గోవింద నామాల యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసా!
గోవింద నామాల యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసా!
మహా విష్ణువు, కృష్ణుడు, రాముడు.. ఇలా మహా విష్ణువు అవతారాలకు చెందిన అన్ని అవతార స్వరూపాలకు గోవింద నామం ఉండటం గమనించే ఉంటారు. మహావిష్ణు అవతారాలను దర్శించినప్పుడు ఆ పుణ్యక్షేత్రాలలో కూడా గోవింద నామం పెట్టుకున్న వారు విరివిగా కనిపిస్తుంటారు. ఇక మరీ ముఖ్యంగా.. మహావిష్ణు అవతారాలను ఆరాధించేవారు, స్వామి వారి సేవకే అంకితమైనవారు ఉంటారు. వీరి నుదుటన ఎప్పుడూ గోవింద నామం కనిపిస్తూ ఉంటుంది. అసలు గోవింద నామం ఆకారం ఎందుకు అలా ఉంటుంది? దీని ప్రాధాన్యత ఏంటి? తెలుసుకుంటే..
గోవింద నామం..
గోవింద నామం U ఆకారంలో ఉంటుంది. ఈ తిలకాన్ని ఊర్ధ్వ పుండ్ర తిలకం అంటారు. ఇది పద్మ పురాణంలో ప్రస్తావించబడింది .
ఊర్ధ్వపుండ్రం ధారయేద్యస్తు విష్ణోర్భక్తో జితేంద్రియః. స విష్ణోః పరం స్థానం ప్రాప్నోతి నాత్ర సంశయః ।
అని ప్రస్తావించారు. అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని, ఊర్ధ్వ పుండ్రాన్ని ధరించిన భక్తుడు ఖచ్చితంగా శ్రీమహావిష్ణువు నివాసమైన వైకుంఠాన్ని పొందుతాడు అని అర్థం.
రెండు U- ఆకారపు రేఖలు విష్ణువు పాదాలను సూచిస్తాయి, మధ్య రేఖ లక్ష్మీ దేవిని సూచిస్తుంది. దీని అర్థం విష్ణువు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీ దేవి ఉంటుంది.
వివిధ వైష్ణవ శాఖలలో ఈ తిలకం కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, శ్రీ వైష్ణవ శాఖ వారు తెల్ల గంధపు చెక్కను ఉపయోగించి మధ్యలో ఎరుపు లేదా పసుపు గీతతో గోవింద నామం పెట్టుకుంటారు.
గౌడీయ వైష్ణవులు గంధపు చెక్కతో పొడవైన U ఆకారాన్ని ధరిస్తారు. వీరు ఇస్కాన్ కు సంబంధించినవారు.ఈ తిలకం అది ముక్కు మూలం వరకు వెళుతుంది, దాని కింద తులసి ఆకు చిహ్నం ఉంటుంది.
మధ్వ వర్గం వారు వాయుపుత్రుడైన హనుమంతుని చిహ్నంగా రెండు సరళ రేఖలు, మధ్యలో నల్ల గంధపు చెక్క పేస్ట్ ను ఉపయోగిస్తారు. నింబార్క వర్గం రాధ, కృష్ణుల కలయికను సూచిస్తూ రెండు నిలువు రేఖల మధ్య ఒక చిన్న వృత్తాకార చుక్కను ఉంచుతారు.
గోవింద నామంలా ధరించే తిలకం ఆజ్ఞ చక్రం బాగంలో అంటే నుదురు మధ్యలో పెట్టుకుంటారు. యోగా ప్రకారం ఈ ప్రదేశం ఒక ముఖ్యమైన శక్తి కేంద్రం. ఇక్కడ తిలకం ధరించడం వల్ల మానసిక ప్రశాంతత, సానుకూలత పెరుగుతుంది.
*రూపశ్రీ.