుందర రూపాన్ని నీలాదేవి చూస్తుండగా, నుదుటిపై కొంతభాగం వెంట్రుకలు లేకపోవడాన్ని గమనిస్తుంది. అంతటి మనోహర రూపానికి అది పెద్దా లోపంగా ఆమె భావిస్తుంది. తన కురులలో కొంతభాగం తీసి శ్రీవారి తలకు అతికిస్తుంది. వెంటనే శీనివాసునికి నిద్రాభంగం అయి మెలకువ వస్తుంది. ఎదురుగా ఉండే నీలాదేవి నొసటిపై రక్తం కారుతూ ఉంటుంది. ఆమె భక్తికి సంతోషపడిన స్వామి తన కొండడు వచ్చిన భక్తులు తమ నీలాలను సమర్పిస్తారని అవి నీలాదేవికి చేరుతయనే వరమిచ్చాడు. ఆ కారణం వల్లే కొండకు నీలాద్రి అనే పేరు వచ్చింది.

 

 

 

 


శేషాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే ... మహావిష్ణువు ఆదేశానుసారం భూలోకంలో స్వామి విహారం కోసం శేషుడు ఈ పర్వత రూపాన్ని ధరించడం వల్ల దీనికి శేషాచలం అనే పేరువచ్చింది. శ్రీహరి వాయువుకు, శేషునికి పందెం పెడతాడు. శేషుడు వెంకటాద్రిని చుట్టుకుంటాడు. వాయువు మహావేగంతో వీస్తాడు. శేషుడు స్వర్ణముఖి తీరం వరకూ వెళతాడు. మహావిష్ణువు ఆజ్ఞతో వెంకటాద్రి విడివడుతుంది. శేషుడు అక్కడే తపస్సు చేయడం వల్ల శేషాద్రి అనే పేరు వచ్చింది. ఈ కొండకు గరుడాద్రి అనే పేరు కూడా ఉంది. శ్వేత వరాహకల్పంలో వరాహస్వామి ఆజ్ఞ ప్రకారం గరుత్మంతుడు శ్రీవైకుంఠం నుంచి ఈ పర్వతాన్ని తీసుకుని రావడం వల్ల ఈ కొండకు గరుడాద్రి అనే పేరువచ్చింది.

 

 

 

 


నారాయణాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే ... సాక్షాత్ నారాయణుడే నివసించడంవల్ల నారాయణాద్రి అనే పేరు వచ్చింది. అంతేగాదు, శ్రీమన్నారాయణుడు మొట్టమొదట ఈ గిరి మీద పాదాలు మోపడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. అదే గాకుండా నారాయణుడే భక్తుడు తపమాచరించి నారాయణుని సాక్షాత్కారం పొందడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. అలాగే నారాయణుడనే బ్రాహ్మణుని ప్రార్థన మన్నించి శ్రీనివాసుడు వాసం చేయడం వల్ల కూడా నారాయణాద్రి అనే పేరు వచ్చింది.

 

 

 

 


వెంకటాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే ... "వేం''కారానికి అమృతమని అర్థం "కటం'' అంటే ఐశ్వర్యం, నమ్మి కొలిచేవారికి అమృతాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే కొండ అని అర్థం. అలాగే పాపాలకు ''వేం'' అనే అర్థం ఉంది. ఆ పాపాలను దహించే కొండ కాబట్టి ఈ కొండకు వెంకటాద్రి అనే పేరు వచ్చింది. వెంకటాద్రి అనే పేరు రావడానికి ఇంకొక కథ కూడా ప్రచారం ఉంది. పూర్వం శ్రీకాళహస్తిలో పురందరుడు అనే శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణుడు ఉండేవాడు. పుత్రసంతానం లేక బాధపడి అనేక వ్రతాలు చేసాడు. చివరకు ముసలితనంలో మాధవుడనే పుత్రుణ్ణి కన్నాడు. మాధవుడు వేదవేదాంగాది సకల విద్యలను నేర్చుకుని మహాపండితుడయ్యాడు. యుక్తవయస్సు వచ్చింది. చంద్రలేఖ అనే కన్యను పెళ్ళి చేసుకున్నాడు. ఏ లగ్నంలో పెళ్ళి చేసుకున్నాడో కానీ కామాంధుడై భార్యను వదిలి, బ్రాహ్మణ విధులను విడిచి స్త్రీల పొందు పొందేవాడు. అంతేకాకుండా కుంతల అనే వేశ్యను మోహించి దిగజారిపోయి జంధ్యాన్ని తెంచేసి, మద్యమాంసాలను స్వీకరిస్తూ ఆమెతో సుఖించేవాడు. కొంతకాలానికి ఆమె మరణిస్తుంది. ఆమె వియోగంతో అతను పిచ్చివాడిలాగా దేశదిమ్మరి అయిపోతాడు. ఒకరోజు వెంకటాద్రి యాత్ర వెళ్ళే భక్తుల్ని చూశాడు. వాళ్ళతో కలిసి వేంకటాచలానికి బయలుదేరాడు. మొదట చక్రతీర్థంలో స్నానం చేశాడు. దాంతో అతని కల్మషాలన్నీ పోతాయి. పితృదేవతలకు మట్టి పిండప్రదానం చేశాడు. వాళ్ళు ముక్రి పొందారు. వేంకటాచల మహత్యం వల్ల అతని పాపాలన్నీ దహించుకుని పోయాయి. ఆ విశేషాన్ని చూడడానికి దేవతలంతా వచ్చి వెంకటాద్రి మహాత్యాన్ని కొనియాడారు. అప్పుడు బ్రహ్మదేవుడు మాధవుని చూసి "ఓ బ్రాహ్మణుడా! నువ్వు వెంకటాచలం మహిమ వల్ల పాపాలను పోగొట్టుకున్నావు. వెంటనే స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకో. మరుజన్మలో పాండవ వంశంలో ఆకాశరాజుగా పుడతావు. లక్ష్మీదేవి నీ కూతురుగా పుడుతుంది. శ్రీనివాసుడు నీకు అల్లుడు అవుతాడు. అన్ని కోరికలు తీరి చివరికి వైకుంఠాన్ని చేరుకుంటావు. ఈ పర్వతం వేంకటాద్రి అనే పేరుతొ వర్థిల్లుతుంది'' అని చెప్పు అదృశ్యమవుతాడు. సర్వపాపాలను దహించేది కాబట్టి వేంకటాద్రి అని అర్థం.

 

 

 

 


శ్రీశైలం అనే పేరు ఎలా వచ్చిందంటే ... శ్రీ అంటే లక్ష్మీదేవి నివసించే కొండ కాబట్టి దీనికి శ్రీశైలమనే పేరు కూడా వచ్చింది. ఈ కొండడు మరొక పేరు వుంది. అదే శ్రీనివాసాద్రి. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదించినప్పుడు అందులో లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవి నారాయణుడిని చూసి తనను పెళ్ళాడమని కోరుకుంది. అప్పుడు నారాయణుడు తనకు ఇల్లు వాకిళ్ళు లేవు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాను ... పైగా తనకు భక్తులు ఎక్కడ భక్తితో పూజిస్తారో అక్కడ తాను ఉంటానని. కాబట్టి నువ్వు నా వక్షస్థలంలో ఉండు అని లక్ష్మీదేవికి చెపుతాడు శ్రీ మహావిష్ణువు."శ్రీ'' నివసించే చోటు కాబట్టి స్వామిని శ్రీనివాసుడని. శ్రీనివాసుడు నివసించే తిరుమలకు 'శ్రీనివాసాద్రి'' అనే పేరు వచ్చింది.

 

 

 

 

దీనికి వృషాద్రి అనే మరొక పేరు ఉంది. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ... వృష అనే పదానికి ధర్మమనే అర్థం. ధర్మదేవత తన అభివృద్ధి కోసం ఈ కొండ మీద తపస్సు చేయడం వల్ల దీనికి వృషాద్రి అనే పేరు వచ్చింది. అదే కాకుండా యమధర్మరాజు ఈ కొండపైన తపస్సు చేయడంవల్ల కూడా వృషాద్రి అనే పేరు వచ్చింది. ఈ ఏడు కొండలకు ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. అవి ... చింతామణిగిరి, జ్ఞానాద్రి, తీర్థాద్రి, పుష్కరాద్రి, కనకాద్రి, వైకుంఠాద్రి, సింహాద్రి, వరాహగిరి, నీలగిరి, సుమేరు శఖరాచలం.