శివుడి వల్ల పుట్టి, శివుడి చేతిలో మరణించిన జలంధరుడు!

 

శివుడి వల్ల పుట్టి, శివుడి చేతిలో మరణించిన జలంధరుడు!

దక్ష యజ్ఞ సమయములో సతీదేవి యోగాగ్నిలో భస్మమైపోయింది. ఆ మాటలు విన్న ఈశ్వరుడు విరాగియై దేశాల వెంట తిరిగి తిరిగి చివరకు హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటున్నాడు. ఈలోపల వజ్రాంగుడికి తారకుడు జన్మించాడు. అతన్ని సంహరించటానికి పార్వతీ పరమేశ్వరుల వివాహం కావాలి. వారి కుమారుడు కుమారస్వామి చేతిలోనే తారకాసురుడు మరణిస్తాడు. పరమేశ్వరి పర్వతరాజు ఇంట పార్వతిగా జన్మించింది. ఆమె శివుని తప్ప ఇంకెవరినీ వివాహమాడను అని ఖచ్చితంగా చెప్పేసింది. శివుడు విరాగియై తపోదీక్షలో ఉన్నాడు. విరాగియైన శంకరుని మనస్సు మార్చేందుకు మన్మథుడు ప్రయత్నించాడు. శివుడికి ఆగ్రహం వచ్చింది. ఈశ్వరుని కోపాగ్నికి మన్మథుడు భస్మమైపోయాడు. మన్మథుణ్ణి భస్మం చేసిన తరువాత మిగిలిన శివుని నేత్రాగ్ని సముద్రంలో పడింది. అప్పుడు పెద్ద ధ్వని వినపడింది. ఆ శబ్దానికి లోకాలన్నీ గడగడలాడిపోయినాయి. భయకంపితులైన దేవతలు బ్రహ్మ దగ్గరకు పరుగెత్తారు.

బ్రహ్మదేవుడు దేవతలను వెంటపెట్టుకుని సముద్రుని వద్దకు వచ్చి, ''ఆ శబ్దమేమిటి?' అని అడిగాడు. అప్పుడు సముద్రుడు శివుని త్రేతాగ్ని సముద్రములో పడిన సంగతిని వివరించి "ఆ అగ్ని నుండి ఒక బాలుడు జన్మించాడు" అని బాలుడిని చూపించి అతడికి నామకరణం చేసి జాతకము చెప్పమని అడిగాడు. "వీడు జలాంతర్భాగాన నివసిస్తున్నాడు. కాబట్టి 'జలంధరుడు' వీడి నామధేయము. వీడు లోకకంటకుడౌతాడు. ఈశ్వరుని చేతిలోనే మరణిస్తాడు" అని చెప్పాడు బ్రహ్మ.

ఈశ్వరుని క్రోడాగ్ని జ్వాలల నుండి పుట్టిన వాడు కావటం చేత తమోగుణ ప్రధానుడైనాడు. రాక్షస కృత్యాలు చెయ్యటం వలన రాక్షసుడైనాడు. ఈ రకంగా జలంధరుడు అసురుడైనాడు. క్రమేణా పెరిగి పెద్దవాడైనాడు. గొప్ప తపో సంపన్నుడు, యుక్త వయస్సు రాగానే కాలనేమి కుమార్తె బృందనిచ్చి జలంధరుడికి వివాహం చేశారు.

ఒకనాడు జలంధరుడు కొలువు తీర్చి ఉండగా, రాక్షస గురువైన శుక్రాచార్యుడు. అక్కడికి వచ్చాడు. వచ్చిన ఆచార్యుని సగౌరవంగా ఆహ్వానించి విశేషాలు ఏమిటి? అని అడిగాడు దానవేంద్రుడు.

 " పూర్వకాలంలో దేవతలు, రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని మఠించారు. దానిలో నుండి ఉచ్చైశ్వరము పుట్టింది. దాన్నీ దేవతలు తీసుకున్నారు ఐరావతము పుట్టింది. దాన్నీ దేవతలే తీసుకున్నారు. కామధేనువు, కల్పవృక్షము పుట్టినాయి. వాటిని కూడా దేవతలే తీసుకున్నారు. చివరకు అమృతం పుట్టింది. దాన్ని కూడా దేవతలే ఆరగించారు. అమృతం తాగిన రాహును చంపేశారు. అలా ఆనాడు జరిగింది. హిరణ్యకశ్యప, హిరణ్యాక్ష్యులను, ఇంకెందరో దానవ శ్రేష్టులను సంహరించారు. పోనీ ఇప్పుడు చూడు. వైకుంఠాన్ని శ్రీహరి ఆక్రమించి ఉన్నాడు. కైలాసములో ఈశ్వరుడున్నాడు. దేవేంద్రుడు స్వర్గాన్ని పాలిస్తున్నాడు. ఈ రకంగా దేవతలు సర్వసౌఖ్యాలు అనుభవిస్తూ, మనలను అడవులలోకి నెట్టివేశారు. బలపరాక్రమాలు గలిగిన దానవేంద్రుడవు నువ్వు రాజుగా ఉండగా కూడా ఈ అన్యాయం ఇలా కొనసాగవలసినదేనా?" అన్నాడు శుక్రాచార్యుడు.

 జలంధరుని రక్తం వేడెక్కింది. వెంటనే మస్మరుడు అనే రాక్షసుణ్ణి పిలిచి ఇంద్రుని దగ్గరకు దూతగా వెళ్ళి రమ్మన్నాడు. 

"దేవేంద్రా! ఇంతకాలం నువ్వు స్వర్గసుఖాలు అనుభవించావు. ఇక స్వర్గాధిపత్యం దానవేంద్రుడైన జలంధరునకు ఇవ్వు, లేకపోతే "యుద్ధం తప్పదు" అన్నాడు మస్మరుడు.

ఇంద్రుడు పగలబడి నవ్వుతూ "ఇంతకు ముందు ఎంతమంది రాక్షసులు పుట్టలేదు? వారందరినీ విష్ణుమూర్తి సంహరించలేదా? ఇప్పుడూ అంతే. జలంధరుడికి చేతనైతే యుద్ధం చేసి స్వర్గాన్ని గెలుచుకోమను" అన్నాడు.

 ఇంద్రుని మాటలు విన్న జలంధరుడు కోపాద్రిక్తుడై ముందుగా వైకుంఠం మీదకి దండెత్తాడు. విష్ణువు పారిపోయి మానస సరోవరం చేరాడు. తరువాత స్వర్గం మీద దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించాడు జలంధరుడు. స్వర్గాధిపతి ఇంద్రుడు అరణ్యాలకు పారిపోయాడు.

దేవతల పక్షాన యుద్ధం చేసేవారు లేరు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు దేవతలకు, ఇంతలో నారద మహర్షి వారి దగ్గరకు వచ్చాడు. మహర్షితో తమ బాధలు మొరపెట్టుకున్నారు. దేవతలు. "నారద మునీంద్రా! జలంధరుని బాధలు పడలేకుండా ఉన్నాము. అతడితో యుద్ధం చేసేవాళ్ళు కూడా లేరు. ఏం చెయ్యాలో మాకు పాలుపోవటం లేదు. నువ్వే మాకు దారి చూపించు" అని వేడుకున్నారు. 

అప్పుడు నారదుడు దేవతలతో, "జలంధరుడు గొప్ప భక్తుడు. వేదవేదాంగవిధుడు. బ్రహ్మ వరప్రసాది ఈ కారణంచేత అతణ్ణి యుద్ధంలో గెలవటం చాలా కష్టం. పైగా అతడి భార్య బృంద పరమేశ్వరి భక్తురాలు. మీరంతా పరమేశ్వరుణ్ణి ఆరాధించండి. నాకు చేతనైంది నేను చేస్తాను". అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరాడు.

