Read more!

శ్రీవారి హుండీ కానుకలు నెలకు 45 కోట్లు (Tirumala Srivari Hundi Income 45 Crores per month)

 

శ్రీవారి హుండీ కానుకలు నెలకు 45 కోట్లు

(Tirumala Srivari Hundi Income 45 Crores per month)

 

ఖరీదైన, ధనవంతుడైన దేవుడంటే తిరుమలగిరి వేంకటేశ్వరుడే. భారీ మొత్తం సొమ్ము, పెద్ద నగలమూటలతో శ్రీవారి హుండీ అనేకసార్లు వార్తల్లోకెక్కుతుంది. కానుకల రూపంలో వేంకటేశ్వరునికి నిత్యం లక్షలాది నోట్ల కట్టలు, ఖరీదైన బంగారు, వెండి నగలు వస్తాయి. ఇక పండుగలు, విశేషదినాల్లో ఏడుకొండల వేంకటేశునికి లెక్కకు మిక్కిలిగా కానుకలు వస్తాయి.

 

అసలు శ్రీవారి హుండీ ఎప్పుడు ఆరంభమైందో, దాని విశేషాలేమిటో తెలుసుకుందాం.

 

శంఖుచక్రాలు, తిరునామాలు ముద్రించిన రాగి గంగాళాన్ని శ్రీవారి హుండీగా ఉపయోగిస్తారు. దీన్ని ''కొప్పెర'' అని కూడా అంటారు. శ్రీవారి హుండీ తిరుమామణి మంటపంలో ఉంది. 1821 జూలై 25న శ్రీవారి హుండీ ఏర్పాటైంది. ఈస్టిండియా కంపెనీవారి చట్టం బ్రూస్కోడ్- 12లో దీని వివరాలు ఉన్నాయి. 1958 నవంబర్ 28న శ్రీవారి ఒకరోజు కానుకల వివరాలు లక్ష రూపాయలు పైగా వచ్చినట్లు ఆనాటి రికార్డులు చాటుతున్నాయి. ప్రస్తుతం శ్రీవారి ఒకరోజు సగటు ఆదాయం కోటిన్నరకు పైగా ఉంది.

 

తిరుమల వేంకటేశ్వరునికి వచ్చినంత ఆదాయం ఇతర ఏ దేవుళ్ళకీ లేదు. నిరుపేదలు మొదలు ధనికుల వరకూ కానుకలు సమర్పిస్తూ ఉంటారు. నల్లధనం మూలుగుతున్న కొందరు కోట్లాది రూపాయలు మూటగట్టి శ్రీవారి హుండీలో వేస్తూ ఉంటారు. కొద్దికాలంగా నిఘా పెరగడంతో ఇలాంటి నల్లధనం హుండీలో పడిన దాఖలాలు లేవు.

 

శ్రీవారి హుండీ నిండినప్పుడు భక్తుల సమక్షంలో సీలు వేస్తారు.పూర్తి సెక్యూరిటీతో కానుకలు లెక్కించే పరకామణికి చేరుస్తారు. కానుకలు లెక్కింపుకోసం దేవస్థానంలో ఉద్యోగులు పాల్గొంటారు. శ్రీవారి హుండీ కానుకల గణింపుకై కొందరు ఉద్యోగులకు బాధ్యత అప్పజెప్తారు. రోజుకు సుమారు 50మంది ఈ లెక్కింపు పనిలో పాల్గొంటారు.

 

పరకామణి లెక్కింపు పనిలో పాల్గొనే ఉద్యోగులు జేబులు ఉన్న చొక్కాలు, పాంటులు వేసుకోడానికి వీల్లేదు. పంచె, బనీను మాత్రమే వేసుకుని ఆ పనిలో పాల్గొనాలి. చౌర్యాలు, అక్రమాలు జరగడానికి అవకాశం లేకుండా చుట్టూ సీ.సీ. కెమెరాలు అమర్చి ఉంటాయి. శ్రీవారి హుండీలోంచి ముందుగా బంగారు, వెండి ఆభరణాలు, నోట్లు, చిల్లర నాణాలు విడదీస్తారు. తర్వాత లెక్కబెడతారు.

 

పర్వదినాల్లోనే కాకుండా మామూలు రోజుల్లోనూ ఒక్కోసారి అధికమొత్తం శ్రీవారి హుండీలో జమ అవుతుంది. ఈమధ్య జూలై 26న, 2.85 కోట్ల రూపాయలు కానుకలు వచ్చిన విషయం తెలిసిందే.

 

శ్రీవారిహుండీలో ఒకరోజు ఆదాయం కోటిన్నరకు పైగా వస్తుంది. అంటే నెలకు 45 కోట్లు అన్నమాట.