రామాయణంలో ఆసక్తికరమైన కాకాసుర వృత్తాంతం!
రామాయణంలో ఆసక్తికరమైన కాకాసుర వృత్తాంతం!
హనుమంతుడు సీతమ్మను వీపు మీద కూర్చోమని అడిగేసరికి "నేను నీ వీపు మీద కూర్చుని ఆవలి ఒడ్డుకి వచ్చేటప్పుడు నేను సముద్రంలో పడిపోవచ్చు, లేకపోతే రాక్షసులు నీ దారికి అడ్డురావచ్చు, అప్పుడు నీకు వాళ్ళకి యుద్ధం జరగచ్చు. ఆ సమయంలో నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తావ లేక నన్ను కాపాడుకుంటావా. ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను మళ్ళీ రాక్షసులకి దొరికితే రావణుడు నన్ను ఎవరికీ తెలియని ప్రదేశంలో దాచివేయవచ్చు. అందుచేత నేను నీ వీపు మీద కూర్చుని ఆవలి ఒడ్డుకి రావడం కుదరదు. అమ్మా! నేను యుద్ధం చెయ్యగలను, నిన్ను క్షేమంగా రాముడి దగ్గరికి తీసుకువెళతాను అని అంటావేమో, నేను స్పృహలో ఉండగా, తెలిసి తెలిసి రాముడిని తప్ప వేరొక పురుషుడిని నా చేతితో స్పృశించను. రాముడే వచ్చి రావణుడిని సంహరించి నా చెయ్యి పట్టుకొని ఈ సముద్రాన్ని దాటించాలి" అని చెప్పింది.
అప్పుడు హనుమంతుడు "ఒక మనుష్య స్త్రీగా ఉండి ఇన్ని కష్టాలు పడుతూ, ఇటువంటప్పుడు కూడా 'నేను రాను' అనడం నీకే చెల్లింది తల్లి. నువ్వు నా వీపు మీద కూర్చుని రాను అంటున్నావు కదా, పోని రాముడి దగ్గరికి నేను వెళ్ళి చెప్పడానికి ఏదన్నా ఒక విషయం చెప్పు తల్లి" అన్నాడు.
అప్పుడు సీతమ్మ "ఒకానొకప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడున్న తపోభూములలో నేను, రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళము. అటువంటి సమయంలో ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తున్నాము. అప్పుడు రాముడు అక్కడున్న కొలనులోని నీళ్ళల్లో ఆడుకొని, తడిబట్టలతో పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ( సీతమ్మకి ఏదన్నా అపకారం జరిగితే రాముడు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవతలు ఇంద్రుడి కొడుకైన కాకాసురుడిని పంపారు. ఆ కాకాసురుడు కాకి రూపంలో పర్వతం మీద ఉంటాడు) ఆ సమయంలో నేను కొన్ని ఒరుగులు (వడియాలు) అక్కడ ఎండపెట్టాను. నా పక్కన కూర్చున్న రాముడు సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు.
అప్పుడు కాకాసురుడనే కాకి అక్కడికి వచ్చి ఆ ఒరుగులని తినడం ప్రారంభించింది. అప్పుడు నేను ఒక మట్టిగడ్డని తీసి ఆ కాకి మీదకి విసిరాను. అప్పుడా పక్షి నా వక్షస్థలం మీద వాలి, తన ముక్కుతో పొడిచి నా మాంసం పీకింది. ఆ బాధలో నేను గిలగిలలాడడం వలన నా వడ్డాణం జారింది, నేను ఆ వడ్డాణాన్ని తీసి కాకి మీదకి విసరబోతే రాముడు నన్ను చూసి నవ్వి 'సీత! కాకి మీదకి బంగారు వడ్డాణం విసురుతావ' అన్నాడు. తరువాత నేను ఆ బాధని ఓర్చుకొని రాముడి ఒడిలో తల పెట్టుకొని నిద్రపోయాను. నేను అలా రాముడి ఒడిలో తల పెట్టుకొని ఉన్నంతసేపు ఆ కాకి రాలేదు. మళ్ళి కొంతసేపటికి నేను నిద్రలేచాను, అప్పుడు రాముడు నా ఒడిలో తల పెట్టుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు మళ్ళి ఆ కాకాసురుడనే కాకి నా వక్షస్థలం మీద కూర్చుని, మళ్ళి గట్టిగా నా శరీరంలోకి పొడిచి నా మాంసాన్ని తిన్నది. అప్పుడు నా శరీరం నుండి నెత్తురుకారి రాముడి నుదిటి మీద పడింది.
రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిది అని చూసేసరికి, వక్షస్థలం నుండి నెత్తురు కారుతూ, ఏడుస్తూ నేను కనపడ్డాను. అప్పుడాయన నోటినుండి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది "ఎవడురా అయిదు తలల పాముతో ఆటలాడినవాడు" అని గద్దించాడు. (సీతమ్మని పంచముఖ గాయత్రిగా రాముడు ఆనాడు లోకానికి చెప్పాడు) అప్పుడాయన చుట్టూ చూసేసరికి ముక్కుకి నెత్తురుతో, మాంసం ముక్కతో, కాళ్ళకి నెత్తురుతో ఒక కాకి కనపడింది. రాముడు అక్కడ ఉన్న ఒక దర్భని (గడ్డిని) తీసి, దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి (మంత్రపూరితమైన అస్త్రాలని ప్రయోగించేటప్పుడు బాణాలే అవసరంలేదు, దేనిమీదన్నా ఆ మంత్రాన్ని అభిమంత్రించి ప్రయోగించచ్చు) విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం కాకిని తరిమింది.
ఆ కాకి మూడు లోకములు తిరిగి అందరి దగ్గరికి వెళ్ళింది, కాని అందరూ రాముడు చంపుతానని అస్త్ర ప్రయోగం చేస్తే మేము రక్షించలేము, నువ్వు వెళ్ళిపో అన్నారు. ఆ కాకి అన్ని చోట్లకి తిరిగి తిరిగి రాముడున్న చోటకి వచ్చి నమస్కారం చేస్తూ పడిపోయింది (మంత్రంతో అభిమంత్రించిన అస్త్రానికి ఒక మర్యాద ఉంటుంది. వెన్ను చూపించి పారిపోతున్నవాడిని ఆ అస్త్రం కొట్టదు. ఎదురుతిరిగి యుద్ధం చేసినవాడినే అది కొడుతుంది. కాకాసురుడు ఆ బ్రహ్మాస్త్రానికి ఎదురుతిరగకుండా వెన్ను చూపించి పారిపోతున్నాడు కనుక అది ఆయనని సంహరించలేదు).
రాముడు ఆ కాకిని చూసి నా దగ్గరికి వచ్చి పడిపోయావు కనుక నువ్వు నాకు శరణాగతి చేసినట్టే. అందుకని నేను నిన్ను విడిచిపెడుతున్నాను. కాని ఒకసారి బ్రహ్మాస్త్రం వేసిన తరువాత ప్రాణములతో సమానమైనదానిని ఇచ్చేయ్యాలి. మరి నువ్వు ఏమిస్తావు' అని ఆ కాకసురుడిని రాముడు అడిగాడు. అప్పుడా కాకాసురుడు తన కుడి కన్నుని బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి రాముడికి నమస్కారం చేసి, దశరథుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఇవ్వాళ ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించమని ఒకసారి రాముడికి చెప్పు" అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమకి చెప్పింది.
◆వెంకటేష్ పువ్వాడ.