సమస్యలు పరిష్కారం కావాలంటే శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటలు అర్థం చేసుకోండి..!
సమస్యలు పరిష్కారం కావాలంటే శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటలు అర్థం చేసుకోండి..!
ప్రతి వ్యక్తి జీవితంలో హెచ్చు తగ్గులు ఉండటం సాధారణం. కొంతమంది ఇలాంటి పరిస్థితులను ధైర్యంతోనూ, తెలివితోనూ ఎదుర్కుంటారు. మరికొందరు మాత్రం వీటిని ఎదుర్కోలేక పరిస్థితులను వదిలేస్తారు, లేదా పరిస్థితులకు దూరంగా పారిపోతారు. ఇబ్బందులను ఎదుర్కొనే వారు జీవితంలో ఎప్పుడూ ముందుకు సాగుతారు. కానీ వదులుకునే వ్యక్తులు ఎప్పుడూ వెనుకబడి ఉంటారు. మనిషి మనస్సు నుండి భయం, సోమరితనం వల్లే పరిస్థితులను ఎదుర్కోవడానికి బదులు వాటి నుండి పారిపోవాలనే ఆలోచన వస్తుంది. అయితే ఈ భయం, సోమరితనాన్ని తొలగించడానికి శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని విషయాలు, కృష్ణుడి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చాలా సహాయపడతాయి.
కష్టకాలంలో మనిషి బండరాయిలా బలపడి దాన్ని పరిష్కరించుకోవాలి. ఇలా చేయలేక కొందరు మనసులో చాలా మదన పడుతూ ఉంటారు. అలాంటి వారు మనస్సు ప్రశాంతంగా ఉండటానికి ప్రతిరోజూ భగవద్గీత చదవడం చాలా ముఖ్యం.
శ్రీకృష్ణుడు చాలా అల్లరి వాడు. అయినప్పటికీ ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు. మామ కంసుడు తనను చంపాలనుకుంటున్నాడని శ్రీకృష్ణుడికి తెలుసు, అయినప్పటికీ కృష్ణుడు ప్రశాంతంగానే ఉన్నాడు. కంసుడు తనను చంపడానికి చేసిన ప్రతి ప్రయత్నాన్ని, తనను ప్రతి దాడిని, ప్రతి మాటను ఓర్పుగా తట్టుకున్నాడు. కనుకనే కృష్ణుడు తనకు సమయం వచ్చినప్పుడు కంసుడిని హతమార్చగలిగాడు. అదే విధంగా పరిస్థితి ఎలా ఉన్నా ప్రశాంతంగా ఉంటే సమయం కూడా ఏదో ఒకప్పుడు అనుకూలంగా రాక మానదు. అప్పుడు సమస్యలకు పరిష్కారం కూడా తప్పకుండా వస్తుంది.
జీవితం సరళంగా ఉంటుంది. కృష్ణుడి జీవితాన్ని గమనిస్తే ఆయన జీవించడాన్ని ఎంతగానో ఆనందిస్తాడు. అలాంటి జీవితం వ్యక్తి యొక్క స్వావలంబనను పెంచుతుంది. శ్రీకృష్ణుడు చాలా సాదాసీదాగా జీవించాడని అందరికీ తెలుసు. గోగులంలో పెరిగినా, తరువాత రాజకుటుంబంలో పెరిగినా, సాధారణ పిల్లలతో స్నేహంగా ఉండటం మాత్రం మరువలేదు. అలాగే ప్రతి వ్యక్తి సాదాసీదా జీవితాన్ని గడపాలి. ఒక వ్యక్తి ఎంత ఉన్నత పదవిలో ఉన్నా, ఎంత డబ్బు కలిగి ఉన్నా, ఎప్పుడూ గర్వపడకూడదు.
ఎలాంటి పరిస్థితి వచ్చినా భయపడకూడదని శ్రీ కృష్ణుడు చెప్పాడు. కోపం, భయం పెరిగినప్పుడే చాలామంది సమస్యలలో పడిపోతారు. సరైన నిర్ణయం తీసుకోవడానికి బదులుగా, తప్పు మార్గాన్ని ఎంచుకుంటారు. అందుకే ఫలితం ఎలా ఉన్నా భయపడకుండా ప్రయత్నించడం ముఖ్యం.
స్నేహం గురించి మాట్లాడినప్పుడల్లా, కృష్ణుడు, సుధాముడు గురించే మాట్లాడుతారు. వారి స్నేహం గురించి తెలుసుకుంటే జీవితంలోని ప్రతి మలుపులో ఎల్లప్పుడూ నిజమైన స్నేహితుడు తప్పక తోడుగా నిలుస్తాడు అనే విషయం అర్థం అవుతుంది.
ఒక వ్యక్తి ఎప్పుడూ మంచి పనులు చేయాలి. లాభాన్ని చూసుకుని చేసే పనులు ఎప్పటికీ తృప్తిని ఇవ్వవు. మంచి చేస్తూ ఉంటే దానివల్ల తప్పకుండా తిరిగి మేలు పొందే సందర్భం ఏదో ఒకరోజు వస్తుంది. అంతేకాదు.. దానం చేయడం కూడా చాలా గొప్ప గుణం. జీవితంలో గొప్ప కార్యం దానమని శ్రీ కృష్ణుడు చెప్పాడు. ప్రతి ఒక్కరూ అవసరమైన వారికి దానం చేయాలి ఇది ఏదో ఒక రూపంల తిరిగి మంచిని చేస్తుంది.
*రూపశ్రీ.