గోవర్ధన పర్వతం రోజురోజుకూ ఎత్తు తగ్గిపోవడానికి కారణమిదే!
గోవర్ధన పర్వతం రోజురోజుకూ ఎత్తు తగ్గిపోవడానికి కారణమిదే!
కార్తీక మాస శుక్ల పక్ష పాడ్యమి నాడు గోవర్ధన పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజున గోవర్ధన వర్వత ఆకారాన్ని తయారు చేసి గోవర్ధన పర్వతాన్ని, గోవులను, శ్రీకృష్ణుడిని పూజిస్తారు. అయితే గోవర్ధన పర్వతం నిరంతరం ఎత్తు తగ్గుతూ వస్తోందనే విషయం చాలామందికి తెలియదు. ఈ పర్వతం ఎత్తు తగ్గడం వెనుక ఓ కారణం ఉంది. పులస్త్య మహర్షి ఈ పర్వతానికి శాపం ఇచ్చాడనే కథనం కూడా పర్చారంలో ఉంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
పురాణాల ప్రకారం పులస్త్య మహర్షి తీర్థయాత్రలు చేస్తూ గోవర్ధన పర్వతాన్ని చేరుకున్నాడు. అక్కడ గోవర్ధన పర్వత అందాన్ని చూసి మైమరచిపోయాడు. పర్వత రాజు అయిన ద్రోణగిరి కుమారుడే గోవర్ధనుడు. అయితే పులస్త్య మహర్షి గోవర్ధన గిరి పర్వతాన్ని చూసి ఆ పర్వతం కాశీలో ఉంటే ఎంతో బాగుటుందని, అక్కడ పూజాది కార్యాలకు లోటు ఉండదని అభిప్రాయ పడతాడు. ఆ వెంటనే ద్రోణగిరితో గోవర్ధన గిరిని తనతో పంపమని అడుగుతాడు. సాక్షాత్తూ బ్రహ్మదేవుడి మనవడు అయిన పులస్త్య మహర్షే తనను అలా అడిగే సరికి ద్రోణగిరి కాదనలేక గోవర్ధన గిరిని మహర్షితో వెళ్లమంటాడు. గోవర్ధన గిరి పులస్త్య మహర్షితో వెళ్లడానికి సిద్దమవుతాడు. అయితే ఒక షరతు పెడతాడు. పులస్త్య మహర్షి తనను ఎక్కడా ఆపకుండా తీసుకెళ్లాలని, మధ్యలో ఎక్కడైనా తనను కిందకు దింపితే అక్కడే స్థిరపడిపోతానని చెబుతాడు. ఆ షరతుకు పులస్త్య మహర్షి అంగీకరిస్తాడు.
మహర్షి అంగీకారం తెలిపిన తరువాత గోవర్థనుడు మహర్షితో మహర్షీ నేను రెండు యోజనాల ఎత్తు, ఐదు యోజనాల వెడల్పుతో ఉన్నాను. నన్ను కాశీకి ఎలా తీసుకెళ్తారు? అని అడుగుతాడు. అప్పుడు పులస్త్య మహర్షి గోవర్ధనుడితో నేను నా తపశ్శక్తితో నిన్ను నా అరచేతిలో మోస్తాను అన్నాడు. గోవర్దనుడు ఆ ప్రకారంగానే మహర్షి వెంట వెళ్ళడానికి అంగీకరించాడు. మహర్షి గోవర్ధనుడిని అలా తీసుకెళుతుండగా కృష్ణుడు తన ప్రజలతో కలసి నివసించే బ్రజ్ అనే ప్రాంతం వచ్చింది. ఆ ప్రాంతం గురించి గోవర్ధనుడికి ముందే తెలుసు. ఆ ప్రాంతానికి కృష్ణుడు రాధతో కలసి వచ్చేవాడని, ఆయన బాల్యం, కౌమారం అక్కడ గడిచాయని గుర్తుకు వచ్చి అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఎలాగైనా పులస్త్య మహర్షి తనను అక్కడ దింపాలని ఆలోచించి మహర్షి చేతిలో ఉన్న గోవర్ధనుడు ఒక్కసారిగా తన బరువు పెంచుతాడు. ఆ బరువుకు పులస్త్య మహర్షి అలసిపోతాడు. తనకు విశ్రాంతి అవసరమని భావించి గోవర్ధనుడు పెట్టిన షరతు మరచిపోయి గోవర్ధనుడిని ఆ ప్రాంతంలో దించుతాడు.
పులస్త్య మహర్షి విశ్రాంతి తీసుకున్న తరువాత పర్వతాన్ని ఎత్తాలని చూడగా అది సాధ్యం కాలేదు. గోవర్ధనుడిని తన చేతిలోకి రావాలని అడగగా గోవర్ధనుడు తను పెట్టిన షరతు గుర్తు చేస్తాడు. గోవర్ధనుడు కావాలనే అలా చేశాడని పసిగట్టిన పులస్త్య మహర్షి ఆ రోజు నుండి ప్రతి రోజూ కొంచెం కొంచెం క్షీణించిపోతావని శపించాడు. అలా క్షీణిస్తూ చివరికి భూమిలో కలిసి పోతావని శపించాడు. అప్పటి నుండి గోవర్ధన పర్వతం నిజంగానే కొంచెం కొంచెం తన ఎత్తు కోల్పోతోంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి కృప కారణంగా గోవర్ధన పర్వతం పూజలు అందుకుంటోంది. ఇదీ గోవర్ధన పర్వతం శాపానికి గురైన కథనం.
*నిశ్శబ్ద