శరభసాళువు వృత్తాంతం తెలుసా...
శరభసాళువు వృత్తాంతం తెలుసా...
శరభము అంటే ఎనిమిది కాళ్ళు గల జంతువు. ఏనుగు వంటిది. సింహము కన్న బలమైనవి అని అర్థం. అయితే దీని గురించి వివరణ తెలుసుకుంటే…
కృత యుగములో కశ్యప ప్రజాపతికి దితియందు హిరణ్యకశ్యప, హిరణ్యాక్షులనే కుమారులు కలిగారు. వీరు చాలా బలవంతులు. మహాతపశ్శక్తి సంపన్నులు, బ్రహ్మను గూర్చి అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశారు. హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టి సముద్రంలో పారేశాడు. శ్రీహరి వరహా అవతారమెత్తి భూమిని రక్షించాడు. హిరణ్యకశ్యపుని సంహరించాడు. ఆ విషయం తెలిసిన హిరణ్యాక్షుడు బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అందరూ దానవులు లాగానే చావు లేకుండా వరం కావాలి అన్నాడు హిరణ్యకశ్యపుడు.
'అది కుదరదు. పుట్టిన ప్రతి ప్రాణి మరణించి తీరాల్సిందే. ఇంకేదైనా వరమడుగు? అన్నాడు.
"అలా అయితే సరే, సృష్టికర్తా! నువ్వు సృష్టించిన దేనివలనా నాకు మృత్యువు రాకూడదు. పగలు గాని, రాత్రి గాని, ఇంట గాని, బయట గాని, భూమి పైగాని, ఆకాశం మీదగాని, దేవదానవుల వల్ల గాని, ఇతరుల వల్ల గాని, ఆయుధంతో కాగా, ఆయుధం లేకుండా గాని నాకు మరణం రాకూడదు" అన్నాడు. అలాగే అన్నాడు బ్రహ్మ.
వరబలముతో మహా గర్వించిపోయాడు హిరణ్యకశ్యపుడు. హిరణ్యకశ్యపుడు తపోవనానికి వెళ్ళేటప్పటికి, అతని భార్య లీలావతి గర్భవతి. ఆమెను చెరబట్టాడు దేవేంద్రుడు, మార్గమధ్యంలో నారదుడు అడ్డుపడి లీలావతిని విడిపించి, ఆమెను తన ఆశ్రమానికి తీసుకుపోయాడు. ఆమె గర్భంలో ఉన్న శిశువుకు 'అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. శ్రీమన్నారాయణుని లీలలను వినిపించాడు. ఈ రకంగా గర్భంలో ఉండగానే బాలునికి యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం కలిగింది. ఆత్మసాక్షాత్కారమైంది.
లీలావతి ప్రసవించింది. బాలుడికి ప్రహ్లాదుడు అని నామకరణం చేశారు. బాలుడు దినదినప్రవర్ధమానమవుతున్నాడు. ఛండామార్కుల వారి వద్దకు విద్యాభ్యాసం కోసం పంపారు. అక్కడ తోటి పిల్లలతో హరినామస్మరణ చేయించాడు ప్రహ్లాదుడు. వారందరికీ తత్త్వబోధ చేశాడు. ఆదిమధ్యాంత రహితుడు శ్రీమన్నారాయణుడు. సృష్టి స్థితి లయ కారకుడు శ్రీమన్నారాయణుడు. ఈ జగత్తంతా అతడే నిండి ఉన్నాడు. ఈ రకంగా వైష్ణవతత్త్వాన్ని బోధిస్తున్నాడు ప్రహ్లాదుడు.
"నాయనా! శ్రీహరి మన విరోధి. బ్రహ్మదేవుని ఆరాధించు. లేదా విష్ణుమూర్తిని ఆరాధించు అంతేకాని హరిని మాత్రం వద్దు" అన్నాడు తండ్రి. వినలేదు తనయుడు. తనయుని శిక్షించాడు తండ్రి. ఫలితం లేదు. విపరీతమైన శిక్షలు వేశాడు. ఏనుగులతో త్రొక్కించాడు. నిప్పులలో పడేయించాడు. సముద్రంలో నెట్టించాడు. కాని ప్రహ్లాదుడు మాత్రం విష్ణుభక్తి మానలేదు.
