భగవంతుడిని మెప్పించే సులువైన మార్గాలు!
భగవంతుడిని మెప్పించే సులువైన మార్గాలు!
రామకృష్ణ పరమహంస భారతీయ ఆధ్యాత్మిక గురువులలో ప్రముఖుడు. స్వామి వివేకానందకు గురువు ఈయనే.. ఈయనకు సాక్షాత్తూ ఆ కాళికాదేవి ప్రత్యక్ష దర్శనం ఇచ్చిందని చెబుతారు. స్వయంగా ఆయన చేతుల మీదుగా కాళికాదేవి నైవేద్యాలు స్వీకరించారని చెబుతారు. దీన్ని బట్టి రామకృష్ణ పరమహంస పట్ల కాళికాదేవి ఎంత ప్రసన్నం అయి ఉంటారో ఊహించుకోవచ్చు. అయితే రామకృష్ణ పరమహంస కాళికాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆచరించిన మార్గం ఏమిటనేది చాలామందికి తెలియదు. ఆయన మంత్ర తంత్ర శాస్త్రాలు ఏవీ ఆచరించలేదు.. నిజం చెప్పాలంటే ఆ అమ్మకోసం మంత్ర జపం కూడా చేయలేదని అంటారు. కానీ ఆయనకు ఆ అమ్మ అనుగ్రహం ఎలా కలిగింది అనే విషయం తెలుసుకుంటే..
ప్రేమ మార్గం..
రామకృశ్ణ పరమహంసను కాళికాదేవి అనుగ్రహానికి దగ్గర చేసిన మార్గం ప్రేమ మార్గం అని చెబుతారు. రామకృష్ణ పరమహంసకు కాళికాదేవి పట్ల ఎనలేని ప్రేమ ఉండేది. ఆయన కాళికాదేవిని అమ్మ అని భావించారు. నిరంతరం అమ్మ, అమ్మ అని కలవరిస్తూ ఉండేవారు. ఆ అమ్మ దర్శనం కోసం ఏడ్చేవారు. ఇలా ఆయన చిన్న పిల్లవాడైపోయి తల్లికోసం తల్లడిల్లినట్టు తల్లడిల్లాడు. ఆయన ప్రేమతో కూడిన భక్తికి కాళికాదేవి కరిగిపోయి ఆయనకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చిందని చెబుతారు.
దక్షిణేశ్వర్ ఆలయానికి నాగసాధువు చేరుకున్న సందర్భం..
తోతాపురి అనే నాగసాధువు దక్షిణేశ్వర్ ఆలయానికి వచ్చాడని చెబుతారు. రామకృష్ణుడి కళ్ళలో దాగి ఉన్న ఆందోళనను ఆయన వెంటనే గుర్తించాడట. రామకృష్ణ అతనితో, "నేను తల్లిని చూస్తున్నాను, కానీ నేను సమాధి స్థితిని పొందలేకపోతున్నాను" అని చెప్పాడట. తోతాపురి నవ్వుతూ, "నువ్వు తల్లి భౌతిక రూపంలో చిక్కుకున్నంత కాలం నిరాకార బ్రహ్మను అనుభవించలేవు" అని సమాధానం చెప్పాడట. సమాధిని సాధించాలంటే తన మనస్సులో ఉన్న కాళికాదేవి ప్రతిమ రూపాన్ని విడిచిపెట్టాలని రామకృష్ణుడికి సలహా ఇచ్చాడు. సున్నితమైన హృదయం కలిగిన రామకృష్ణుడు తన తల్లి కాళికా దేవి అనుమతి లేకుండా ఏమీ చేయనని చెప్పాడు. అతను తల్లి విగ్రహం ముందుకు వెళ్లి అదే ప్రశ్న అడిగినప్పుడు, కాళికా దేవి స్వరం వినిపించిందట. "అవును నాయనా..! తోతాపురి చెప్పినట్లు చేయి, ఆయన నిన్ను సత్యం వైపు నడిపిస్తాడు" అని కాళికాదేవి పలికిందట.
తోతాపురి మార్గం..
తోతాపురిజి రామకృష్ణుడిని ధ్యానం చేయమని సూచించాడు. కానీ అతను కళ్ళు మూసుకోగానే, కాళీమాత చిత్రం ఆయన కళ్లకు కనిపించేది. దీంతో ధ్యానం చేయడం మర్చిపోయి కాళికాదేవితో మాట్లాడుతూ ప్రేమతో కన్నీళ్లు పెట్టుకునేవాడు. దీంతో తోతాపురి రామకృష్ణతో "జ్ఞాన ఖడ్గంతో అమ్మవారి ప్రతిమను ముక్కలుగా నరికివేయి" అని ఆదేశించాడట. రామకృష్ణ ప్రయత్నించాడు, కానీ ప్రతిసారీ అతని జ్ఞాన ఖడ్గం తల్లి ప్రేమ ముందు ఓడిపోయింది. అతను తన గురువుతో, "తల్లి నా ముందు కనిపించినప్పుడు, నేను ప్రతిదీ మర్చిపోతాను. నేను ఆమెపై ఎలా దాడి చేయగలను?" అని అన్నాడు.
తోతాపురి దెబ్బ..
రామకృష్ణుడి మాటలు విన్నాక తోతాపురి ఒక ప్రత్యేకమైన పరిష్కారాన్ని ఏర్పాటు చేశాడట. "ఈసారి, నువ్వు ధ్యానంలోకి వెళ్లినప్పుడు నీకు అమ్మవారు కనిపించినప్పుడు, నేను నీ నుదుటిపై కొడతాను. ఆ నొప్పిని ఒక సంకేతంగా తీసుకుని కత్తి ఉపయోగించు" అని చెప్పాడట.
రామకృష్ణుడు తిరిగి ధ్యాన స్థితిలోకి వెళ్ళాడు. కాళీమాత ప్రతిమ కళ్లకు కనిపించిన వెంటనే, తోతాపురిజీ ఒక గాజు ముక్కతో రామకృష్ణుని నుదుటిపై లోతైన కోత పెట్టాడట. ఆ నొప్పి రామకృష్ణుడిని స్పృహలోకి తీసుకొచ్చింది. అతను వెంటనే స్పృహలోకి వచ్చి, మానసికంగా కాళికాదేవి రూపాన్ని రెండు భాగాలు చేశాడట.
విగ్రహం అలా రెండు భాగాలు కాగానే దాని రూపం కోల్పోయి అందులో నుండి ఒక నిరాకారమైన కాంతి వెలువడిందట. ఇలా జరిగిన తర్వాతే రామకృష్ణ పరమహంస సమాధి స్థితిలోకి వెళ్లాడట. ఆయన దాదాపు 3 రోజులు సమాధి స్థితిలోనే ఉన్నాడట. స్పృహ నుండి బయటకు వచ్చాక ఆయన కాళికాదేవి భక్తుడు మాత్రమే కాకుండా పరమహంస కూడా అయ్యాడట. దీని ద్వారానే.. దేవుడు విగ్రహాలలో లేడని, ఈ సృష్టిలో ప్రతి కణంలో వ్యాపించి ఉన్నాడని ఆయన అర్థం చేసుకున్నాడు.
ఇలా రామకృష్ణ పరమహంస.. కాళికాదేవిని ప్రేమ అనే మార్గంతో ప్రసన్నం చేసుకుని, సృష్టి అంతా ఆ కాళికాదేవి వ్యాపించి ఉంది అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు.
*రూపశ్రీ.