షడ్రసోపేతమైన భోజనానికి ఘుమ ఘుమ లాడే తాంబూలం

 

 

షడ్రసోపేతమైన భోజనానికి  ఘుమ ఘుమ లాడే తాంబూలం

 



                            మృగమద సౌరభ విభవ
                            ద్విగుణిత ఘనసార సాంద్ర వీటి గంధ
                            స్థగితేతర పరిమళమై
                            మగువ పొలుపు దెలుపు నొక్క మారుత మొలసెన్.
       భారతీయుల జీవితంలో తాంబూలానికి ఎంతో ప్రాధాన్యం ఉంది.  ఒకప్పుడు తాంబూలం లేని భోజనం ఉండేది కాదు. సర్వ సామాన్యంగా ధనిక బీద భేదం లేకుండా అందరు తాంబూల సేవనం చేసేవారు. షడ్రసోపేతమైన భోజనానికి  ఘుమ ఘుమ లాడే తాంబూలం కొసమెరుపు. భోజనం మోతాదు కాస్త ఎక్కువైతే , పచ్చ కర్పూరం, యాలకులు, లవంగాలు, సోంపు ధట్టించిన తాంబూలం ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణని భోగంగా మలచి ఆయుర్వేదాన్ని నిత్యజీవితంలో భాగం చేశారు మన పెద్దలు. అది శాస్త్రం అంగీకరించిన కొద్ది పాటి మత్తు కలిగించే పదార్థం. ఆ మత్తు ఆహ్లాదం కలిగించటం వరకు మాత్రమే పరిమితం.
        దేవుడికి చేసే షోడశోపచార పూజలో తాంబూలం ఒక సేవ. ఆ సందర్భంలోనే తాంబూలంలో ఉండవలసిన పదార్థాలను పేర్కొనటం జరిగింది.
              “ పూగీఫల సకర్పూరై   ర్నాగవల్లీ దలైర్యుతమ్
               ముక్తా చూర్ణ సమయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతామ్.”
          తాంబూలంలో నాగవల్లి అంటే తమలపాకు,   కర్పూరంతో కూడిన వక్కలు, ముత్య భస్మంతో చేసిన సున్నం  ముఖ్యాంగాలు.  అటుపై ఎవరి శక్తి ననుసరించి వారు సుగంధ  ద్రవ్యాలను   చేర్చుకోవచ్చు. ముఖ్యంగా  యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, కస్తూరి, పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు, పుదీనా [పిప్పరమింట్ పువ్వు(మింట్)], కొబ్బరి తురుము , గుల్ఖన్, సోంప్ మొదలైనవి కూడా రుచి కోసం చేర్చుతుంటారు .  పూర్వం  కైరవళ్లు, కాచు, శొంఠిపొడి, మొదలైన వాటిని కూడా చేర్చేవారట. ఇంకా వెండి బంగారు రేకులను కూడా తాంబూలానికి చేర్చుతారు ధనవంతులు . మామూలు సున్నానికి మారుగా ముత్యభస్మమో, పగడ భస్మమో, వాడే అలవాటు ప్రాచీనులకి ఉండేది.

 

 