'చివరకు ఎక్కడ ఉన్నాడు మీ హరి' అన్నాడు. "తండ్రి ఒక చోట ఏమిటి తండ్రీ! భూమిలో, ఆకాశంపైన, నీటిలో, నిప్పులో అక్కడా ఇక్కడా అని ఏమిటి? ఎక్కడపడితే అక్కడే ఉన్నాడు" అన్నాడు తనయుడు.
కోపం తన్నుకు వచ్చింది రాక్షసరాజుకు "ఐతే ఈ స్తంభంలో చూపగలవా?" అని అక్కడ ఉన్న స్తంభాన్ని కాలితో తన్నాడు దానవేంద్రుడు. ఆ స్తంభం విరిగిపోయింది. అందులో నుంచి బయటకు వచ్చాడు నరసింహుడు, తల మాత్రం సింహం, మిగిలిన శరీరమంతా మనిషి.. హిరణ్యకశ్యపుని మీదికి దూకి, అతన్ని పట్టి వడిలో వేసుకుని గుమ్మం మీద కూర్చుని, వాడియైన గోళ్ళతో చీల్చి చంపివేశాడు. దానవేంద్రుడు కోరుకున్నట్లే అతనికి మరణం సంభవించింది...
హిరణ్యకశ్యపుని సంహరించిన తరువాత ఉగ్రంతో ఊగిపోయాడు ఉగ్రనరసింహుడు.. దేవతలంతా వచ్చి శాంతించమని వేడుకున్నారు. ప్రహ్లాదుడు ప్రార్ధించాడు. లాభం లేకపోయింది. లక్ష్మీదేవి దగ్గరకు రావటానికి భయపడిపోయింది.
ఇంక లాభం లేదనుకుని దేవతలంతా శంకరుని ప్రార్ధించారు. ఏ విధంగానైనా శ్రీహరిని శాంతింపచెయ్యమన్నారు. ఆలోచించాడు శంకరుడు. ప్రపంచంలో కొన్ని జంతువులకు జాతి వైరము ఉన్నది. అవి గుర్రము - దున్నపాతు, మేక-కోతి, పాము - గ్రద్ద, పిల్లి ఎలుక, జింక కుక్క కాకి గుడ్లగూబ కాబట్టి మనము సింహానికి జాతి వైరమున్న శరభము రూపం పొందుదాము అన్నాడు. అనుకున్నదే తడువుగా శరభానికి తొండము శంకరుడు, వీపు బ్రహ్మ, నేత్రములు సూర్యచంద్రులు, పార్వభాగము - వాయుదేవుడు. గోర్లు మేరు పర్వతాలు ఈ రకంగా శరభము గిర్రున తిరుగుతూ సృశింహునితో తలపడింది. ఈ రెండింటి మధ్యన పోరు ఘోరమైంది. ఎంతకీ ఎవరూ వెనుకకు తగ్గలేదు. ఒక్క క్షణం ఆలోచించాడు హరి. ఎదురుగా తనను శాంతింపమని ప్రార్ధిస్తున్న దేవతలు, ప్రహ్లాదుడు, భయకంపితయైన లక్ష్మీదేవి అర్థమైంది. తనను శాంతింపచేయటానికి శంకరుడు చేసిన పని ఇది. విషయం తెలుసుకుని శాంతించాడు శ్రీహరి. ప్రహ్లాదుని శోణితపురానికి రాజుగా చేసి ఎవరి స్థలాలకు వారు వెళ్ళిపోయారు.
ఇదీ పురాణాలలో ఉన్న శరభసాళువు కథ.
◆నిశ్శబ్ద.