ఉంగరాన్ని చూసిన సీతమ్మ ఏమని చెప్పింది?
ఉంగరాన్ని చూసిన సీతమ్మ ఏమని చెప్పింది?
రాముడి గుణాల గురించి, రాముడి రూపం గురించి ఎంతో గొప్పగా చెప్పి రాముడు సీతమ్మను ఇవ్వమన్న ఉంగరాన్ని హనుమంతుడు సీతమ్మను ఇచ్చాడు. ఆ ఉంగరాన్ని చూడగానే సీతమ్మ ఎంతో సంతోషపడింది. సాక్షాత్తు రాముడిని చూసినంత ఆనందం పొందింది.
హనుమంతుడు ఇచ్చిన ఉంగరాన్ని తీసుకున్న సీతమ్మ "నాయన హనుమ! లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల దేశంలో ఉన్న సమస్త జనులు, సుగ్రీవుడు, వానరములు కుశలమే కదా అని పలు ప్రశ్నలు అడిగిన తరువాత, "రాముడికి నాకన్నా ఎక్కువైనవారు ఎవరూ లేరు, నేను పక్కన లేకపోవడం వలన రాముడు తాను ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడంలో వైక్లవ్యాన్ని పొందలేదు కదా?. రాముడు కేవలము తన పౌరుషము మీదనే ఆధారపడి, దైవమును తిరస్కరించి తిరుగుతున్నాడా?? లేక తన పౌరుషాన్ని పూర్తిగా విడిచిపెట్టి కేవలం భగవంతుడిని మాత్రమే విశ్వసించి తిరుగుతున్నాడ? రాముడికి నేను జ్ఞాపకం ఉన్నానా?? నన్ను తలుచుకుంటున్నాడా?
రావణుడిని, రాక్షసులని నిగ్రహించాలంటే రాముడు అక్కడినుండి అస్త్రప్రయోగం చెయ్యలేడా? రాముడు అస్త్రప్రయోగం చెయ్యకుండా నామీద ఎందుకు ఉపేక్ష వహించాడు? నాకు రావణుడు 12 నెలల గడువు ఇచ్చాడు, అందులో 10 నెలల కాలం పూర్తయిపోయింది. ఇంక 2 నెలలు మాత్రమే మిగిలి ఉంది. వాడు నన్ను ఇంకొక రెండు నెలలు బతకనిస్తాడు. కాని నేను ఒక నెల మాత్రమే బతికి ఉంటాను. ఈ ఒక నెల లోపల రాముడు వచ్చి నన్ను విడిపిస్తే సరి, ఒకవేళ రాముడు రాకపోతే నేను ప్రాణములను విడిచిపెట్టేస్తాను. నేను ఇంక ఒక నెల మాత్రమే జీవించి ఉంటాను అని రాముడికి చెప్పు" అని పలికింది.
సీతమ్మ అలా బాధపడుతూ చెప్పిన మాటలని విన్న హనుమంతుడు తల మీద చేతులు పెట్టుకొని "ఎందుకమ్మా అంతలా బాధపడతావు. అంత నిరాశకు లోనవుతావు. మలయము, వింధ్యము, మేరు మొదలైన పర్వతముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. మా వానరములు తినే కందమూలముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, రాముడికి నీమీద చాలా ప్రేమ ఉంది. ఆయన ఎంతగా తపిస్తుంటాడంటే, ఎక్కడైనా ఒక అందమైన పద్మము కనపడితే "హా సీత, హా సీత" అంటున్నాడు. వానప్రస్థులలాగ రాముడు కూడా సూర్యాస్తమం అయ్యాక సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడు. నిరంతరము నీగురించే ధ్యానము చేస్తున్నాడు. ప్రతిక్షణం శోకిస్తూనే ఉన్నాడు. రాముడు ప్రస్రవణ పర్వతం గుహలో పడుకుని ఉన్నప్పుడు ఆయన ఒంటి మీద నుండి తేళ్ళు, జర్రులు, పాములు పాకినా కాని ఆయనకి స్పృహ ఉండడం లేదు. అంతగా నీగురించి ఆలోచనల్లో మునిగిపోయాడు.
100 యాగములు చేసి ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి దగ్గర సచీదేవి ఉన్నట్టు, ప్రస్రవణ పర్వత గుహలో కూర్చున్న రాముడి దగ్గరికి నిన్ను తీసుకెళ్ళి దింపుతానమ్మా. యజ్ఞములో వేసిన హవిస్సుని హవ్యవాహనుడైన అగ్నిదేవుడు ఎంత పరమపవిత్రంగా తీసుకెళతాడో, అలా నిన్ను తీసుకెళ్ళి రాముడి పాదాల దగ్గర పెడతాను. అమ్మా! నువ్వు వచ్చి నా వీపు మీద కుర్చో" అన్నాడు.
◆ వెంకటేష్ పువ్వాడ.