తిరుమల స్వామి పుష్కరిణి విశిష్టత (Swami Pushkarini)
తిరుమల స్వామి పుష్కరిణి విశిష్టత
(Swami Pushkarini)
దేశంలో మహా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల. తిరుమల తిరుపతి క్షేత్రంలో ఆకాశగంగ, పాపవినాశనం లాగే స్వామి పుష్కరిణి పరమ పవిత్రమైంది.
అసలు స్వామి పుష్కరిణి అనేది వైకుంఠంలో ఉంది. అది శ్రీమహావిష్ణువుది. అయితే శ్రీ వేంకటేశ్వరుని క్రీడా విలాసం కోసం గరుడుడు భూలోకంలో మరో స్వామి పుష్కరిణిని కల్పించాడు.
భక్తులు శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకునేముందు స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తారు. స్వామి పుష్కరిణిలో స్నానం చేసినట్లయితే ముక్కోటి దేవతలను దర్శించుకున్న ఫలితం దక్కుతుంది, పవిత్ర గంగానదిలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది అని చెప్తారు. ముఖ్యంగా ధనుర్మాస ద్వాదశిని ముక్కోటి ద్వాదశి అంటారు. ఆవేళ గనుక స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే అంతకుమించిన పుణ్యం లేదు అంటారు.
స్వామిపుష్కరిణికి నైరుతి వైపున శ్రీవారి ఆలయం ఉంది. వాయువ్యం దిక్కున వరాహస్వామి ఆలయం ఉంది. పశ్చిమ నైరుతిలో రావిచెట్టు ఉంది. స్వామి పుష్కరిణిని దర్శించుకున్న మాత్రాన మనసుకు ప్రశాంతత చిక్కుతుందని నమ్ముతారు భక్తులు.
స్వామి పుష్కరిణిలో తొమ్మిది తీర్ధాలు వచ్చి కలుస్తాయి. పూర్వం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి అభిషేకం చేసిన పుణ్య జలాలు కూడా వచ్చి స్వామి పుష్కరిణిలో కలిసేవని చెప్తారు. భక్తుల రద్దీ ఎక్కువైన తర్వాత స్వామివారికి అభిషేకించిన జలాన్ని మరోవైపు మళ్ళించడంతో స్వామి పుష్కరిణిలో వెళ్ళి చేరడం ఆగింది.మన ఇతిహాసాలు, పురాణాల్లో ఈ ప్రస్తావన ఉంది. అసలు స్వామి పుష్కరిణిని వర్ణించని ధార్మిక గ్రంధం అంటూ లేదు. స్వామి పుష్కరిణి మహత్యాన్ని ఎందరో మహానుభావులు అనేక సందర్భాల్లో ఎంతగానో కొనియాడారు.
బ్రిటిష్ పాలనలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభావంతో ''స్వామి పుష్కరిణి'' అని నమోదు చేశారు. నిజానికి అంతకుముందు స్వామి పుష్కరిణి అని కాకుండా ''చంద్ర పుష్కరిణి'' అని వ్యవహరించేవారు. పూరాణాలు, ప్రాచీన గ్రంధాల్లో ''చంద్ర పుష్కరిణి'' అనే ప్రయోగమే కనిపిస్తుంది. ఇప్పటికీ కొందరు ''చంద్ర పుష్కరిణి'' అని వ్యవహరించడం మన దృష్టిలోకి వస్తూనే ఉంటుంది.
1935లో తాళ్ళపాక అన్నమాచార్యుల పుత్రుడు పెద్ద తిరుమలాచార్యులు స్వామి పుష్కరిణికి మెట్లు కట్టించాడు. అంతే కాదు కోనేటి చుట్టూ అరలు కూడా నిర్మించాడు.
స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి పుష్కరిణిలో మరింత ఉత్సవ సంబరాలు కనిపిస్తాయి. ఆ సమయంలో భక్తుల రద్దీకి అంతు ఉండదు.