గడ్డిపోచ ముందు భంగపడ్డ దేవతలు...

 

గడ్డిపోచ ముందు భంగపడ్డ దేవతలు...

ఇంద్రాది దేవతలకు గర్వమెందుకువచ్చింది? గర్వం ఏ రకంగా భంగమైంది? తెలుసా ….

దేవదానవ సంగ్రామం అనాదిగా జరుగుతూనే ఉంది. ఆ యుద్ధంలో ముందుగా దేవతలు ఓడిపోతున్నారు. రాక్షసుల చేతిలో దేవసైన్యము నాశనమైపోతోంది. అందుకని రాక్షసుల సాయంతో క్షీరసాగర మధనం చేశారు దేవతలు. ఉచ్ఛైశ్వరము, ఐరావతము, కామధేనువు, కల్పవృక్షము చివరకు అమృతము పుట్టినాయి. శ్రీహరి మోహినీ రూపం ధరించి అమృతాన్ని దేవతలకు పంచాడు. ఈ రకంగా దేవతలు మరణాన్ని జయించారు.

ఒకసారి దేవదానవ సంగ్రామం జరిగింది. అందులో దేవతలే విజయం సాధించారు. ఈ విజయం తమ వల్లనే వచ్చింది అని దేవతలలో ప్రతి వారు చెప్పుకోసాగారు. వారికి అహంకారం ప్రబలిపోయింది. దేవతలకు గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు పరమేశ్వర స్వరూపుడయిన పరబ్రహ్మ. అనుకున్నదే తడవుగా ఒక పెద్ద భూతం దేవతల ముందు ప్రత్యక్షమయ్యింది. దేవతలు ఆ భూతాన్ని చూసి భయపడ్డారు. అది ఏమిటో అర్థం కాలేదు వారికి దేవదానవ యుద్ధంలో దానవులను తన అగ్నికీలలకు ఆహుతి చేశాను అని చెప్పిన అగ్నిదేవుని దగ్గరకు పోయి 'అగ్నిదేవా! ఆ భూతం ఏమిటో తెలుసుకుని రా!' అన్నారు. సరేనంటూ బయలుదేరాడు అగ్నిదేవుడు. ఆ భూతం దగ్గరకు వెళ్ళాడు అప్పుడు భూతం అడిగింది.

"నువ్వెవరు??" అని. 

"నేను అగ్ని దేవుడను. నన్ను జాతవేదుడు అంటారు"

"నీ శక్తి ఏమిటి?"

“ఎంతటి వస్తువునైనా తృటిలో భస్మం చెయ్యలను" అని అన్నాడు అగ్నిదేవుడు.

 "ఐతే ఈ గడ్డిపోచను భస్మం చెయ్యి" అంటూ ప్రక్కన ఉన్న గడ్డిపోచను అక్కడ పెట్టింది భూతం. 

అగ్నిదేవుడు నిప్పుల వాన కురిపించాడు. పెద్ద పెద్ద మంటలు రేపాడు. గడ్డి పోచ కసికందలేదు. చేసేదిలేక అవమాన భారంతో వెనుదిరిగాడు అగ్నిదేవుడు. 

ఈసారి దేవతలు వాయుదేవుడి వద్దకు వెళ్ళారు. దేవ దానవ యుద్ధంలో తమ గాలులు వీస్తుంటే దానవులు ఎగిరిపోయారు అని చెప్పాడు వాయువు. అందుచేత దేవతలు వాయువును సమీపించి "వాయుదేవా! నువ్వు ఆ భూతం ఏమిటో తెలుసుకుని రా!" అన్నారు.  బయలుదేరాడు వాయుదేవుడు. భూతాన్ని సమీపించాడు.

"నువ్వెవరివి!" అడిగింది భూతం,

"నేను వాయుదేవుడను. ఆకాశంలో సంచరిస్తుంటాను. నన్ను మాతరిక్యుడు అంటారు."

"సే శక్తి ఏమిటి?" అని అడిగింది.

"ఎంతటి వస్తువునైనా సరే తృటిలో ఎగరగొట్టి వేయగలను?"

"ఐతే ఈ గడ్డిపోచను ఎగరగొట్టు' అని ఇందాకటి గడ్డి పరకనే చూపింది భూతం.

 వాయుదేవుడు చండప్రచండమైన గాలులు వీచాడు. గడ్డిపోచ కదలలేదు. సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయాడు వాయువు..

దేవతలు ఇంద్రుని దగ్గరకు వెళ్ళారు. ఆ భూతం ఏమిటో కనుక్కోమన్నారు. ఇంద్రుడు.

భూతాన్ని సమీపించాడు.

"నువ్వెవరు!" అడిగింది భూతం.

"నేను ఇంద్రుడను దేవతలకు రాజును'

"నీ శక్తి ఏమిటి?"

"నిన్న జరిగిన యుద్ధంలో రాక్షస నాశనం చేశాను?"

"అలా అయితే ఈ గడ్డిపోచను కదుపు" అంటూ అక్కడ ఉన్న గడ్డిపరకను చూపించింది. 

ఉపమని ఊదాడు ఇంద్రుడు. గడ్డిపరక కదల్లేదు. గట్టిగా ఊదాడు. లాభం లేకపోయింది. తలెత్తి చూశాడు. అక్కడ భూతం లేదు. ఆ క్షణంలో అశరీరవాణి వినిపించింది.

"ఇంద్రాది దేవతలారా! ఇప్పటి వరకూ మీరు రాక్షసులను. మీ స్వశక్తితో జయించాము అనుకుంటున్నారు. అది అబద్దం. మీ విజయానికి కారణం పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మమే ఇప్పటిదాకా మీ ముందు నిలబడి ఉన్నది. దాన్ని మీరు గుర్తించలేకపోయారు. మీ గర్వం అణచటానికే పరబ్రహ్మ అలా చేశాడు. ఇకనైనా అహంకరించకుండా బుద్ధిగా మెలగండి'' అని పలికింది.

ఆ మాటలు విన్న దేవతలు తమ అజ్ఞానానికి సిగ్గుపడ్డారు. ఈ విధంగా దేవతలకు గర్వభంగం జరిగింది.

                                 ◆నిశ్శబ్ద.