జ్యోతిర్లింగ క్షేత్రంతో సమానమైన అత్రేశ్వరుడి వృత్తాంతం తెలుసా?
జ్యోతిర్లింగ క్షేత్రంతో సమానమైన అత్రేశ్వరుడి వృత్తాంతం తెలుసా?
పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాల రూపంలో వెలిశాడు. అయితే ద్వాదశ జ్యోతిర్లింగలు పన్నెండు అని అందరికీ తెలిసిందే. ద్వాదధ జ్యోతిర్లింగం కాకపోయినా వాటితో సమానమైన మహిమ కలిగిన శైవ క్షేత్రం ఒకటి ఉంది. అక్కడ పరమేశ్వరుడు అత్రేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ దేవుడు వెలసిన విధానం గురించి ఓ వృత్తాంతం ఉంది. అది ఏమిటంటే….
భారతదేశానికి దక్షిణ భాగాన 'కామ్యకవనము' ఉంది. తపస్సు చేసుకోవటానికి చాలా అనువైన ప్రదేశమది. ఆ వనంలో అత్రి మహర్షి తన భార్య అయిన అనసూయాదేవితో కలిసి ఉండేవాడు. ఒకసారి దేశంలో కనీవినీ ఎరుగని కరువు ఒకటి వచ్చింది. పంటలు పండలేదు. తినటానికి తిండి లేదు సరికదా త్రాగటానికి గ్రుక్కెడు నీరు కూడా దొరకలేదు. చాలా భయంకరంగా అంది పరిస్థితి. అదంతా చూసింది అనసూయాదేవి. ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. వారు అలా అగచాట్లు పడుతుంటే ఆ తల్లి భరించలేకపోయింది. ఆ మహాతల్లి హృదయం ద్రవించింది. ఒకరోజు భర్తతో "నాథా! ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. దీనికి నివారణోపాయము ఏమైనా చెప్పవలసినది" అన్నది.
ప్రజల దీనస్థితికి అత్రి మహర్షికి కూడా జాలి వేసింది. ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. అనసూయాదేవి పార్థివలింగాన్ని తయారుచేసి, నియమనిష్టలతో అర్చిస్తున్నది. దేవతలంతా ఆమె దయాగుణాన్ని ప్రశంసించారు.
కొంతకాలం తరువాత మహర్షి సమాధిలో నుండి లేచి త్రాగటానికి మంచినీరు తెమ్మన్నాడు భార్యని. ఆమె కమండలం తీసుకుని బయలుదేరింది. ఎక్కడా నీరు లేదు. ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. అలా వెడుతుండగా త్రోవలో ఒక దివ్య స్త్రీ కనిపించి "పతివ్రతా శిరోమణి! నేను గంగాదేవిని. నిశ్చలమైన నీ భక్తికి మెచ్చాను. ఏ వరం కావాలో కోరుకో" అన్నది.
దానికి అనసూయా దేవి "తల్లీ! లోకంలో చుక్క నీరు కూడా ఎక్కడా దొరకటం లేదు. నా భర్త కడు దాహంతో ఉన్నాడు. ఈ కమండలం నింపు చాలు' అన్నది.
దానికి గంగ" అమ్మా! ఇక్కడ ఒక గొయ్యి తవ్వు, నేను అందులో ప్రవేశిస్తాను" అన్నది.
ఒక గొయ్యి త్రవ్వింది అనసూయ. ఇచ్చిన మాట ప్రకారం అందులో ప్రవేశించింది గంగ. అది పెద్ద జలాశయముగా మారింది. కమండలములో నీరు నింపుకుని తాను తిరిగి వచ్చేవరకు గంగను అక్కడే ఉండమని ఆశ్రమానికి వెళ్ళింది అనసూయాదేవి.
లోకంలో అంతటా క్షామం తాండవిస్తోంది. ఎక్కడా నీటి చుక్క కూడా దొరకటం లేదు. అటువంటి పరిస్థితిలో కొబ్బరినీళ్ళు లాంటి నీరు అనసూయా దేవి తీసుకురావటం చాలా ఆశ్చర్యం వేసింది. అత్రి మహర్షికి. నీరు ఎక్కడిది? అని అడిగాడు. జరిగిన విషయం చెప్పింది. భార్య ఋషి దంపతులు జలాశయం దగ్గరకు వెళ్ళి తనివితీరా స్నానం చేశారు. కడుపు నిండా నీరు త్రాగారు. అప్పుడు గంగాదేవి ఇంక సెలవు తీసుకుంటాను అన్నది. ఆ దంపతులు గంగను అక్కడే ఉండమన్నారు. అనసూయాదేవి ఒక సంవత్సరకాలం చేసిన తపస్సు తనకు ధారపోస్తే అలాగే ఉంటాను అన్నది గంగ.
మునిపత్ని అందుకు అంగీకరించింది. అప్పుడు గంగ "ఓ పతివ్రతా! పాపాత్ములు అనేకమంది స్నానాలు చేసి వారి పాపాలు నాకు అంటగడతారు. వారందరి పాపాలూ మూటకట్టుకున్న నేను నీలాంటి పతివ్రతా దర్శనము చేసుకున్నట్లైతే, ఆ పాపాల నుండి విముక్తి పొందుతాను. అందుచేత ఓ అనసూయా! ప్రతిరోజూ నీవు ఈ జలాశయానికి వచ్చి స్నానం చెయ్యి" అన్నది. సరేనన్నది సాధ్వీమతల్లి.
అప్పుడు పార్ధివ లింగము నుండి శివుడు ప్రత్యక్షమై అనసూయా దేవితో "నీ భక్తికి, సద్బుద్దికి మెచ్చాను. ఏ వరం కావాలో కోరుకో" అన్నాడు.
"స్వామీ! మా ఆశ్రమం దగ్గర 'అత్రేశ్వరుడు' అనే పేరుతో గంగా సమేతంగా వెలసి నీ భక్తులను రక్షించు' అన్నది అనసూయ. ఆమె కోరిక ప్రకారము శివుడు అత్రేశ్వరుడుగా వెలిశాడు. జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి కాకపోయినప్పటికీ, ఇది కూడా ఒక మహాక్షేత్రమయింది. ఇదీ అత్రేశ్వరుడి వృత్తాంతం.
◆నిశ్శబ్ద.