దేవుడి పూజ కోసం తులసిని ఇలా కోయాలి!

 

దేవుడి పూజ కోసం తులసిని ఇలా కోయాలి!

తులసి పెరిగే చోటును తులసీ వన ప్రదేశంగా వర్ణిస్తారు, ఆ పరిసర ప్రాంతం కూడా పవిత్రమైనవి. కాబట్టి, ఆ పరిసర ప్రదేశాలను పరిశుభ్రంగా  ఉంచాలి.

దేవుడి పూజకు తులసి ఎంతో ప్రశస్తమైనది. పూజార్చనల నిమిత్తం తులసీ దళాల్ని కోసేవారు తప్పనిసరిగా స్నానమాచరించి, శుచి అయిన తరువాతే కోయాలి. అదీ కుడి చేతితోనే కోయాలి. ప్రాతః కాలంలోనే ఆ పని చేయాలి. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ గోళ్ళతో తులసి పత్రాలను తుంచ కూడదు. ఇక, తులసి సన్నిధానంలో విష్ణుమూర్తి ఏకాంతంగా ఉంటాడు కాబట్టి, సూర్యాస్తమయం తరువాత తులసిని అసలే కోయకూడదు. తులసి చెట్టుకు నిత్యం నీళ్ళు పోసి, పోషించే వారే తులసీ దళాల్ని కోయడానికి నైతికంగా అర్హులు.

ప్రార్థిస్తూనే కోయాలి!

తులసీ దళాలను కోసేటప్పుడు క్రింది శ్లోకాన్ని చెబుతూ నమస్కరించాలి.

మాత స్తులసి గోవింద హృదయానందకారిణి నారాయణస్య పూజార్థం చినోమి త్వాం నమోస్తుతే॥

'గోవిందునికి హృదయానందం కలిగించే తులసీ మాతా! నీకు నమస్సులు. నారాయణుని పూజ నిమిత్తం పత్రాలు తెంపుతున్నాను. నన్ను క్షమించి అనుగ్రహించు!

అలాగే, తులసి చెట్టు నుంచి దళాలు కోస్తున్నప్పుడు చేసే ప్రార్థనగా ఈ క్రింది శ్లోకాలను కూడా చెబుతారు.

తులసీ! అమృత సంభూతే! సదా త్వమ్ కేశవప్రియే |

      కేశవార్థం లునామి త్వమ్ వరదా భవ శోభనే ॥


మోక్షిక హేతోర్ధరణి ప్రసూతే, విష్ణో స్సమస్తస్య గురోః ప్రియయే తే ఆరాధనార్థం పురుషోత్తమస్య, లునామి పత్రం తులసి క్షమస్వ ॥ 

ప్రసీద మమ దేవేశి ప్రసీద హరి వల్లభే |

క్షీరోద మథనోద్భూతే తులసీ త్వమ్ ప్రసీద మే ॥

'అమృత సంభూతురాలైన ఓ తులసీ! నిత్యం కేశవునికి ప్రియమైనదానా! ఆ కేశవుని పూజ కోసం భక్తితో పత్రాలు తెంపుతున్నాను. నన్ను అనుగ్రహించు!'

'సర్వ మోక్షాలనూ ప్రసాదించడానికి ఈ భూమి మీద అవతరించిన ఓ తులసీ మాతా! విష్ణుమూర్తికి ప్రియమైన దానా! పురుషోత్తముని ఆరాధన నిమిత్తం నీ పవిత్రమైన పత్రాలు కోస్తున్నాను. క్షమించి, నన్ను అనుగ్రహించు!'

'ఓ దేవీ! నన్ను అనుగ్రహించు. శ్రీహరికి ప్రియమైన దానా! నన్ను అనుగ్రహించు. పాల సముద్రాన్ని మధించినప్పుడు పుట్టిన ఓ తులసీ! నన్ను అనుగ్రహించు!' 

పై మూడు శ్లోకాలనూ పఠిస్తూ, తులసీ దళాలను కోయడం శ్రేయస్కరం.

తులసిని కోసే విధానం

తులసిని కోసేటప్పుడు విడి ఆకులనూ, కొమ్మలనూ కోయ రాదు. దళాలుగానే కోయాలి. దళాలను కోసేటప్పుడు మొక్క కదలకుండా రెండో చేతితో దళాలను కోసే చోట పట్టుకొని, నిదానంగా కోయాలి. గోటితో గిల్లకూడదు. కుడి చేతి చూపుడు వేలు, చిటికెన వేలు వదిలేసి, మిగిలిన మధ్య వేలు, ఉంగరపు వేలు, బొటనవేలు చేర్చి, దళాలను తుంచాలి. అలా తుంచు తున్నప్పుడు తులసీ ప్రార్థన తప్పకుండా చేయాలి.

సర్వసాధారణంగా దేవుణ్ణి ఎప్పటికప్పుడు తాజాగా కోసిన పుష్పాలు, పత్రాలతోనే పూజించాలి. అయితే, కోసినది మొదలు కొద్ది రోజుల వరకు తులసి, పూజకు పనికి వస్తుంది. మారేడు మూడేళ్ళు, తామరపూలు 7 రోజుల వరకు పూజకు పనికి వస్తాయి.

                                        *నిశ్శబ్ద.