భక్తియోగం అంటే ఏమిటి
భక్తియోగం అంటే ఏమిటి
భక్తిమార్గం లేదా భక్తియోగం అంటే ఏమిటి అనే ప్రశ్నకు స్వామి వివేకానంద చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. స్వామి వివేకానంద చెప్పినదాని ప్రకారం... భక్తియోగంఅంటే...
పరాత్పరునితో ఐక్యమైపోవడానికి అనుసరించదగిన శాస్త్రీయమైన, పవిత్రమైన విధానమే భక్తియోగం. మనకు మతానుభూతి లేదా సాక్షాత్కారం కలిగించే సులభతరమైన, నిశ్చితమైన మార్గం భక్తియోగం.
ఈ భక్తిమార్గ (భక్తియోగ) సాధనలో నిర్దిష్టంగా, పరిపూర్ణంగా వుండాల్సినది ఒక్కటే... అదే భగవంతుడి మీద ప్రేమ. భగవంతుడిని ప్రేమించే మార్గంలో ఐదు దశలు వుంటాయి... అవి...
మొదటిది: మానవుడికి మానసికంగా ఆలంబన కావాలి. అతనికి పాపభీతి వుంటుంది. ఈ రెండు అంశాల్లో అతనికి అండగా నిలిచేది భక్తి.
రెండవది: భక్తుడు దేవుడిని తన తండ్రిగా భావించాలి.
మూడవది: భక్తుడు దేవుడిని తండ్రిగా భావించడంతోపాటు స్త్రీలందరినీ జగన్మాత ప్రతిబింబాలుగా చూడాలి. అప్పుడు భగవంతుడి మీద, సమాజంలోని మనుషుల మీద నిజమైన ప్రేమ ప్రారంభమవుతుంది.
నాల్గవది: భగవంతుడిని ప్రయోజనాలను ఆశించి కాకుండా ప్రేమానుభవ కాంక్షతోనే ప్రేమించాలి. ప్రేమానుభవమే ప్రేమకు గమ్యమైనప్పుడు ఆ ప్రేమలో గుణదోషాలు వుండవు.
ఐదవది: భగవంతుడు గుణాతీతుడు. అలాంటి భగవంతుడిని ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా ప్రేమిస్తూ వుంటే భక్తుడు కూడా గుణాతీతుడు అవుతాడు. అప్పుడు భగవంతుడికి, భక్తుడికి అభేదము ఏర్పడుతుంది.
భక్తిమార్గంలో విజయవంతంగా ప్రయాణం చేయాలంటే ప్రార్థన, స్తోత్రాలను అనుసరించాలి. భగవన్నామ జపానికి అద్భుతమైన శక్తి వుంటుంది. ఆచరణ ద్వారానే ఆశక్తి ఏమిటో భక్తుడికి అవగతం అవుతుంది.
‘మంత్రం’ అనేది శిష్యుడు మననం చేసుకోవడానికి, అతను భక్తిమార్గంలో ముందుకు వెళ్ళడానికి గురువు అందించే ఒక ప్రత్యేకమైన శబ్దం. అది ఒక పవిత్రమైన వాక్యం. సాధారణంగా అది ఒక భగవన్నామం అవుతుంది. ప్రార్థన, స్తోత్రాల ద్వారా భక్తుడు ఒక దేవతా స్వరూపమందు ఏకాగ్రచిత్తుడు అవుతాడు. అ స్వరూపమే ఇష్టదేవతా స్వరూపం.
మంత్రాన్ని కేవలం పదాల ధ్వనిగానే భావించకూడదు. మంత్రాలు సాక్షాత్తూ దైవ స్వరూపాలు. అవి మనలోనే ఉన్నాయని భావించాలి. యద్భావం తద్భవతి అన్నట్టుగా మనం మనల్ని ఎలా భావిస్తూ వుంటామో అలాగే రూపొందుతాం. మనల్ని మనం భగవత్ స్వరూపులుగా భావిస్తూ, ధ్యానిస్తూ వుంటే మనలో భగవంతుడి లక్షణాలు పెరుగుతూ వుంటాయి.
ప్రార్థన, స్తోత్రం తర్వాత జరగాల్సింది ఉపాసన. ఆ తర్వాత భక్తుడికి తన ఇష్టదేవత నామం మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. తన ఇష్టదేవతకు ఇష్టమైన అంశాల మీద కూడా ఆసక్తి కలుగుతుంది. తన ఇష్టదైవాన్ని తన తండ్రిగా భావించడం బలపడుతుంది. ఆ తండ్రిని భక్తుడు తనకు ప్రాపంచిక బంధాల నుంచి విముక్తుడిని చేయాలని భక్తుడు ప్రార్థించాలి. ఒక తండ్రి తన కుమారుడి చేతిని పట్టుకుని ఎలా తన వెంట తీసుకుని వెళ్తాడో అలాగే నన్నూ తీసుకెళ్ళు ప్రభూ అని భగవంతుడిని భక్తుడు వేడుకోవాలి.
‘‘నేను ఐశ్వర్యాన్ని గానీ, సౌందర్యాన్ని గానీ కాంక్షించను. ఈ లోకాన్నిగానీ, మరోలోకాన్ని గాన్ని కోరుకోను. నాకు కావలసింది నువ్వే. ప్రభూ.. ఈశ్వరా... నేను అలసిపోయాను. నా చేయి పట్టుకుని నడిపించు. భగవంతుడా.. నేను నీయందే విశ్రమిస్తాను. నన్ను నీ సేవకుడిగా స్వీకరించు. నీవే నా తండ్రివి. నీవే నా ప్రియ మిత్రుడివి. విశ్వభారాన్ని మోస్తున్న నీవు నా చిన్న జీవిత భారాన్ని మోయడంలో నాకు సహకరించు. నన్ను విడిచిపెట్టి వెళ్ళకు. నీకు నేను ఎప్పటికీ దూరం కాకూడదు. నేను సర్వదా నీలోనే నివసించాలి’’ అని భగవంతుడిని ఆర్తితో ప్రార్థించాలి. ఇలా భగవంతుడి మీద ప్రేమే సర్వమూ అయినప్పుడు ప్రాపంచిక విషయాలన్నీ చాలా చిన్నవిగా తోస్తాయి. అలా భక్తిమార్గంలో పయనించడం ద్వారా భక్తుడు అసత్యం నుంచి సత్యంలోకి, అధకారంలోనుంచి అంతం లేని వెలుగులోకి ప్రవేశిస్తాడు.
- అంతర్యామి