నారదుడు అలా లోక సంచారం చేస్తూ, జలంధరుని ఆస్థానానికి వచ్చాడు. నారద మహర్షిని ఉచితరీతిని గౌరవించి లోకాలలో విశేషాలు ఏమిటి? అన్నాడు. దానికి నారదుడు. "రాక్షసరాజా! నీ పాలనలో దేశం సుభిక్షంగా ఉన్నది. సకాలంలో ఎండలు కురుస్తున్నాయి.. వానలు పడుతున్నాయి. నువ్వు దేవతలను జయించావు. స్వర్గాన్ని ఆక్రమించావు. వైకుంఠము, కైలాసము కూడా కైవశం చేసుకున్నావు. కాని చిన్న లోపం కనిపిస్తున్నది" అన్నాడు.

 అంతవరకు తనని గురించిన పొగడ్తలు ఆనందంగా విన్న జలంధరుడూ, ఆ లోపం ఏమిటో తెలుసుకోవాలనే ఆతృతతో.. "ఏమిటి మునీంద్రా! ఏమిటా లోపం?" అన్నాడు. 

దానికి నారదుడు అది పెద్ద లోపమేమీ కాదు, అందాల రాశి, లోకోత్తర సౌందర్య అపరంజి బొమ్మ. ఆమె మాత్రం నీ దగ్గర లేకుండా వేరొకరి దగ్గర ఉన్నది' అన్నాడు. 

ఆ మాటలు వినగానే, ఆ స్త్రీ మీద వ్యామోహము ఒక ప్రక్క, ఆమెను స్వాధీనపరచుకోలేకపోయాననే అవమానం ఇంకొక ప్రక్క, పీడించసాగాయి. ఇంక ఉండబట్టలేక 'ఆ సౌందర్యరాశి ఎక్కడ ఉన్నది?' అని నారదుణ్ణి అడిగాడు. 

"దానవేంద్రా! ఆమె ప్రస్తుతము పరమేశ్వరుని భార్యగా ఉన్నది. అయినా పరమేశ్వరుని జయించి ఆమెను దశం చేసుకోవటం కష్టమైన పనేమో. పోనీలే" అంటూ కనిపించకుండా జలందరుణ్ణి రెచ్చకొట్టాడు నారదుడు.

 ఈ మాటలు రాక్షసేంద్రుని మీద బాగా పనిచేసినాయి. వెంటనే పరమేశ్వరునితో యుద్ధం ప్రకటించాడు. ఒక ప్రక్క యుద్ధం జరుగుతోంది. తాను శంకరుని వేషం ధరించి, కొంతమంది రాక్షసుల చేత మాయా గణపతి వేషం వేయించి పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి, శంకరుడు వచ్చాడని గణపతితో వర్తమానం పంపాడు. 'యుద్ధం జరుగుతుండగా శంకరుడు ఎలా వస్తాడు?' అని అనుమానం వచ్చిన పార్వతీదేవికి రాక్షసుల నిజస్వరూపం తెలిసింది. దాంతో వారు పారిపోయారు. అప్పుడు పార్వతీదేవి విష్ణుమూర్తికి వర్తమానం పంపి జలంధరుని భార్య బృంద, మహాపతివ్రత. ఆమె పాతివ్రత్యాన్ని గనుక పాడు చెయ్యకపోతే. జలంధరుడు మరణించడు. కాబట్టి నువ్వెళ్ళి ఆ పని చూడు అన్నది.

బృంద దీక్షలో ఉండి పరమేశ్వరుని ధ్యానిస్తోంది. విష్ణువు జలంధరుని రూపంలో వెళ్ళి ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగించాడు. పరమేశ్వరుడు పాశుపతంతో జలంధరుణ్ణి సంహరించాడు" ఇదీ జలంధరుడి వృత్తాంతం.

                                    ◆నిశ్శబ్ద.