శివపూజ విధానాలు ... వాటి ఫలాలు మీకు తెలుసా? జన్మనక్షత్ర రీత్యా ధరించవలసిన రుద్రాక్షలు

 

శివపూజ విధానాలు ... వాటి ఫలాలు మీకు


తెలుసా?


జన్మనక్షత్ర రీత్యా ధరించవలసిన రుద్రాక్షలు

 

 

శివారాధనలో ప్రధానమైనది అభిషేకం, మారేడు దళాలతో పూజించడం. ఒక్కో ఫలాన్ని ఆశించి ఒక్కో విధంగా శివుడిని పూజించే ఆచారమున్నది. ఏ ఫలం కోసం ఏ పూజ చేయాలో తెలుసుకుందాం ...
మనసులో ఏమీ కోరుకోకుండా పువ్వులతో పూజ చేస్తే ముక్తి లభిస్తుంది.
ధనాన్ని కోరుకునేవారు పద్మాలు, మారేడు దళాలతో పూజించాలి. బియ్యపు గింజలతో అర్చించినా ఇదే ఫలం కలుగుతుంది.
గృహశాంతికి జలంతో అభిషేకం ...
శత్రునాశనానికి తైలాభిషేకం చేయాలి ...
ఆరోగ్యం కోసం 59వేల పువ్వులతో అర్చించాలి ...
సంపంగ, మొగలిపువ్వులతో మాత్రం శివుడిని పూజించకూడదు ...
ఇలా ఒక్కో పూజతో ఒక్కో కోరిక తీరుతుంది. శివరాత్రి రోజు చేసే అర్చన మరింత ఫలితాన్నిస్తుంది.
శివుడి కృపను కోరుకునే వారు శివరాత్రి రోజు చేయవలసిన విధులు ఇలా ఉంటాయి.

 

 


మహాశివరాత్రి ముందురోజు రాత్రి ఉపవాసం ఉండి పవిత్రంగా గడపాలి. ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. దేవాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసి, రాత్రి జాగారణ చేయాలి. మొదటి ఝాములో పాలతో, రెండవ ఝాములో పెరుగుతో, మూడవ ఝాములో నేతితో, నాల్గవ ఝాములో తేనెతో అభిషేకం చేయాలి. ఇది చేయలేనివారు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయాలి. లింగోద్భవ సమయంలో శివుడిని దర్శించుకోవాలి. మరుసటి రోజు ఉదయానికి ఉపవాస దీక్ష విరమించాలి. ఇవీ శివరాత్రిరోజు చేయవలసిన విధులు.

రుద్రాక్ష మహిమలు :

 

 


రుద్రాక్షలంటే శివుడి ప్రతిరూపాలుగా కొలుస్తాము. రుద్రాక్షలు మహా శక్తివంతమైనవి. అనుకున్న పనులు నెరవేరేందుకు, సమస్త దరిద్రాలూ తొలిగిపోయి సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుక రుద్రాక్ష. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది. రుద్రాక్షను ఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్య వారథిగా భావిస్తారు.
తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధ పడుతున్నవారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి. అంతేకాదు, చెడు అలవాట్లకు లోనయిన వారు తాము చేసేది తప్పు అని తెలిసీ, వాటినుంచి బయటపడలేక పోతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. నొసటన విభూతి, కంఠాన రుద్రాక్షమాల ధరించి శివనామ జపం చేస్తున్న వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణి సంగమ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుందట. రుద్రాక్షను సర్వపాపాలనూ నశింపచేసే సరస్వతీ నదితో పోల్చారు మునులు. చేతికి, చెవులకు, కంఠంలో రుద్రాక్షలను ధరించినవారు అజేయులై వెలుగొందుతారని ప్రతీతి. ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారు ఈశ్వరానుగ్రహానికి పాత్రులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి. రుద్రాక్షలపై ఉండే ముఖాల ఆధారంగా రుద్రాక్షలను ఇరవయ్యొక్క రకాలుగా విభజించారు. రుద్రాక్షలను ధరించినవారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి.

 

 

రుద్రాక్షలను ధరించి శృంగారంలో పాల్గోనరాదు.
మైలపడిన వారిని తాకరాదు.
మాలను ధరించి శ్మశానానికి వెళ్ళరాదు.
కుటుంబ సభ్యులయినా కూడా ఒకరి రుద్రాక్షలను మరొకరు ధరించకూడదు.
ఉంగరంలో ధరించరాదు.
రుద్రాక్షలను ధరించి నిద్రపోకూడదు.
స్త్రీలు కూడా రుద్రాక్షలను ధరించవచ్చు కానీ, రుతుసమయంలో ధరించకూడదు.

ధారణ విధి :

 

 

 

సోమవారం లేదా పుష్యమీ నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభసమయంలో రుద్రాక్షను తెచ్చి స్నానం చేయించి, శుద్ధి చేసి శివపూజ చేయాలి. అప్పుడే రుద్రాక్షను ధరించాలి. రుద్రాక్షను ధరించి ఫలితం కోసం వెంటనే చూడరాదు. ఫలితం కోసం ధరించే వారు పూర్తి విధానంతో, సాధనతో గురువు సమక్షంలో ధరించాలి.
రుద్రాక్షమాలను ధరించవలసిన తిథులు :
పౌర్ణమి, త్రయోదశి, చతుర్ధశి, మహాశివరాత్రి లేదా మాసశివరాత్రి, శివరాత్రి రోజు ఈశ్వరుని రుద్రాక్షలతో పూజ చేయడం మహాశ్రేష్టం. రుద్రాక్షలను ధరిస్తే సర్వదుఃఖాలు తొలిగి సకల సంపదలూ ఒనగూడుతాయని స్కందపురాణం చెబుతోంది. జావా, సమత్రా, ఇండోనేషియాలోని తిమూర్, దక్షిణాసియాలోని నేపాల్ లోనూ, ఇండియాలో చాలా కొద్దిచోట్ల రుద్రాక్ష చెట్లు పెరుగుతాయి.

జన్మనక్షత్ర రీత్యా ధరించవలసిన రుద్రాక్షలు :

 

 

 

నక్షత్రము         ధరించవలసిన రుద్రాక్ష
అశ్విని             నవముఖి
భరణి               షణ్ముఖి
కృత్తిక              ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి             ద్విముఖి
మృగశిర          త్రిముఖి
ఆరుద్ర             అష్టముఖి
పునర్వసు        పంచముఖి
పుష్యమి           సప్తముఖి
ఆశ్లేష               చతుర్ముఖి
మఖ               నవముఖి
పుబ్బ              షణ్ముఖి
ఉత్తర               ఏకముఖి, ద్వాదశముఖి
హస్త               ద్విముఖి

 

 

చిత్త                త్రిముఖి
విశాఖ            పంచముఖి
అనురాధ        సప్తముఖి
జ్యేష్ఠ              చతుర్ముఖి
మూల           నవముఖి
పూర్వాషాఢ    షణ్ముఖి
ఉత్తరాషాఢ     ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం            ద్విముఖి
ధనిష్ట             త్రిముఖి
శతభిషం        అష్టముఖి
పూర్వాభాద్ర    పంచముఖి
ఉత్తరాభాద్ర      సప్తముఖి
రేవతి              చతుర్ముఖి