        అన్నిసమయాలలో అందరూ వేసుకొనేది ఒకే రకమైన తాంబూలం కాదు. ఉదయం భోజనం ముందు, భోజనం తరువాత,సాయం సమయం, రాత్రి నిదురించే ముందు,… ఇలా ఒకొక్కప్పుడు ఒక్కొక్క రకం. వీలుని బట్టి ఎన్ని సుగంధ ద్రవ్యాల నైనా చేర్చవచ్చు. ఈ రోజుల్లో పుగాకు కూడా చేర్చుతున్నారు. కానీ మౌలికంగా తాంబూలంలో ఉండేవి మాత్రం తమలపాకులు, వక్క, సున్నం. తమలపాకు తీగకి నాగవల్లి అనే పేరుంది. ఆకు పాము పడగలాగా ఉండటం వల్ల ఆ పేరు వచ్చి ఉండవచ్చు. స్వర్గం నుండి వచ్చిన తీగ అవటం వల్ల నాకవల్లి అనే పేరు సార్థకమై, కాలక్రమంలో  నాకవల్లి నాగవల్లి అయిందట! పాము విషాన్నిహరించగల శక్తి తమలపాకుకి ఉన్నదట.  ఇంకా ఎన్నో రకాలైన విషాలను కూడా హరించగల ఔషధీగుణాలు తమలపాకుకి ఉన్నాయట. తమలపాకు జీర్ణశక్తిని పెంచి, శరీర ఉష్ణోగ్రతని పెంచి, జలుబుని, శ్లేష్మాన్ని,వాతాన్ని హరిస్తుంది.  అందుకే చిన్న పిల్లలకి జలుబు చేస్తే  తమలపాకు రసం ఒకటి రెండు చుక్కలు పాలతో రంగరించి ఇస్తారు. సున్నం శరీరంలో కాల్షియం సరిగా ఉండేట్టు చూస్తుంది. ఎముకలు, దంతాలు అరిగిపోకుండా ఉంటాయి. అందుకే పాలిచ్చే తల్లులు, బాలెంతలు, తప్పనిసరిగా తాంబూలం  వేసుకోవాలంటారు. సున్నం నేరుగా తీసుకున్నదానికన్న తమలపాకు రసంతో  కలిపి తీసుకుంటే కాల్షియం వంటపడుతుంది.  వక్క ఈ రెండిటినీ అనుసంధానమ్ చేస్తుంది. అంతే! విడిగా తింటే మాత్రం రక్తహీనత కలిగిస్తుందంటారు. ఈ విషయంలో వండిన వక్క కన్నా పచ్చి వక్క నయం.
            నిత్యజీవితంలోనే కాదు ఆచార వ్యవహారాల్లో కూడా తాంబూలానికి ప్రముఖ స్థానముంది. తాంబూలం ఇవ్వటం గౌరవ చిహ్నం. ఇంటికివచ్చినవారికి, శుభకార్యాలకి ఆహూతులైన వారికి, తాంబూలమిచ్చి గౌరవించటం భారతీయ సంప్రదాయం. అందుకే వివాహాహ్వాన పత్రికలో ‘మదర్పిత చందన తాంబూలములు స్వీకరించి”  అని వ్రాస్తారు. పేరంటానికి వెడితే ఇచ్చేదానిని తాంబూలమనే అంటారు. అందులో పట్టు వస్త్రాలు,బంగారు నగలు ఉన్నా సరే! అది తాంబూలమే!
           ఎవరికైనా పెద్ద పని అప్పచెప్పినప్పుడు కూడా తాంబూలమిచ్చే సంప్రదాయం ఉండేది. రాజులు యుద్ధానికి వెడుతున్న సేనానాయకులకు తాంబూలమిచ్చి పంపేవారు. అది అత్యున్నత గౌరవానికి సంకేతం.  ఇరు పక్షాల మధ్య ఒప్పదం కుదిరితే తాంబూలాలు  మార్చుకునేవారు. రెండు రాజ్యాల మధ్య సంధి కుదిరినా, ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చినా, అమ్మకాలు కొనుగోళ్లకి బేరం కుదిరినా, పెళ్లి సంబంధాలు నిశ్చయమైనా  తాంబూలాలు మార్చుకోటం భారతీయ సంప్రదాయం. మిగిలిన సందర్భాలలో ఈ అలవాటు లుప్తమైనా  వివాహాల విషయంలో మిగిలి ఉంది. పెళ్లి సంబంధం కుదిరి  పరస్పరం అంగీకరించారనటానికి నిశ్చయ తాంబూలాలు తీసుకోటం అనే ఆచారం ఇంకా మిగిలే ఉంది. ఇలా  తాంబూలం అనేది ఎప్పటినుంచో మన జీవనవిధానం లో   మమేకమైయిన సంప్రదాయం అని చెప్పచ్చు.

 

 

 

 

..Dr Anantha Lakshmi