కోటప్పకొండ మీద కాకి వాలదు... ఎందుకని...

 

 

గుంటూరు జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో కోటప్పకొండ ఒకటి. కోటప్పకొండలోని శివుణ్ణి త్రికూటేశ్వరస్వామి అని, దేవాలయాన్ని త్రికూటేశ్వరాలయం అని పిలుస్తారు. గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలో కోటప్పకొండను భక్తులు సంవత్సరం పొడవునా సందర్శిస్తూనే వుంటారు. ఈ దేవాలయంలో 687 అడుగుల ఎత్తు వుండే శివుడి విగ్రహం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కోటప్పకొండ ప్రాంతం మొత్తం శిఖరాల మయం. దేవాలయం దగ్గర నిలుచుంటే చుట్టూ రుద్ర శిఖరం, బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరం అనే మూడు పెద్దపెద్ద శిఖరాలు కనిపిస్తాయి. కోటప్పకొండ కంటే ఎత్తున వుండే రుద్ర శిఖరం మీద ఒక చిన్న దేవాలయం కూడా వుంటుంది. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు వైభవంగా జరుగుతాయి. తిరునాళ్ళ సందర్భంగా ఏర్పాటయ్యే ఎత్తయిన ప్రభలు చాలా ప్రసిద్ధిని పొందాయి. కార్తీకమాసంలోనే ఈ దేవాలయంలో కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతూ వుంటాయి. కొండమీద వున్న దేవాలయాన్ని చేరుకోవడానికి మెట్ల మార్గం వుంది. మెట్లు చాలా నిట్టనిలువుగా వుంటాయి. అందుకే కొండకు ఎక్కే భక్తులు ‘చేదుకో కోటయ్యా’ అని అంటూ ఎక్కుతూ వుంటారు. బస్సు మార్గం వున్నప్పటికీ చాలామంది భక్తులు నడిచే కొండమీదకి వెళ్తూ వుంటారు. ఈ కోటప్పకొండ క్షేత్రానికి వున్న మరో విశిష్టత ఏమిటంటే, ఈ క్షేత్రం వున్న కొండ మీద కాకులు అస్సలు కనిపించవు. మిగతా పక్షులన్నీ కనిపిస్తాయిగానీ, ఎంత వెతికినా ఒక్క కాకి కూడా కనిపించదు. ఇదొక వింత. ఓ సందర్భంలో కాకి ఈ కొండమీదకి రాకుండా శాపం విధించారనే స్థల పురాణం ప్రచారంలో వుంది.  1761లో ఈ ప్రాంతాన్ని పాలించిన గుండారాయలు అనే రాజు కోటప్పకొండ మీదకి 703 మెట్లతో మెట్లమార్గాన్ని ఏర్పాటు చేయించారు. అలాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ మంత్రిగా వున్న సమయంలో కోటప్పకొండ మీదకు బస్సు మార్గాన్ని ఏర్పరచి అనేక సౌకర్యాలు కల్పించారు. భక్తులు ఒక్కసారైనా తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం కోటప్పకొండ.