సనాతన ధర్మంలోని 18 పురాణాలు ఏవి.. వాటి ప్రాముఖ్యత ఏమిటంటే..!
సనాతన ధర్మంలోని 18 పురాణాలు ఏవి.. వాటి ప్రాముఖ్యత ఏమిటంటే..!
సనాతన ధర్మంలో 18 మహాపురాణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పురాణ గ్రంథాలు ధార్మిక విశ్వాసాలను వివరిస్తాయని చెబుతారు. ఇది కాకుండా, విశ్వం ఆవిర్భావం, ఋషులు, సాధువుల కథలు, చరిత్ర, ప్రళయం గురించి కూడా పురాణాలలో ప్రస్తావించారు. జీవితం గురించి ఎంతో గొప్ప, కఠినమైన వాస్తవాలు, జీవన విదానం గురించి ఎన్నో విషయాలు, రహస్యాల గురించి ఈ పురాణాలలో పేర్కొన్నారు. ఇలాంటి ఈ పురాణాలు వేదాల తర్వాత రాయబడ్డాయని చెబుతారు. వీటిని అధ్యయనం చేస్తే మనిషి మీద చాలా లోతైన ప్రభావం ఉంటుందని చెబుతారు. దీనితో పాటు మనిషి జీవిత చక్రాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ఈ పురాణాల అధ్యయం ఎంతగానో సహాయపడుతుంది. భగవంతుడి గురించి, ఆయన రూపాల గురించి, ఆయనకు భక్తులతో కలిగి ఉన్న సంబంధాన్ని గురించి అందంగా వర్ణించడం వలన వీటిని భక్తి గ్రంథాలుగా కూడా పిలుస్తారు. అయితే ఈ 18 పురాణాల పేర్లు ఏమిటి? ఏ పురాణంలో ఏ విషయాలు ఉంటాయి? పూర్తీగా తెలుసుకుంటే..
18 మహాపురాణాల పేర్లు, ప్రాముఖ్యత..
బ్రహ్మ పురాణం..
సృష్టి ఆరంభం గురించిన వివరణ, తీర్థయాత్రల ప్రాముఖ్యత, భూమి గురించి వివరణ బ్రహ్మ పురాణంలో ఉంటుంది.
పద్మ పురాణం..
విష్ణుమూర్తి గురించి వర్ణన మొత్తం పద్మ పురాణంలో ఉంటుంది. అలాగే భక్తి, ధర్మం, పుణ్యక్షేత్రాల మహిమ గురించి ఇందులో ఉంటుంది.
విష్ణు పురాణం..
విష్ణుమూర్తి గురించి వర్ణణ పద్మ పురాణంలో ఉంటే.. విష్ణుమూర్తి అవతారాల గురించి విష్ణు పురాణం తెలుపుతుంది. అలాగే సృష్టి, స్ఠితి, లయ గురించి ఇందులో వివరణ ఉంటుంది.
శివ పురాణం..
శివుడి గురించి, శివుడి జననం, ఆయన లీలలు, శివుడి 12 జ్యోతిర్లింగాల గురించి, భక్తి మార్గం గురించి శివ పురాణంలో వర్ణించబడింది.
భాగవత పురాణం..
భాగవతం చాలా సమ్మోహనంగా ఉంటుంది. శ్రీకృష్ణుడి బాల్యం అంతా భాగవతంలో ఎంతో అందంగా, గొప్పగా వర్ణించబడి ఉంటుంది.
నారద పురాణం..
ఉపవాసాలు, భక్తి, సంగీతం, నారద మహర్షి ఉపదేశాల గురించి నారద పురాణంలో వివరించబడి ఉంటుంది.
మార్కండేయ పురాణం..
మార్కండేయ పురాణంలో దుర్గాదేవి మహిమ, దుర్గాదేవి లీలలు ప్రస్తావించబడింది.
అగ్ని పురాణం..
అగ్ని పురాణంలో యజ్ఞాలు, శాస్త్రాలు, ఆయుర్వేదం, ధనుర్వేదం మొదలైనవి ఉంటాయి.
భవిష్య పురాణం..
భవిష్యత్ అంచనాల గురించి భవిష్య పురాణం చెబుతుంది.
బ్రహ్మవైవర్త పురాణం..
ప్రకృతి గురించిన కథల సంకలనమే బ్రహ్మవైవర్తన పురాణం. ఇందులో కృష్ణుడు, రాధాదేవి మహిమ గురించి ఉంటుంది.
లింగ పురాణం..
శివలింగ పూజ, శివలింగ మహిమ, సృష్టి తత్వం గురించి లింగ పురాణం తెలుపుతుంది.
వరాహ పురాణం..
వరాహ అవతారం ద్వారా భూమికి లభించిన మోక్షం గురించిన పురాణ కథనం అంతా వరాహ పురాణంలో ఉంటుంది.
స్కంద పురాణం..
కార్తికేయుని కథ మొత్తం స్కంద పురాణంలో ఉంటుంది.
వామన పురాణం..
విష్ణుమూర్తి యొక్క వామన అవతారం గురించిన ప్రస్తావన వామన అవతారంలో ఉంటుంది.
కూర్మ పురాణం..
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించే పురాణం కూర్మ పురాణం. క్షీరసాగర మథనం ఇందులో ఉంటుంది.
మత్స్య పురాణం..
సృష్టి వినాశనం గురించిన కథలు మత్స్య పురాణంలో ఉన్నాయి.
గరుడ పురాణం..
మృత్యువు, మోక్షం గురించిన సమాచారం, మానవ జీవనం, మనిషి చేసే తప్పులు, తప్పులకు విధించే శిక్షలు, పితృదేవతలు, పితృ లోకం మొదలైనవన్నీ గరుణ పురాణంలో ఉంటాయి.
బ్రహ్మాండ పురాణం..
విశ్వ రహస్యాల గురించి, విశ్వ నిర్మాణం గురించి, లలిత సహస్రనామాల గురించి బ్రహ్మాండ పురాణంలో ఉంది.
*రూపశ్రీ.