తిరుమల వేంకటేశుని ఆభరణాలు (Lord Venkateswara's Ornaments)

 

తిరుమల వేంకటేశుని ఆభరణాలు

(Lord Venkateswara's Ornaments)

తిరుమల వేంకటేశ్వరుడంటే నిలువెత్తు బంగారం. వజ్రవైఢూర్యాల రాశి. వెంకటాచలపతికి ఆభరణాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. స్వామివారిని రోజుకు 120 రకాల ఆభరణాలతో అలంకరిస్తారు అంటే అతిశయోక్తి కాదు. మూల విరాట్టునే కాకుండా ఉత్సవ విగ్రహాల నిమిత్తం సుమారు 400 ఆభరణాలను వినియోగిస్తారు. అందుకే ఏడుకొండలవాని ఆభరణాలు కాసుల్లో , కిలోల్లో..క్వింటాళ్ళలో కాదు.. ఏకంగా టన్నుల్లో చూడాలి.

 

ఆపదమొక్కుల వేంకటేశ్వరునికి మామూలు రోజుల్లో చేసే అలంకారాన్ని నిత్యకృత్య అలంకారం అని, పండుగ రోజులు, ఉత్సవాల సందర్భంగా చేసే అలంకారాన్ని విశేష అలంకారం అని అంటారు. మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తులకు వినియోగించే ఆభరణాలు అన్నీ కలిపి తిరుమల వెంకన్నకు 11 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయి.

శ్రీవారికి 12వ శతాబ్ది నుంచే విజయనగర రాజులు, తంజావూరు రాజులు తదితరులు విశేష కానుకలు సమర్పించడం ఆరంభమైంది. అలా శ్రీవారికి ఆభరణాల వెల్లువ ప్రారంభమైంది. తిరుమల ఆలయాన్ని దర్శించినప్పుడల్లా శ్రీకృష్ణ దేవరాయలు కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైఢూర్యాలు, గోమేధికాలతో పొదిగిన కంఠహారం తదితర ఆభరణాలు సమర్పించేవాడు. భుజకీర్తులు, నవరత్నఖచిత బంగారు ఖడ్గాలు కూడా కానుకగా సమర్పించాడు.

 

స్వామివారి విశేష ఆభరణాల్లో 500 గ్రాముల గరుడమేరు పచ్చ ప్రధానమైంది. ఉత్సవ సమయాల్లో శ్రీవారికి దీన్ని అలంకరిస్తారు. ఎందరో ప్రముఖులు, వాణిజ్య సంస్థలు శ్రీ వేంకటేశ్వరునికి కోట్ల రూపాయలు ఖరీదు చేసే కిరీటాలను, ఇతర ఆభరణాలను భక్తిగా సమర్పించడం జరిగింది. పూజకు వాడే 108 బంగారు పువ్వులను, అర్చన సేవలో ఉపయోగించే 108 పద్మాలను స్వామివారికి ముస్లిం వ్యక్తులు సమర్పించడం విశేషం.

 

స్వామివారికి వజ్ర, రత్న ఖచిత 6 కిరీటాలు (ముఖ్యమైనవి), వజ్రాలు పొదిగిన శంఖుచక్రాలు, రత్నాల కర్ణాభరణాలు, 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు 7 కిరీటాలు ఉన్నాయి. వైకుంఠ హస్తం, కటిహస్తం, వడ్డాణాలు, సువర్ణ యజ్ఞోపవీతం, తులసీపత్ర హారం, చతుర్భుజ లక్ష్మీహారం, సువర్ణ పద్మపీఠం, మకరకంఠి, భుజదండభూషణాలు, నాగాభరణాలు, సువర్ణపాదాలు, నూపురాలు, ఉదర బంధం, దశావతార హారం, అష్టోత్తర శతనామ హారం, సహస్ర నామహారం, కంఠాభరణం, పులిగోరు హారం, గోవుహారం, సువర్ణ యజ్ఞోపవీతం, తులసీ పత్రహారం, 4 కిలోల చతర్భుజ లక్ష్మీహారం, 32 కిలోల సహస్రనామ హారం, సూర్య కఠారి (ఖడ్గం), కటి వరద హస్తాలు, నాగాభరణాలు, భుజకీర్తులు, ముఖపట్టీ, ఆకాశరాజు కిరీటం వంటి అనేక ఆభరణాలున్నాయి. ఇవి కాకుండా ఉత్సవాల్లో అలంకరించేందుకు ప్రత్యేక ఆభరణాలు ఉన్నాయి. అందులో రత్నకిరీటం, మేరు పచ్చ, రత్నాలతో చేసిన శంఖుచక్రాలు, సూర్య కఠారి, ఆకాశరాజు కిరీటం, సాలిగ్రామ హారం, కడియాలు, కర భూషణాలు, రత్నాల కరపత్రాలు, రత్నాల కటి వరద హస్తాలు, 7 కిలోల రత్నాల మకర కంఠి, బంగారు హస్తాలు తదితరాలు ముఖ్యమైనవి.

 

పసిడి ధర ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ ఈరోజుల్లో కూడా ఎందరో భక్తులు ఏడుకొండల వెంకన్నకు బంగారు ఆభరణాలు సమర్పిస్తూనే ఉన్నారు.