వ్యక్తి ఉత్తమ నిదర్శనం ఎలా ఉండాలి?
వ్యక్తి ఉత్తమ నిదర్శనం ఎలా ఉండాలి?
భారతదేశంలో ప్రజలకు ముఖ్యంగా హిందువులకు ఆదర్శం శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీత. తండ్రి మాట కోసం రాజ్యాన్ని రాజభోగాలను, సర్వసుఖాలను తృణప్రాయంగా భావించి అరణ్య వాసానికి వెళ్ళినవాడు రాముడు. రాముడు రాజ్యం వదిలి వెళుతుంటే అన్న కోసం అన్నీ వదిలిపెట్టి ఆయన వెంట వెళ్ళినవాడు లక్ష్మణుడు. తన భర్త అడవులకు వెళ్లిపోతున్నాడని భర్త వెంట ఉండేందుకు తనకు అవసరం లేని విషయం అయినా, ఎన్నో సుఖాలను అన్నింటినీ వదిలివెళ్ళిన ధీశక్తి సీత.
అంటే, త్యాగంలో ఉన్న ఔన్నత్యం, మహోన్నత వ్యక్తిత్వం మన ఆదర్శం అన్నమాట. జన్మనిచ్చినవాడి గౌరవం కోసం స్వీయ సౌఖ్యాలను త్యజించటం ఉత్తమ వ్యక్తిత్వమా? లేక నా కెరీరు, నా పెళ్ళి, నా జీవితం అంటూ వెంపర్లాడటం వ్యక్తిత్వమా? తండ్రిని గౌరవించటం వల్ల రాముడి వ్యక్తిత్వం మరింత మహోన్నతంగా ఎదిగింది తప్ప కుంచించుకుపోలేషు కదా? కానీ ఆధునిక సమాజంలో పెద్దల మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటమే స్వీయ వ్యక్తిత్వానికి రాచబాట అన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎవరైనా తల్లిదండ్రుల మాట వినేవారు కనబడితే వారిని అదొక హేళన భావంతో చూడటం, ఎగతాళి చేయడం జరుగుతోంది. మనసుని అదుపులో పెట్టకుండా కళ్ళాలను వదిలేసి అది ఎటు లాక్కువెళ్తే అటు వెళ్ళటమే ఆధునికతకు పర్యాయపదంగా మారింది.
తండ్రి మాట మన్నించి అడవికి వెళ్లవద్దని రాముడిని అందరూ బతిమలాడుతారు. లక్ష్మణుడు అయితే ఆగ్రహం వ్యక్తపరుస్తాడు. దానికి సమాధానంగా రాముడు, "ఈ పద్ధతి నేను కొత్తగా అనుసరిస్తున్నది కాదు. వంశపార్య పరంగా మనకు అందుతున్న ఉత్తమ సంప్రదాయం ఇది. నేను ఆ బాటను అనుసరిస్తున్నాను అంతే" అంటాడు. తండ్రి ఆజ్ఞ పాటిస్తూ, గోహత్య చేశాడు కందమహర్షి. తండ్రి ఆజ్ఞ పాటిస్తూ, భూమిని తవ్వుతూ సగరుడి పుత్రులు ప్రాణాలు అర్పించారు. పరశురాముడు తండ్రి ఆజ్ఞప్రకారం తల్లి రేణుక తల నరికినా తండ్రి ఇచ్చిన వరం వల్ల తన తల్లిని తిరిగి బ్రతికించుకొన్నాడు. తప్పని తెలిసినా తండ్రి మాట పాటించటం అనే సంప్రదాయాన్ని నేను పాటిస్తున్నాను' అంటాడు. ఇంకా ఆవేశం తగ్గని లక్ష్మణుడిని శాంత పరుస్తూ, ఇలా అంటాడు:
యస్మిస్తు సర్వే స్సురసంనివిష్టా
ధర్మోయతః స్యాత్ తదుపక్రమేత!
ద్వేష్యో భవత్యర్థ పరో హి లోకే
కామాత్మతా ఖల్వా న ప్రశస్తో॥
మానవలక్ష్యం ప్రతిబింబించని వాటి వెంట పడకూడదు. ధర్మార్థ కామ మోక్షాలను సాధించే ధర్మమార్గాన్నే అనుసరించాలి. భౌతిక సుఖసాధనల వెంటపడేవాడు ద్వేష పాత్రుడౌతాడు. ఇంద్రియ లాలసత్వంలో మునిగితేలటం అభిలషణీయం కాదు.
అంటే సర్వసుఖాలనూ త్యజించటం వల్ల మనిషికి వచ్చే నష్టం లేదు. కానీ ధర్మాన్ని కాదని భౌతికసుఖాల వెంటపడటం, క్షణికానందాల మోజులో పడి సర్వం మరవటం వ్యక్తికీ, కాదు సమాజానికీ ప్రమాదకరం అన్నమాట. ఇదీ ఉత్తమ వ్యక్తిత్వానికి ఉత్తమ నిదర్శనం. అంటే, సమాజశ్రేయస్సు కోసం తన వ్యక్తిగతాన్ని త్రోసి రాజనలగాలి వ్యక్తి.
◆నిశ్శబ్ద.