ప్రాణాయామము ఎలా చెయ్యాలి
ప్రాణాయామము ఎలా చెయ్యాలి?
ప్రాణాయామము అనగా...ప్రాణశక్తిని నియమించుట అని అర్థం. ప్రాణాయామము చేయుటవలన ప్రాణశక్తి వికాసమునొంది, దేహము ఆరోగ్యవంతముగా, తేజోవంతముగా ప్రకాశించును. ప్రాణశక్తి వికాసము నొందని దేహము దోగములకు నిలయమై అకాలమృత్యువుకు గురియగును. మన శ్వాసకు, జీవశక్తికి ‘ప్రాణము’ అని పేరు. ప్రాణము, మనస్సు, వీర్యము వేరు వేరు పదార్థములు కావని.., ఈ మూడు పదార్థములు ఒకటేనని ఆధ్యాత్మిక శాస్త్రములు పేర్కొనుచున్నవి. ఈ మూడింటిలో ఒకటి వశమైతే... తక్కిన రెండు వాటంతట అవే వశమైపోతాయి. ఈ మూడింటికి ఉన్న అవినాభావ సంబంధము అటువంటిది. ప్రాణశక్తిని(శ్వాసను) వశపరచుకున్నవానికి మనసు వశమై..వీర్యము స్థిరమౌతుంది. మనసు వశమైన వానికి ఆధ్యాత్మిక ఙ్ఞానము పెంపొంది భగవంతుని సాన్నిధ్యము (మోక్షము) లభిస్తుంది. వీర్యము స్థిరమైన వానికి లౌకికంగా, పారలౌకికంగా ఎంతో లాభం కలుగుతుంది.
యథా పర్వతధతూనాం దోషాన్ హరతి పావకః
ఏవమంతర్గతం పాపం ప్రాణాయామేవ దహ్యతే
పర్వతములయందలి ధతువుల మలము ఎలా అగ్నితో దహించబడతాయో, అలాగే మానవుని ఆంతరిక పాపములు ప్రాణాయామము వలన దహించబడతాయని ప్రయోగపారిజాత గ్రంథం చెప్తుంది. అంతేకాదు.,ప్రతినిత్యము ప్రాణాయామము చేయువారు అగ్నివలె తేజస్సుతో ప్రకాశిస్తారని కూడా పేర్కొంది. ప్రాణాయామము సిద్ధించుకున్న వ్యక్తి వందలాది సంవత్సరములు ఆయురారోగ్యములతో హాయిగా జీవించునని శాస్త్రప్రమాణము.
ఆధునిక వైఙ్ఞానిక, వైద్య శాస్త్రాలు కూడా ‘ప్రాణాయామము’ యొక్క ప్రయోజనాన్ని ధృవీకరించాయి. మన ఊపిరితిత్తులలో కొన్ని కోట్లకొలది సూక్ష్మరంధ్రములు ఉంటాయి. వాటిద్వారా శరీరమంతటికి రక్తప్రసారము జరుగుతుంది. మనము తీసుకునే శ్వాస ఊపిరితిత్తులలో ప్రవేశించి వాటికివున్న సూక్ష్మరంధ్రముల ద్వారా శరీరమంతా ప్రయాణించి ప్రాణశక్తిని పెంచుతుంది. ఇది దేహక్రియ. ప్రాణాయామము చేయుటవలన మనము తీసుకునే శ్వాస ఎంతో వేగవంతంగా ఊపిరితిత్తులలో ప్రవేశించి తద్వారా వాటికి ఉన్న సూక్ష్మరంధ్రములలో నిలిచివున్న మలిన పదార్థాలను తొలగించుకుంటూ శరీరమంతా వేగంగా ప్రయాణిస్తుంది. అప్పుడు రక్తము మరింత శుభ్రపడి గుండెద్వారా శరీరమంతటికి ప్రవహించి దేహ ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరించి స్ధిరపరుస్తుంది. కనుక మనస్సు, శరీరము ఆరోగ్యంగా, తేజోవంతంగా ఉండాలని కోరుకునేవారు తప్పనిసరిగా ‘ప్రాణాయామము’ చెయ్యాలి.
ప్రాణాయామము ఎలా చెయ్యాలి?
ప్రాణాయామము చేయువారు ముందుగా చక్కని గాలి, వెలుతురు ఉన్న ప్రదేశమును ఎంచుకుని, మెత్తటి ఆసనమును వేసుకుని., వెన్ను,కంఠము, శిరస్సు మూడింటిని నిటారుగా నిలిపి కూర్చోవాలి. తర్వాత కన్నులు మూసుకుని కుడిచేతి బొటనవ్రేలితో కుడిముక్కు రంధ్రమును మూసి, ఎడమముక్కు రంధ్రముద్వారా నెమ్మదిగా శ్వాస పీల్చాలి. దీనిని ‘పూరకము’ అంటారు. ఈ స్ధితిలో మీ ఇష్టదైవ మంత్రాన్ని ఒక పర్యాయము ధ్యానించాలి.ప్రారంభస్ధాయిలో ఒక పర్యాయము కన్న ధ్యానించలేరు. అభ్యాసము కుదిరిన పిమ్మట నెమ్మది నెమ్మదిగా మీ ఇష్టదైవ మంత్రాన్ని మూడు పర్యాయములు ధ్యానించే వరకూ సమయాన్ని పెంచాలి. ఇప్పుడు మీ ఉంగరంవ్రేలుతో ఎడమముక్కు రంధ్రమును మూసి, శ్వాసను బంధించాలి. దీనిని ‘కుంభకము’ అంటారు. ఈ స్థితిలో మూడు పర్యాయములు మీ ఇష్టదైవ మంత్రాన్ని ధ్యానించాలి.
అనంతరము మీ కుడిముక్కు రంధ్రమును మూసి ఉంచిన బొటనవ్రేలును తొలగించిబంధించి ఉంచినశ్వాసను నెమ్మదిగా వదులుతూ ఒక పర్యామము మీ ఇష్టదైవ మంత్రాన్ని ధ్యానించాలి. దీనిని ‘రేచకము’ అంటారు. ఈ ‘పూరక - కుంభక-రేచక’ మూడుకర్మలను ఒకసారి చేయుటను ‘ప్రాణాయామము’ అంటారు.ఈ ప్రాణాయామ ప్రక్రియలో సాధన పెరుగుతున్న కొద్ధీ...మీ ఇష్టదైవాన్ని ధ్యానించే కాలప్రమాణము పెరుగుతుంది. కాలప్రమాణము ఎంత పెరిగితే అంత పరిణతిని సాధించినట్టు. మంత్రయుక్తముగా ‘పూరకము’ చేయునప్పుడు నాభిదేశమునందు దృష్టిని నిలిపి ‘శ్రీమహావిష్ణువును’ ధ్యానించాలని..,‘కుంభక’ సమయంలో హృదయము నందు దృష్టి నిలిపి బ్రహ్మదేవుని ధ్యానించాలని.., ‘రేచక’ సమయంలో లలాటభాగము నందు దృష్టిని నిలిపి త్రినేత్రుడైన పరమశివుని ధ్యానించాలి అని శాస్త్రప్రమాణము.
-యం.వి.యస్.సుబ్రహ్మణ్యం