Read more!

విశ్వరూపాన్ని చూసి అర్జునుడు భయపడ్డాడా?

 

విశ్వరూపాన్ని చూసి అర్జునుడు భయపడ్డాడా?

మానవ శరీరం ఒకే రంగులో ఉండదు. నలుపు, చామనచాయ, తెల్లటి తెలుపు, ఎరుపు, ఎరుపు నలుపు కలిసిన రంగు ఇలా వివిధరకాలుగా ఉంటుంది. అలాగే జీవరాసులు కూడా అనేక వర్ణాలలో ఉంటాయి. చెట్లు, మొక్కలు, వాటికి పూచిన పూలు వివిధ వర్ణములలో ఉంటాయని తెలుసు. అందుకే అర్జునుడు విరాట్ స్వరూపంలో ఈ అనంత విశ్వం అంతా అనేక చిత్రవిచిత్రమైన రంగుల్లో ఉంది అని అంటున్నాడు. పైగా ఆ ఆకారానికి పైన ఆకాశం హద్దుగా కనపడుతూ ఉంది. దానికి ఆది అంతము లేదు.

మనం కూడా ఆకాశాన్ని అంటే పర్వతాలను చూస్తుంటాము. ఆ పర్వతాల మీదకు వెళితే మేఘాలు మన మీదుగా పోతూ ఉండటం మనం చూస్తుంటాము. అటువంటి పర్వతములు వేలకువేలు ఆకాశాన్నీ తాకుతూ కనపడుతున్నాయి. ఈ అనంతమైన విశ్వరూపం సూర్యుని వెలుగుతో సమానంగా ప్రకాశిస్తూ కళ్లకు మిరుమిట్లు గొలుపుతూ ఉంది. అర్జునుడు ఇంకొంచెం దగ్గరనుండి చూస్తుంటే అనేకమైన నోళ్లు తెరుచుకొని పళ్లు బయట పెట్టి వికృతంగా కనపడుతున్నాయి. లెక్కలేనన్ని కళ్లు విశాలంగా తెరుచుకొని నిప్పులు కక్కుతున్నాయి. ఇప్పుడు అర్జునుడికి భయం ఒళ్లంతా పాకింది.

కృష్ణా! నీ కోరలతో ఉన్న ముఖం, నిప్పులు కక్కే నీ కళ్లు, చూసి నాకు భయంగా ఉంది. నేను తట్టుకోలేక పోతున్నాను. నా మనసులో ఎన్నడూ ఎరగని భయం ప్రవేశించింది. నా ధైర్యం సన్నగిల్లింది. అని భయంతో అరిచాడు అర్జునుడు. ఇప్పటి వరకు అర్జునుడు అందమైన దృశ్యాలను చూసాడు. ఇంకా అందమైన స్త్రీమూర్తులను చూచాడు కానీ ఇటువంటి భయంకరమైన రూపాలను చూడలేదు. 

అందుకని భయంతో వణికిపోతూ "ఓ దేవ దేవా! కాస్త ఆగవయ్యా. నువ్వేమిటి? ఈ రూపం ఏమిటి? నువ్వు ఎలా ఉంటావో చూపించవయ్యా అంటే ఇదేమిటి ఇంత వికృత రూపం చూపిస్తున్నావు. ఇంక చాలు గానీ నీ జగన్మోహనమైన అసలు రూపం చూపించు." అని వేడుకున్నాడు. అంటే ఇక్కడ నిజమైన రూపం అంటే ఈ సృష్టి మొత్తం ఒక్కచోటగా కనిపిస్తే అది భయం పెట్టేదిగా ఉంటుంది. 

భయం ఎందుకు అని అందరికీ అనుమానం కలుగుతుంది. ఈ సృష్టిలో మనిషి కళ్ళకు ఆనందాన్ని ఇచ్చేది మాత్రమే చూడాలని అనుకుంటాడు, సంతోషాన్ని కలిగించే మాటలే వినాలని అనుకుంటాడు. అయితే అవే చాలా ఎక్కువ ఒకేసారి కనబడితే?? నీళ్లలో గడపడం అంటే ఇష్టమైన ఒక వ్యక్తికి ఒక చిన్న కొలను చూపిస్తే సంతోషంగా ఈత కొడతాడు, ఒక నది చూపిస్తే దూరం నుండి ఆనందం పొందుతాడు, మహా అయితే పడవ మీద చక్కర్లు కొడతాడు. కానీ ఒకేసారి పెద్ద సముద్రం ముందు నిలబెడితే ఎగసిపడి ముందుకు వస్తున్న అలలను చూసి భయపడతాడు. ఇక్కడ కూడా పరమాత్మ రూపం ఈ సృష్టి మొత్తాన్ని తనలో నింపుకుని కనబడెసరికి అర్జునుడు భయపడిపోయాడు.

అర్జునుడి అరుపులు అరణ్యరోదనలు అయ్యాయి. పరమాత్మ తన విశ్వరూపాన్ని ఉపసంహరించలేదు. మరలా అర్జునుడు ఇలా అన్నాడు. "ఓ దేవదేవా! కోరలతో భయంకరమైన నీ నోరు, ప్రళయాగ్నులు వెదజల్లుతున్న నీ ముఖం చూస్తుంటే నాకు దిక్కుతోచడం లేదు. సుఖము, శాంతి ఎగిరిపోయాయి. ప్రస్తుతం భయం ఒళ్లంతా ఆవరించింది. కాస్త నా యందు దయయుంచి నీ ప్రసన్నమైన రూపంలోకి రావయ్యా అని వేడుకున్నాడు అర్జునుడు. అడగడం నీ వంతు, వద్దనడం నీ వంతేనా అని అనుకున్నాడేమో కృష్ణపరమాత్మ తన విశ్వరూపాన్ని ఇంకొంచెం విపులంగా అర్జునుడి మనస్సులో గోచరింపజేసాడు.

◆వెంకటేష్ పువ్వాడ.