నమస్కారం భారతీయ సంస్కారం
నమస్కారం భారతీయ సంస్కారం
నమస్కారం భారతీయ సంస్కారం. ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు నమస్కరించటం భారతీయ సంప్రదాయం.
ఒకరినొకరు అభివాదం చేసుకునే పద్ధతి, పలకరించుకునే పద్ధతి ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. అవి వారి వారి సంస్కృతీసంప్రదయాల పైన నాగరికత పైన ఆధారపడి ఉంటాయి. కరచాలనం, ఒక చేయి నుడిటిపై అడ్డంగా చేర్చటం (salute), చేతి పైనో చెక్కిలిపైనో మృదువుగా ముద్దులు పెట్టటం, ప్రేమతో ఆలింగనం చేసుకోవటం , వంగి సలాము చేయటం, ..... ఇలా ఎన్నో పద్ధతులు. అయితే ఈ పలకరింపులో కూడా భారతీయులది ఒక ప్రత్యేక శైలి. మన పలకరింపు శాస్త్రీయత తో మేళవించిన సంప్రదాయం.
పెద్దలని చూడగానే చిన్నవారు (వయసులో, అధికారంలో, జ్ఞానంలో, ధనంలో, ఎందులోనైనా సరే) చేతులు జోడించి నమస్కరించటం భారతీయులందరు చేసే పని. నమ అంటే వంగి ఉండటం అని అర్థం. అంటే పెద్దల ఎదుట అహంకరించకుండా అణిగి మణిగి ఉండటం. నాది అనేది లేనిది అనే అర్థం కూడా చెపుతారు ‘నమ’ అనే పదానికి. అంటే ఎదుటి వారికి తనను తాను సమర్పించుకోవటమన్నమాట.
ఎందుకు నమస్కరించాలి? నోటితో ‘హాయ్’ అనో ‘హలో’ అనో అంటే సరిపోతుంది కదా! అనే సందేహం కలగవచ్చు. దానికి సమాధానం తెలుసుకోవాలి. మానవ శరీరం ఒక విద్యుదయస్కాంత ఘటం . ధన, ఋణ ధృవాలు కలిస్తే విద్యుత్ ప్రవాహ మార్గం (సర్క్యూట్) పూర్తి అవుతుంది. మనిషి శరీరంలో అటువంటి ధృవాలు చేతి వ్రేళ్ళు. వాటిని కలపటం వల్ల సర్క్యూట్ పూర్తి అవుతుంది. విద్యుదయస్కాంత ఘటంలో విద్యుత్ చలనం మొదలవుతుంది. రెండు ఘటాలు దగ్గరైనప్పుడు ఒకదాని ప్రభావం మరొక దానిమీద ఉంటుంది. ఎక్కువ శక్తివంతమైన ఘటం సమక్షంలో తక్కువ శక్తివంతమైన ఘటంలో ప్రకంపనలు కలుగుతాయి. అవి సరిగా మేలు కలిగించే విధంగా ఉండటానికి చేసిన ఏర్పాటు ఈ నమస్కారం.
నమస్కరించటంలో కూడా ఎదుటివారిని బట్టి పద్ధతి మారుతుంది. దేవతలకు రెండు చేతులు సహస్రారంపై జోడించాలి. పెద్దలకు నుదుటిపై అంజలి ఘటించాలి. సాటి వారికి అభివాదం చేయటానికి రెండు చేతులను హృదయ స్థానంలో జోడించాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం, ఆ స్థాయిలో గౌరవించ దగిన వారింకెవరైనా వారికి సాష్టాంగ నమస్కారం చేయటం మన అలవాటు. దీనినే దండప్రణామమ్ అని కూడా అంటారు. అంటే, కర్ర లాగా నేలమీద పడి ,ఎనిమిది అవయవాలు భూమిని తగిలేట్టుగా నమస్కరించటం. స్త్రీలు పంచాంగాలతో చేస్తే సరి పోతుంది . స్త్రీల ఉదరం, వక్షస్థలం మనిషి అస్తిత్వానికి, పోషణకి నిలయాలు కనుక అవి నేలకు తగులరాదు. దీనికే ప్రణిపాతం అని పేరు . అత్యుత్కృష్ట గౌరవాన్ని ప్రదర్శించటానికిది సంకేతం. నిజానికి ఇలా చేయటం వల్ల నమస్కరించిన వ్యక్తికి ఎదుటివారి నుండి శక్తి ప్రసారం జరుగుతుంది. అందుకే ఎప్పుడూ తమకన్న ఏదో విధంగా అధికులైతేనే నమస్కరించాలి. తక్కువస్థాయిలో ఉన్న వారికి ఎక్కువ స్థాయిలో ఉన్నవారు నమస్కరిస్తే ఆయు క్షీణమనిపెద్దలు చెపుతారు.తక్కువ శక్తి ఉన్నది ఎక్కువ శక్తి ఉన్నదానికి ఇవ్వటం వల్ల అల్లకల్లోలమే కదా!
నమస్కరించటాన్ని మొక్కటం, ప్రణామం చేయటం, దండం లేక దన్ణమ్ పెట్టటం అని కూడా అంటారు. కాళ్ల మీద పడి పోవటాన్ని ప్రణిపాతం చేయటం అంటారు. ఇది పరిపూర్ణ శరణాగతిని తెలియజేస్తుంది .
భారతీయులు అభివాదం చేసే పద్ధతి చాలా శాస్త్రీయమైనదని శ్రేయోదాయకమని అందరు అంగీకరించిన విషయం. కాబట్టి ఇక నుంచి మన పలకరింపు మన సంప్రదాయానికి అనుగుణంగా ఉండేలా చూడండి. ఆ సంప్రదాయం ముందు తరాలకి కూడా చేరేలా చూడండి.
...Dr Anantha Lakshmi