భక్తి విషయంలో మనిషి ఎలా ఉండాలో తెలుసా!
భక్తి విషయంలో మనిషి ఎలా ఉండాలో తెలుసా!
మనిషికి భక్తి విషయంలో విభిన్న ఆలోచనలు ఉంటాయి. తను చేసే పనులలో ఎంతో భక్తి ఇమిడి ఉందని అనుకుంటాడు. భక్తి పేరుతో తన స్వార్థం వ్యక్తం చేస్తాడు. "భగవద్భక్తులు, సుజనులు, తగ వెరిగి పరోపకార తాత్పర్య వివేక గరిష్ఠులై చరింతురు..." అంటాడు భాగవతంలో విదురుడు. భక్తులైన వారు మంచివారై, పరోప కారులై, వివేకవంతులై ఉంటారని నిర్వచిస్తాడు. మనం నిర్మలత్వం, సేవ వినయం, వివేకం - ఇలాంటి ఉదాత్త గుణాలను పుణికిపుచ్చుకోవాలి. అప్పుడే మన భక్తికి సార్థకత! అలా కాకుండా కోరికల పుట్టల్లా మారి, కోవెలలంటే కేవలం కోర్కెలు తీర్చే కొంగు బంగారంలాగో, పాపాలను ప్రక్షాళన చేసుకునే పుష్కరిణులలాగో భావిస్తే మనల్ని మించిన అమాయకులు ఇంకెవరూ ఉండరు.
దైవదర్శనం మనలో ధార్మికతనూ, శీలసంపదనూ ఇనుమడింప జేయాలి. ఆలయానికి వెళ్ళిన ప్రతీసారి మన అంతరంగంలోని మాలిన్యం ఎంతో కొంత ప్రక్షాళన చేసుకోవాలి. మనల్ని, ఆ భగవంతుడితో పోల్చుకుంటూ, ఆయనను మనలో ప్రతిష్ఠింప జేసుకుంటూ ఆ దైవత్వాన్ని మనం ఆవాహన చేసుకోవాలి. అందుకే మహమ్మద్ ప్రవక్త ఖురాన్లో 'ప్రళయదినాన ఆ దేవుడి విశ్వాసి కర్మల త్రాసులో తూచే వస్తువుల్లో అత్యంత విలువైనది, బరువైనది అతని నైతిక ప్రవర్తనే' అంటాడు. ఇలా మనల్ని మనం పవిత్రీకరించుకోవాలనే అన్ని మతాలూ చెబుతున్నాయి.
ఆధునిక తరంలో సిద్ధాహారం (ఫాస్ట్ఫుడ్లా సిద్ధపుణ్యఫలం)కోరుకుంటున్నాం, మహిమల మైకంలో పడి పోతున్నాం. ఇవన్నీ బలహీనతనూ, పలాయనవాదాన్నీ (ఎస్కేపిజం) భక్తి మార్గంగా భ్రమింపజేస్తున్నాయి. దురదృష్టవశాత్తూ అక్షరాస్యులం అనుకుంటున్న మనం ఆధ్యాత్మికత అర్థాన్ని సంకుచితం చేస్తున్నాం. కృషి ఏమీ లేకుండానే కోరుకున్నవన్నీ భగవంతుడు తీర్చేయాలని ఆలయాలకు బారులు తీరుతున్నాం. ఆ భగవంతుడి తోనే లావాదేవీలు జరుపుతున్నాం! ఫలితంగానే నేడు సమాజంలో దేవుడి పేరుతోనే దాష్టీకాలు! ఆ భగవంతుడి కృపాకటాక్షాల కోసం కూడా అడ్డదారులు అన్వేషించడం అనుచితం.
మనం ప్రతిరోజూ పవిత్రంగా ఉండాలంటే, ఆ భగవంతుడి ఆశీస్సులు పొందాలంటే, ఇతరులకి ఇవ్వడానికే జీవించాలి. ఇతరుల జీవనస్థాయిని పెంచగలిగితే, మన జీవితం కూడా అత్యున్నతస్థాయికి ఎదుగుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే మనిషి తన జీవితానికి సార్థకతను పొందగలుగుతాడు.
*నిశ్శబ్ద.