కర్ణుడు కవచ కుండలాలతో ఎందుకు పుట్టాడు
కర్ణుడు.. కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి ‘కర్ణుని’ కనలేదు. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు... అంతే. కన్యగా ఉన్న కుంతికి., దూర్వాసమహర్షి ఇచ్చిన మంత్రం ‘సంతాన సాఫల్య మంత్రం’. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే, ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు తప్ప మరే వరాలు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది. ఈ విషయాన్ని పాఠకులు ముందు అర్థంచేసుకుంటే..కర్ణుడు, కుంతికి ఎలా ఇవ్వబడ్డాడో బాగా అర్థం అవుతుంది. ఇక విషయంలోకి వెడితే.... పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కవచాలు వరంగా పొందాడు. అప్పటినుంచి వాడికి ‘సహస్రకవచుడు’ అనే పేరు స్థిరపడిపోయింది. ఆ వరగర్వంతో వాడు సర్వలోకాలనూ నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూండేవాడు. వాడి బాధలు పడలేక సకల ప్రాణికోటి శ్రీ మహావిష్ణువును శరణు కోరగా ‘భయపడకండి..నేను నర, నారాయణ రూపాలలో బదరికావనంలో తపస్సు చేస్తున్నాను. వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను’ అని వారికి ధైర్యం చెప్పి పంపాడు.
హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి రెండురూపాలుగా విడిపోయాడు. నర రూపం ‘నరుని’గానూ., ‘సింహ’ రూపం ‘నారాయణుని’గా ‘ధర్ముని’ కుమారులుగా జన్మించాడు. వారే నర, నారాయణులు. వారిరువురూ పుట్టుకతోనే పరాక్రమవంతులు, విరాగులు. అందుకే వారిరువురూ ఆయుధధారులై బదరికావనంలో ఏకాగ్రచిత్తులై తపోదీక్ష వహించారు. ఏ ఆటంకం లేకుండా వారి తపస్సు కొనసాగుతోంది. ఒకసారి ప్రహ్లాదుడు బదరికావనం సందర్శించి వెడుతూ.. నర, నారాయణులను చూసి, వారి ప్రక్కన ఆయుధాలు ఉండుట గమనించి..‘తాపసులైన వీరికి ఆయుధాలతో పనేమి? వీరెవరో కపట తాపసులైయుండవచ్చు’ అని భావించి వారికి తపోభంగం గావించి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. వారిమద్య భీకరయుద్ధం జరిగింది. ఎంతకాలమైనా ప్రహ్లాదుడు వారిని జయించ లేకపోవడం చూసి, ఆశ్చర్యపడి శ్రీ మహావిష్ణువును ధ్యానించాడు. శ్రీహరి ప్రత్యక్షమై ‘ప్రహ్లాదా.. నర నారాయణులు నా అంశతో జన్మించినవారు. వారిని నీవు గెలవలేవు’ అని చెప్పాడు. ప్రహ్లాదుడు తన తప్పు తెలుపుకుని నర,నారాయణులను క్షమించమని వేడుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
నర,నారాయణుల తపస్సు కొనసాగుతోంది. వారి తపస్సుకి ఇంద్రుడు భయపడి., వారికి తపోభంగం చేసిరమ్మని అప్సరసలను పంపాడు. వారు తమ రూప, వయో, నృత్య, గానాలతో నర,నారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నించారు.. కానీ, ఫలితం శూన్యం. అప్పుడు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి, ‘మీ అందాలు మమ్ములను ఆకర్షించలేవు. ఇంద్రపదవి ఆశించి మేము ఈ తపస్సు చేయడంలేదు అని మా మాటగా మహేంద్రునకు తెలియజెప్పండి’ అని తన తొడమీద చరిచాడు. ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ, అద్భుత సౌందర్యరాశి జన్మించింది. తన ఊరువుల(తొడల) నుంచి పుట్టిన ఆ సుందరికి ‘ఊర్వసి’ అని పేరు పెట్టి, ఆమెను ఆ అప్సరసలకు ఇస్తూ, ‘ఈమెను మా బహుమతిగా మహేంద్రునకు ఇవ్వండి’ అని చెప్పి వారిని పంపాడు. మహేంద్రుడు తన తప్పు తెలుసుకుని నర,నారాయణులను క్షమించమని వేడుకున్నాడు. నర,నారాయణుల తపస్సు కొనసాగతోంది. ఆ సమయంలో వరగర్వాంధుడైన ‘సహస్రకవచుడు’ వారిదగ్గరకు వచ్చి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు నారాయణుడు అతనితో ‘రాక్షసేశ్వరా..నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది. కానీ, మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చెయ్యడం ధర్మం కాదు. కనుక, మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తూంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలుగకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను’ అన్నాడు.
సహస్రకవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు. నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు యుద్ధానికి దిగాడు. యుద్ధం భీకరంగా సాగుతోంది. అలా వేయి సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్రకవచుని వేయి కవచాలలో ఒక కవచాన్ని భేదించగలిగాడు. అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా, నరుడు సహస్రకవచునితో యుద్ధానికి దిగాడు. మరో వేయి సంవత్సరాలు గతించిన అనంతరం నరుడు సహస్రకవచుని మరో కవచాన్ని భేదించాడు. ఇలా నర,నారాయణులిరువురూ కలిసి ఆ సహస్రకవచుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు. ఇక సహస్రకవచునికి ఉన్నది ఒకేఒక కవచం. అది గమనించిన సహస్రకవచునికి భయం పుట్టి, యుద్దరంగం వదిలి, పరుగు పరుగున సూర్యుని దగ్గరకు వెళ్లి అభయం ఇమ్మని వేడుకున్నాడు. అప్పుడు సూర్యుడు ‘కలకాలం నేను నీకు అభయం ఇవ్వలేను., నర,నారాయణుల అనంతరం నీకు నానుంచి విడుదల కలిగిస్తాను’ అన్నాడు. సహస్రకవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండిపోయాడు. కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు., ఆ సహస్రకవచునే.., పసిబిడ్డగా మార్చి, కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. ఆ కర్ణుని సంహరించడానికే నర,నారాయణులిరువురూ.. కృష్ణార్జునులుగా జన్మించి, కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరించారు.
- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం